Unauthorised vaccination: అస్సాంలో కోవిడ్ టీకా రెండు వేలు.. సమాంతర వ్యాక్సినేషన్ కేంద్రం నడుపుతున్న ఆరోగ్యకార్యకర్తలు!
Unauthorised vaccination: కరోనా మహమ్మారితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాక్సిన్ వేయించుకుంటే కరోనా ముప్పును తప్పించుకోవచ్చని అందరూ భావిస్తున్నారు.
Unauthorised vaccination: కరోనా మహమ్మారితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాక్సిన్ వేయించుకుంటే కరోనా ముప్పును తప్పించుకోవచ్చని అందరూ భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో కరోనా టీకాను ప్రజలందరికీ అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. అయితే, ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకోవడానికి ఎప్పుడూ కొంత మంది సిద్ధంగా ఉంటారు. వారికి డబ్బు కావాలి అంతే. దానికోసం ఎటువంటి పనికైనా సిద్ధం అవుతారు. అస్సాంలో ఆరోగ్య కార్యకర్తలు కొందరు బృందంగా మారి కోవిడ్ టీకాలను అమాయక ప్రజలకు ఎక్కువ ధరకు అమ్మకం మొదలు పెట్టారు. ఇలా ఒకరూ ఇద్దరూ కాదు దాదాపు 80 మందికి పైగా వీరికి సొమ్ములు సమర్పించుకుని వ్యాక్సిన్ వేయించుకున్నారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
అస్సాంలోని సిల్చార్ సివిల్ ఆసుపత్రిలో సమాంతర కోవిడ్ -19 టీకా కేంద్రాన్ని ప్రారంభించేశారు కొందరు ఆరోగ్య కార్యకర్తలు. దీనికోసం సరైన ప్రక్రియను పాటించకుండా అలాగే ప్రతి మోతాదుకు రెండు వేలరూపాయలు వసూలు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. వీరు కోవిషీల్డ్ టీకాను దాదాపు 80 మందికి ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే, కనీసం వారి వివరాలు కూడా వీరు సేకరించలేదు.
అర్బన్ హెల్త్ సెంటర్ పేరిట సుమారు పది టీకాలు జారీ చేసినట్లు రికార్డులలో ఉందని అస్సాం ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే, వీటిని ఆసుపత్రిలో ఇవ్వాల్సిన వారికి బదులుగా అదే ఆసుపత్రిలో ఆరోగ్యకార్యకర్తలు నడుపుతున్న సమాంతర టీకా కేంద్రంలో ప్రజలకు టీకాలు వేయడానికి ఉపయోగించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఆరోగ్య కార్యకర్త స్వర్ణజిత్ పాల్, సీనియర్ నర్సు సర్బానీ రాయ్ ఈ అనధికారిక టీకా స్థలాన్ని పర్యవేక్షిస్తున్నట్లు గుర్తించారు. అక్కడ ఆరోగ్య శాఖ అధికారులకు 100 కి పైగా ఉపయోగించిన సిరంజిలు, కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు చెందిన కొన్ని ఖాళీ సీసాలు దొరికాయి. ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం ఒక గది లోపల జనం గుంపుగా ఉండటం అనుమానాన్ని రేకెత్తించడంతో మొత్తం ఆపరేషన్ వెలుగులోకి వచ్చింది. జిల్లా అదనపు చీఫ్ మెడికల్ & హెల్త్ ఆఫీసులోని కొంతమంది సిబ్బందికి ఇక్కడ ఏం జరుగుతోందనే అనుమానం వచ్చింది. వెంటనే వారు అధికారులకు సమాచారం ఇచ్చి దీనిపై ఆరా తీశారు. సర్బానీ రాయ్, స్వర్ణజిత్ పాల్ నమోదు చేయని లబ్ధిదారులకు కోవిడ్ -19 వ్యాక్సిన్లను ఎటువంటి రికార్డు లేకుండా ఇచ్చినట్లు అంగీకరించారు. అయితే, వారు కొందరు సీనియర్ అధికారుల ఆదేశాల మేరకు ఈ పనిచేస్తున్నట్లు చెప్పడం గమనార్హం.
తాను ఇటీవల సిల్చార్‌లోని సివిల్ ఆసుపత్రిలో చేరానని, ఎటువంటి ధృవీకరణ లేకుండా ప్రజలకు టీకాలు వేయాలని “ఆదేశించారు” అని సర్బానీ రాయ్ చెప్పారు. “మేము సోమవారం 50 మందికి మరియు ఈ రోజు 30 మందికి టీకాలు వేసాము. నేను ఒక ఆరోగ్య కార్యకర్త నుండి వ్యాక్సిన్ బాటిల్స్ అందుకున్నాను, కాని అతని పేరు నాకు తెలియదు. నేను ఒంటరి తల్లిని, ఈ ఉద్యోగంతో నా కుటుంబాన్ని పోషించాలి. ఇది చట్టబద్ధమైనదా కాదా అని నాకు తెలియదు. ” అంటూ సర్బానీ రాయ్ చెబుతున్నారు.
వ్యర్థ పదార్థాల నిర్వహణ పథకం మార్గదర్శకాల ప్రకారం వ్యర్థాలు పోయే అవకాశం ఉన్న టీకాలను తాము వాడుతున్నామని స్వర్ణజిత్ పాల్ పేర్కొన్నారు. “టీకాలు వేసే ప్రక్రియలో కనీసం 10% వ్యాక్సిన్లు వృధా అవుతాయి, టీకా సగం ఉపయోగించిన సీసాల నుండి ప్రజలకు టీకాలు వేయడానికి మాకు అనుమతి ఉంది. వ్యర్థ పదార్థాల నిర్వహణలో మేము శనివారం ఈ ప్రక్రియను ప్రారంభించాము, కాని తరువాత కొన్ని కొత్త టీకాలు ఇందుకోసం ఉపయోగించినట్టు తెలిసింది. ” అని స్వర్ణజిత్ పాల్ చెప్పుకొచ్చారు. అదేవిధంగా తాను చాలా సీనియర్ అధికారి నుండి టీకాలు వేయవలసిన వ్యక్తుల జాబితాను అందుకున్నానని పేర్కొన్నాడు.
కాచార్ జిల్లా అదనపు డిప్యూటీ కమిషనర్ (ఆరోగ్యం) సుమిత్ సత్తవన్ వ్యాక్సిన్ (Unauthorised vaccination)దుర్వినియోగంపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈ కేసులో పాల్గొన్న అధికారులపై 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని సత్తవన్ తెలిపారు.
సిల్చార్ పట్టణంలో నివసిస్తున్న 55 ఏళ్ల నివాసి, రిజిస్ట్రేషన్ లేకుండా వ్యాక్సిన్ తీసుకున్నాడు, అతను ఒక మోతాదుకు రెండువేలు చెల్లించినట్లు చెప్పాడు. “నేను మొదటి మోతాదుతో టీకాలు వేసుకున్నాను, కాని ఇప్పుడు రెండవ మోతాదు గురించి కొంచెం ఆందోళనతో ఉన్నాను. ఎందుకంటే, ఇక్కడ నాకు మళ్ళీ రెండో డోసు వేస్తారో వేయరో అంటూ చెప్పుకొచ్చాడు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, అస్సాంలో 5.92% టీకాలు వ్యర్ధం అవుతున్నాయి. హర్యానా 6.49 శాతం టీకా వ్యర్ధలతో దేశంలోనే అగ్రస్థానంలో ఉండగా.. అస్సాం రెండో స్థానంలో ఉండడం గమనార్హం.