దిగివచ్చిన హోల్‌సేల్ ధరల ద్రవ్యోల్బణం.. ఉల్లి, ఆలు ధరలు తగ్గడమే ప్రధాన కారణమంటున్న నిపుణులు
వంటింటి అవసరాలైన ఉల్లి, ఆలు ధరలు తగ్గడంతో డిసెంబర్‌లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గింది.
హోల్‌సేల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) కాస్త దిగివచ్చింది. 2020 డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం 1.22 శాతంగా నమోదైంది. ఇది ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడానికి కారణమైంది ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. టోకు ద్రవ్యోల్బణం.. 2020 నవంబర్‌లో 1.55 శాతంగా నమోదు కాగా, 2019 డిసెంబర్లో 2.76 శాతంగా నమోదైంది. ముఖ్యంగా వంటింటి అవసరాలైన ఉల్లి, ఆలు ధరలు తగ్గడంతో డిసెంబర్‌లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గింది.
ఆహార పదార్థాల డబ్ల్యూపీఐ 2020 నవంబర్‌లో ఇది 1.55% ఉండగా, 2019 డిసెంబర్‌లో 2.76 శాతంగా ఉండేదని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. దీంతో 2020 నవంబర్‌లో 4.27 శాతంగా ఉన్న డబ్ల్యూపీఐ ఆహార సూచీ 2020 డిసెంబర్‌లో 4.27 శాతం నుంచి ఏకంగా 0.92 శాతానికి దిగొచ్చింది. పరిశ్రమ, అంతర్గత వాణిజ్యాన్ని పెంచడానికి ఆ విభాగం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ విషయాన్ని వెల్లడించింది. రిటైల్ ద్రవ్యోల్బణం కూడా డిసెంబరులో 4.59 శాతానికి తగ్గింది.
డిసెంబర్‌లో కూరగాయాల హోల్‌సేల్ ధరలు 13.2 శాతానికి తగ్గాయని ప్రభుత్వం తన నివేదికలో వెల్లడించింది. నవంబర్‌లో ఇది 12.24 శాతంగా ఉండేదని పేర్కొంది. నవంబర్‌లో 115.12 శాతంగా ఉన్న బంగాళాదుంపల ద్రవ్యోల్బణం డిసెంబర్‌కు 37.75 శాతానికి తగ్గింది. అంతకుముందు నెలతో పోలిస్తే వరి, ధాన్యాలు, గోధుమలు, పప్పుల ద్రవ్యోల్బణం రేటు డిసెంబర్లో మరింత తగ్గింది.
ఆహార ధరల ద్రవ్యోల్బణం కాస్త తగ్గుతుండగా డిసెంబర్లో తయారీ ఉత్పత్తుల ధరలు మాత్రం 4.24 శాతానికి పెరిగాయి. నవంబర్‌లో ఇది 2.97 శాతంగా ఉంది. ఫలితంగా ఆహార వస్తువు, పానీయాలు, వస్త్రాలు, రసాయనాలు, ఔషధాలు, సిమెంటు ధరలు పెరిగాయి. ఇంధనం, విద్యుత్ ధరలు సైతం స్వల్పంగా పెరిగాయి.