Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. శ్రీవాణి దర్శన టికెట్లపై టీటీడీ కీలక ప్రకటన..
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్‌పై వస్తున్న వార్తల నేపథ్యంలో భక్తులు అపోహలకు గురికావద్దని స్పష్టం చేసింది. కొందరు దళారులు ఏఐ ఆధారిత ఆటో ఫిల్లింగ్, ఆటో కాపీయింగ్ వంటి పద్ధతులతో టికెట్లు బుక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ.. అధికారిక వ్యవస్థను హ్యాక్ చేయడం అసాధ్యమని టీటీడీ తెలిపింది. అనుమానాస్పద బుకింగ్‌లను గుర్తించి వెంటనే బ్లాక్ చేస్తున్నామని వెల్లడించింది. భక్తులు కేవలం అధికారిక వెబ్సైట్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించింది.

తిరుమల, 2026 మే 13: ఇటీవల కొన్ని పత్రికలు, సోషల్ మీడియా వేదికల్లో శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్‌కు సంబంధించి వస్తున్న వార్తల నేపథ్యంలో భక్తులు అపోహలకు గురికావద్దని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీటీడీ బుధవారం ప్రకటన విడుదల చేసింది. టీటీడీ శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్ విధానాన్ని 2019 మే నెలలో ప్రవేశపెట్టింది. అప్పటి నుండి భక్తులు మధ్యవర్తుల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవడం జరుగుతోంది.
అందులోని లోటుపాట్లను, భక్తుల నుండి వచ్చిన సూచనలు, సలహాల మేరకు 2024 సంవత్సరం జూన్ నుండి భక్తులకు పారదర్శకంగా, సురక్షితంగా సేవలు అందించేందుకు శ్రీవాణి టికెట్ బుకింగ్ విధానాన్ని అత్యంత పటిష్టంగా రూపొందించడం జరిగింది.
శ్రీవాణి టికెట్ బుకింగ్ సైట్‌ను హ్యాక్ చేయడం లేదా వ్యవస్థలో చొరబడటం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. భక్తులు అపోహలకు గురి కావద్దు. అయితే కొందరు దళారులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ ఏఐ ఆధారిత ఆటో ఫిల్లింగ్, ఆటో కాపీయింగ్ వంటి పద్ధతుల ద్వారా వేగంగా వివరాలు నమోదు చేసి టికెట్లను బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇలాంటి అనుమానాస్పద కార్యకలాపాలను టీటీడీ సాంకేతిక విభాగం ఎప్పటికప్పుడు గుర్తించి సంబంధిత ఐడీలు, అక్రమ బుకింగ్ విధానాలను వెంటనే నిరోధించి తదనుగుణంగా సాప్ట్ వేర్ ను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ నిరంతర నిఘా ఉంచడం జరుగుతోంది. అదేవిధంగా కొంతమంది దళారులు భక్తులను తప్పుదోవ పట్టించి నకిలీ టికెట్లను విక్రయిస్తున్న నిందితులపై కూడా టీటీడీ కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతోంది.
అదేవిధంగా అడ్వాన్స్ బుకింగ్ సాప్ట్ వేర్ ను ముందు వచ్చిన వారికి ముందు బుక్ చేసుకునే విధానంలో అభివృద్ధి చేయడం జరిగింది. బుకింగ్ సమయంలో ఏదైనా కారణంగా టికెట్ బుక్ కాకపోయినా లేదా నగదు చెల్లింపులో లోపం తలెత్తితే వెంటనే ఆ టికెట్లు భక్తులకు అందుబాటులోకి వచ్చేలా ఈ అప్లికేషన్ పని చేస్తోంది.
భక్తులు కేవలం అధికారిక టీటీడీ వెబ్సైట్, అధికారిక మార్గాల ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని టీటీడీ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.
వీఐపీ బ్రేక్ దర్శనం..
శ్రీవాణి (SRIVANI) ట్రస్టు టికెట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ద్వారా భక్తులకు VIP బ్రేక్ దర్శనం కల్పించే ఒక ప్రత్యేక పథకం. ఒక్కొక్కరికి రూ.10,000 విరాళం ఇవ్వడం ద్వారా ఈ టికెట్ పొందవచ్చు. ఆన్లైన్లో ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా లేదా తిరుపతి విమానాశ్రయం/తిరుమలలోని కౌంటర్లలో ఈ టికెట్లు పొందవచ్చు. విరాళంతోపాటు.. రూ.500 దర్శన టికెట్ కలిపి మొత్తం రూ.10,500లు అవుతుంది. బ్రేక్ దర్శనంలో స్వామివారి దర్శనాన్ని కల్పిస్తారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
