AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kieron Pollard: విధ్వంసక వీరుడి అరుదైన ఘనత.. టీ20ల్లో మరో రికార్డు సృష్టించిన పొలార్డ్‌

Kieron Pollard: కీరన్ పొలార్డ్‌ టీ20 క్రికెట్‌లో 15 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉండగా, పొలార్డ్‌ అతడికి చేరువలో ఉన్నాడు. అయితే బట్లర్‌ను అధిగమించి నంబర్‌ వన్‌ కావాలంటే పొలార్డ్‌ మరో 49 పరుగులు చేయాలి. 48 పరుగులు చేస్తే ఇద్దరి స్కోర్లు సమానమవుతాయి.

Kieron Pollard: విధ్వంసక వీరుడి అరుదైన ఘనత.. టీ20ల్లో మరో రికార్డు సృష్టించిన పొలార్డ్‌
Kieron Pollard
Rakesh
|

Updated on: Nov 23, 2026 | 3:45 PM

Share

Kieron Pollard: వెస్టిండీస్‌ మాజీ విధ్వంసక బ్యాటర్‌ కీరన్‌ పొలార్డ్‌ టీ20 క్రికెట్‌లో మరో అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్‌లో 15 వేల పరుగుల మైలురాయిని అందుకున్న రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20లో భాగంగా ఎంఐ ఎమిరేట్స్‌ తరఫున ఆడుతూ ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ మొదటి స్థానంలో ఉండగా.. పొలార్డ్‌ రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య పరుగుల తేడా చాలా తక్కువగా ఉంది.

తొలి పరుగుతోనే 15 వేల క్లబ్‌లోకి..

ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 2026-27 సీజన్‌లో భాగంగా నవంబర్‌ 21న దుబాయ్‌ వేదికగా డెజర్ట్‌ వైపర్స్‌తో ఎంఐ ఎమిరేట్స్‌ తలపడింది. ఈ మ్యాచ్‌కు ముందు పొలార్డ్‌ టీ20 పరుగులు 14,999గా ఉన్నాయి. అంటే 15 వేల పరుగుల మైలురాయిని చేరుకోవడానికి ఒక్క పరుగు మాత్రమే అవసరమైంది. బ్యాటింగ్‌కు దిగిన అతడు తొలి పరుగుతోనే ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 15 బంతులు ఎదుర్కొని 15 పరుగులు చేశాడు. దీంతో అతడి మొత్తం టీ20 పరుగుల సంఖ్య 15,014కు చేరింది. జోస్‌ బట్లర్‌ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు.. ఓపెనర్‌గా కాకుండా మిడిలార్డర్‌ బ్యాటర్‌గా 15 వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా మరో ప్రత్యేక రికార్డు అందుకున్నాడు.

బట్లర్‌ రికార్డుకు చేరువలో పొలార్డ్‌..

టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం బట్లర్‌ 15,062 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. పొలార్డ్‌ 15,014 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వీరిద్దరి మధ్య తేడా కేవలం 48 పరుగులే. అంటే బట్లర్‌ స్కోరును సమం చేయాలంటే పొలార్డ్‌కు 48 పరుగులు కావాలి. అతడిని అధిగమించి నంబర్‌ వన్‌ స్థానానికి చేరుకోవాలంటే మాత్రం మరో 49 పరుగులు చేయాలి. నవంబర్‌ 24న గల్ఫ్‌ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌లో పొలార్డ్‌కు ఈ అవకాశం ఉంది.

టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్‌-10 బ్యాటర్లు

టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో బట్లర్‌, పొలార్డ్‌ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఆ తర్వాత ఇంగ్లండ్‌ ఆటగాడు అలెక్స్‌ హేల్స్‌, వెస్టిండీస్‌ దిగ్గజం క్రిస్‌ గేల్‌, ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఉన్నారు. భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ కూడా ఈ జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.

జోస్‌ బట్లర్‌ – 15,062 పరుగులు

కీరన్‌ పొలార్డ్‌ – 15,014 పరుగులు

అలెక్స్‌ హేల్స్‌ – 14,581 పరుగులు

క్రిస్‌ గేల్‌ – 14,562 పరుగులు

డేవిడ్‌ వార్నర్‌ – 14,411 పరుగులు

విరాట్‌ కోహ్లీ – 14,218 పరుగులు

జేమ్స్‌ విన్స్‌ – 14,218 పరుగులు

షోయబ్‌ మాలిక్‌ – 13,571 పరుగులు

క్వింటన్‌ డికాక్‌ – 13,046 పరుగులు

ఫాఫ్‌ డుప్లెసిస్‌ – 12,784 పరుగులు

755 మ్యాచ్‌లు.. 341 వికెట్లు కూడా!

పొలార్డ్‌ టీ20 కెరీర్‌ గణాంకాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటివరకు 755 టీ20 మ్యాచ్‌లు ఆడిన అతడు.. 672 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌ చేశాడు. 31.67 సగటు, 150.84 స్ట్రైక్‌రేట్‌తో 15,014 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 71 అర్ధసెంచరీలు ఉన్నాయి. అతడి అత్యధిక స్కోరు 104 పరుగులు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ పొలార్డ్‌ తనదైన ముద్ర వేశాడు. 436 ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్‌ చేసి 25.36 సగటుతో 341 వికెట్లు పడగొట్టాడు. అతడి అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు 4/15. ఎనిమిది సార్లు నాలుగు వికెట్ల ఘనత సాధించాడు. అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా కూడా పొలార్డ్‌ రికార్డు సృష్టించాడు. అతడి తర్వాత సునీల్‌ నరైన్‌ 618 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు.

ఎంఐ ఎమిరేట్స్‌కు తొలి మ్యాచ్‌లోనే ఘన విజయం

ఈ రికార్డు సాధించిన మ్యాచ్‌లో పొలార్డ్‌ కెప్టెన్సీలోని ఎంఐ ఎమిరేట్స్‌ కూడా అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐ ఎమిరేట్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 174 పరుగులు చేసింది. కుశాల్‌ పెరీరా 58 పరుగులతో రాణించగా.. పొలార్డ్‌ 15 పరుగులు చేశాడు. లక్ష్య ఛేదనలో డెజర్ట్‌ వైపర్స్‌ 122 పరుగులకే ఆలౌటైంది. క్రిస్‌ జోర్డాన్‌ నాలుగు వికెట్లు, జహూర్‌ ఖాన్‌ మూడు వికెట్లు పడగొట్టారు. దీంతో ఎంఐ ఎమిరేట్స్‌ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. వ్యక్తిగతంగా 15 వేల పరుగుల మైలురాయి.. జట్టుకు విజయంతో పొలార్డ్‌కు ఈ మ్యాచ్‌ ప్రత్యేకంగా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us