జగన్ రెడ్డికి ఉత్తమ్ రెడ్డి ప్రశంసలు
కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చడానికి టీఆర్ఎస్ సర్కారుకు ఉన్న సమస్యేంటని నిలదీశారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తేందుకు ప్రజలు భయపడుతున్నారని..

కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చడానికి టీఆర్ఎస్ సర్కారుకు ఉన్న సమస్యేంటని నిలదీశారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తేందుకు ప్రజలు భయపడుతున్నారని, ప్రైవేటు ఆస్పత్రుల్లో బిల్లులు భరించలేని స్థితిలో ఉంటున్నాయని ఆయన అన్నారు. కరోనా కట్టడి విషయంలో పక్కనే ఉన్న ఏపీ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలని కేసీఆర్ సర్కారుకు ఉత్తమ్ హితవు పలికారు. ప్రజలకు అండగా ఉండేందుకే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఆధ్వర్యంలో ఆస్పత్రుల సందర్శన నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీశైలం దుర్ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. కేసీఆర్ సర్కారుపై ప్రజల్లో క్రమేణా వ్యతిరేకతపెరుగుతోందన్న ఉత్తమ్.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. హైదరాబాద్ గాంధీభవన్ లో సేవాదళ్ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించిన అనంతరం డీసీసీ అధ్యక్షులతో సమావేశమైన ఉత్తమ్ కుమార్ రెడ్డి తదుపరి నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.