అప్పుడే కొరత తీవ్రం, సెంటర్లు మూసివేత, ముంబైలో మూడు రోజుల పాటు నో వ్యాక్సిన్ ,
వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉన్న దృష్ట్యా, ముంబైలో మూడు రోజులపాటు వ్యాక్సిన్ సెంటర్లను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు వ్యాక్సినేషన్ డ్రైవ్...
వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉన్న దృష్ట్యా, ముంబైలో మూడు రోజులపాటు వ్యాక్సిన్ సెంటర్లను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు వ్యాక్సినేషన్ డ్రైవ్ ఉండబోదని గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. 18 నుంచి 45 ఏళ్ళ మధ్య వయస్సువారికి మే 1 నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిందని, కానీ టీకామందు కొరత తీవ్రంగా ఉన్నందున ప్రస్తుతానికి 3 రోజులపాటు ఈ డ్రైవ్ ఉండదని అధికారులు తెలిపారు. వ్యాక్సినేషన్ తేదీలను ఇంకా వాయిదా వేసే అవకాశం ఉందని కూడా వారు చెప్పారు. ఏప్రిల్ 30 నుంచి మే 2 వరకు వ్యాక్సినేషన్ సెంటర్లు మూసి ఉంటాయని ఓ నోటీసులో పేర్కొన్నారు. ఒకవేళ ఈ లోగా టీకామందు వస్తే మీడియా లేదా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తామని వారు వివరించారు. సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్ళు అంతకన్నా వయస్సు పైబడినవారు సెంటర్ల వద్ద పడిగాపులు పడవద్దని, గుంపులుగా చేరవద్దని ఈ నోటీసులో అభ్యర్థించారు. తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నవారికి వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉందని మాత్రం వివరించారు. . కచ్చితంగా మే 1 నుంచి టీకామందులు వేసే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పలేమని వారు స్పష్టం చేశారు. నిన్నటి నుంచే నగరానికి వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. 1.5 లక్షల డోసులు రావలసి ఉండగా అది అందలేదని అధికారులు వెల్లడించారు.
ఈ నెల 27 న 3 లక్షల 87 వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వగా, బుధవారం నాటికి ఇది 2 లక్షల 37 వేలకు తగ్గిపోయింది. మహారాష్ట్రలో కనీసం 1.55 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంది. ఈ ఈ రాష్ట్రంతో బాటు పంజాబ్, ఢిల్లీ, తమిళనాడు వంటి రాష్ట్రాలు టీకామందుల కొరతను ఎదుర్కొంటున్నాయి.ముంబైలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ రాష్ట్రంలో కొత్తగా 66,159 కేసులు నమోదు కాగా-గురువారం ఒక్కరోజే 771 మంది రోగులు మరణించారు.