తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలు బంద్..శుభకార్యాలకు బ్రేక్..? జూన్ 19 వరకు వేచి చూడాల్సిందే! కారణం
తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సుమారు 36 రోజుల పాటు శుభకార్యాలకు విరామం కలగనుంది. మళ్లీ జూన్ 19 నుండి కొత్త ముహూర్తాలు ప్రారంభం కానున్నాయని పురోహితులు పేర్కొంటున్నారు. ఈ విరామం వల్ల పౌరోహిత్యం, కల్యాణ మండపాలు, క్యాటరింగ్, ఫొటోగ్రఫీ వంటి రంగాలపై ఆధారపడిన వేలాది మంది ఉపాధిపై ప్రభావం పడనుంది. బుధవారం ఆఖరి పెద్ద ముహూర్తం కావడంతో పుణ్యక్షేత్రాల్లో వివాహాలు భారీగా జరిగాయి. ఇంతకీ, అసలు సంగతేంటో ఇప్పుడు చూద్దాం..

తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది నెలలుగా సందడిగా సాగుతున్న పెళ్లి బాజాలు కొన్నాళ్ల పాటు మూగబోనున్నాయి. శుభకార్యాలకు అత్యంత ప్రధానమైన ముహూర్తాల విషయంలో రేపటి నుంచి సుమారు 36 రోజుల పాటు విరామం ఏర్పడనుంది. అధిక జ్యేష్ఠ మాసం (మూఢమి) ప్రవేశిస్తుండటంతో, హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించే వివాహాది శుభకార్యాలకు తాత్కాలికంగా బ్రేక్ పడనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నిరంతరాయంగా సాగిన పెళ్లిళ్ల సందడికి మే 18 నుంచి జూన్ 18 వరకు విరామం ప్రకటించినట్లయింది. మళ్లీ జూన్ 19 నుంచి కొత్త ముహూర్తాలు ప్రారంభం కానున్నాయని ప్రముఖ పురోహితులు కొత్తపల్లి వెంకట సత్య సుబ్రహ్మణ్యం ( శ్రీనివాస్ ) స్పష్టం చేస్తున్నారు.
అధిక జ్యేష్ఠ మాసం ప్రభావం.. నిలిచిపోనున్న శుభకార్యాలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నెల 18వ తేదీ నుంచి జూన్ 18వ తేదీ వరకు అధిక జ్యేష్ఠ మాసం రావడంతో ఈ కాలాన్ని ‘మూఢమి’గా పరిగణిస్తారు. ఈ సమయంలో వివాహాలు మాత్రమే కాకుండా, గృహప్రవేశాలు, ఆస్తుల కొనుగోళ్లు, వ్యాపార ప్రారంభోత్సవాలు వంటి ఎలాంటి శుభకార్యాలూ నిర్వహించకూడదని ద్వారకాతిరుమల క్షేత్ర పురోహితులు గోవింద వర్షుల వెంకటరమణ మూర్తి శర్మ తెలిపారు. ఇప్పటికే సంబంధాలు కుదుర్చుకున్న వారు, నిశ్చితార్థాలు పూర్తి చేసుకున్న వారు సైతం ఈ 36 రోజుల పాటు వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే బుధవారం ఎక్కువగా ముహూర్తాలు ఉన్నాయి. ఆఖరి పెద్ద ముహూర్తం కావడంతో ద్వారకాతిరుమల సహా తెలుగు రాష్ట్రాల్లో అన్ని పుణ్యక్షేత్రాల్లో వివాహాలు భారీ ఎత్తున జరిగాయి.
ఆర్థిక చక్రంపై ‘మూఢమి’ దెబ్బ.. ఉపాధి కోల్పోనున్న రంగాలు
శుభకార్యాలకు బ్రేక్ పడటంతో కేవలం పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురు ఇళ్లే కాకుండా, దీనిపై ఆధారపడి జీవించే వేలాది మంది ఉపాధిపై కూడా ప్రభావం పడనుంది. ప్రధానంగా పౌరోహిత్యం చేసే పురోహితులు, కల్యాణ మండపాల నిర్వాహకులు, డెకరేషన్ చేసే వారు, షామియానా పందిళ్లు వేసేవారు తీవ్రంగా ప్రభావితం కానున్నారు. అలాగే వాయిద్యకారులు, క్యాటరింగ్ వ్యాపారులు, లైటింగ్ మరియు ఫొటోగ్రఫీ రంగాలకు చెందిన వారికి ఈ 36 రోజుల పాటు పని ఉండదు. ఫిబ్రవరి నుంచి తీరిక లేకుండా గడిపిన ఈ రంగాల వారంతా ఇప్పుడు ఒక సుదీర్ఘ విరామాన్ని ఎదుర్కోక తప్పదు.
విరామం అనంతరం జూన్ 19 నుంచి తిరిగి శుభ ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. జూన్ నెలలో 19, 20, 21, 24, 25, 26, 27, 28 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. జూలైలో 1 నుంచి 5 వరకు, 8, 9 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. ఆగస్టు నెలలో 16వ తేదీ నుంచి వరుసగా నెలాఖరు వరకు, సెప్టెంబరులో మొదటి వారంలో కొన్ని ముహూర్తాలు కనిపిస్తున్నాయి. అక్టోబరు 11 నుంచి మళ్లీ ముహూర్తాలు ఊపందుకుని, డిసెంబరు 31 వరకు ఈ ఏడాదిలో అనేక శుభ ఘడియలు ఉన్నట్లు పంచాంగ కర్తలు చెబుతున్నారు.
మొత్తానికి, వచ్చే నెల రోజులకు పైగా పెళ్లి సందడి లేకపోయినా, జూన్ మూడో వారం నుంచి మళ్లీ తెలుగు ఇళ్లలో మంగళవాయిద్యాలు మారుమోగనున్నాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




