AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Traffic Alert: హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఆదివారం ఈ రూట్‌టలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఇదిగో పూర్తి వివరాలు

హైదరాబాద్‌ ప్రజలకు మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులకు కీలక సూచనలు జారీ చేశారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ సభ నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్టు తెలిపారు. కాబట్టి వాహనదారులు ఈ ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

Traffic Alert: హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఆదివారం ఈ రూట్‌టలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఇదిగో పూర్తి వివరాలు
Hyderabad Traffic Restrictions
Ranjith Muppidi
| Edited By: |

Updated on: May 09, 2026 | 9:00 PM

Share

సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ లో ఆదివారం నిర్వహించనున్న ప్రధాని మోదీ బహిరంగ సభ నేపథ్యంలో మల్కాజిగిరి పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మే 10న మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. బేగంపేట నుంచి సంగీత్ జంక్షన్ వైపు వెళ్లే వాహనాలు పారడైజ్–పాట్నీ–క్లాక్‌టవర్–సంగీత్ మార్గాన్ని వినియోగించాలని పోలీసులు సూచించారు. అదే విధంగా సంగీత్ నుంచి బేగంపేట వైపు వచ్చే వాహనాలకు కూడా ఇదే మార్గాన్ని అనుమతించనున్నారు.

ఇక బేగంపేట నుంచి తిరుమలగిరి వెళ్లే వాహనాలు ఫ్లైఓవర్లు–సెయింట్ జాన్స్ రోటరీ–షెనాయ్ నర్సింగ్ హోం–ఏఓసీ సెంటర్–కేవీ–తిరుమలగిరి మార్గంలో వెళ్లాలని సూచించారు. తిరుమలగిరి నుంచి బేగంపేటకు వచ్చే వాహనాలకు కూడా ఇదే మార్గం గుండా వెళ్లాలని సూచించారు. ఇక బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలను బాలానగర్ జంక్షన్–ఫతేనగర్–అమీర్‌పేట్–పంజాగుట్ట–బేగంపేట మార్గం వైపు మళ్లించనున్నారు. ప్రత్యామ్నాయంగా పంజాగుట్ట–బేగంపేట–రసూల్‌పురా జంక్షన్–మినిస్టర్స్ రోడ్–రాణిగంజ్–సికింద్రాబాద్ మార్గాన్ని వినియోగించుకోవచ్చని పోలీసులు తెలిపారు.

సికింద్రాబాద్ నుంచి తిరుమలగిరి వెళ్లే వాహనాలు క్లాక్‌టవర్-సంగీత్- సెయింట్ జాన్స్ రోటరీ-షెనాయ్ నర్సింగ్ హోం–ఏఓసీ–కేవీ–తిరుమలగిరి మార్గంలో వెళ్లాలని సూచించారు. సికింద్రాబాద్ నుంచి బోయిన్‌పల్లి వెళ్లే వాహనాలు క్లాక్‌టవర్–పాట్నీ–పారడైజ్–సీటీఓ–బోయిన్‌పల్లి మార్గాన్ని వినియోగించుకోవాలన్నారు. అలాగే ట్యాంక్‌బండ్ నుంచి తిరుమలగిరి వెళ్లే వాహనాలు పారడైజ్–సీటీఓ–తాడ్‌బండ్–డైమండ్ పాయింట్–బోయిన్‌పల్లి మార్కెట్–తిరుమలగిరి మార్గం వైపు మళ్లించబడతాయని తెలిపారు. భారీ వాహనాలు, ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు పరేడ్ గ్రౌండ్స్ వైపు వెళ్లే రహదారులను వీలైనంతవరకు నివారించాలని పోలీసులు సూచించారు. ప్రజలు మెట్రో రైలు సేవలు, ఇతర ప్రజారవాణా సౌకర్యాలను వినియోగించాలని కోరారు.

2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు

మల్కాజ్‌గిరి నూతన సీపీ సుమతి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మొత్తం 2 వేల మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం మోహరించినట్లు కమిషనర్ తెలిపారు. అనుమతి లేని వ్యక్తులను పరిమిత ప్రాంతాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. సభా ప్రాంగణం, చేరుకునే రహదారులు, వాహనాల తనిఖీ కేంద్రాలు, పార్కింగ్ ప్రాంతాలన్నీ సీసీ కెమెరాల నిఘాలో ఉంటాయని పేర్కొన్నారు. సీసీటీవీ ఫీడ్లను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

బాంబ్ డిస్పోజల్ బృందాలతో యాంటీ సబోటేజ్ తనిఖీలు నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎస్‌ఐ స్థాయి పైబడి ఉన్న అధికారులందరికీ వేగవంతమైన సమాచార మార్పిడికి వీఎచ్‌ఎఫ్ సెట్లు అందజేసినట్లు చెప్పారు. ప్రవేశ ద్వారాల వద్ద ఆధునిక భద్రతా స్కానర్లు ఏర్పాటు చేయగా, బాంబ్ స్క్వాడ్లు, స్నిఫర్ డాగ్ బృందాలు మోహరించారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా బృందాలు పనిచేస్తుండగా, ఎలక్ట్రానిక్ పరికరాల తనిఖీల కోసం సాంకేతిక బృందాలను కూడా నియమించినట్లు కమిషనర్ వివరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us