AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ వర్షాలకు హైదరాబాద్‌లో 30 మంది..

హైదరాబాద్‌లో వరదలకు 30 మందికిపైగా మృతిచెందారు. ఇంకా చాలా మంది జాడ లేకుండా పోయింది. భారీవర్షాలకు కొట్టుకుపోయిన ఒక్కొక్కరి డెడ్‌బాడీలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఊహించని ఉపద్రవం.. కొన్ని కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపితే.. మరికొందరిని కోలుకోలేని విధంగా చేసింది...

భారీ వర్షాలకు హైదరాబాద్‌లో 30 మంది..
Sanjay Kasula
|

Updated on: Oct 15, 2020 | 6:01 PM

Share

Heavy Rains :హైదరాబాద్‌లో వరదలకు 30 మందికిపైగా మృతిచెందారు. ఇంకా చాలా మంది జాడ లేకుండా పోయింది. భారీవర్షాలకు కొట్టుకుపోయిన ఒక్కొక్కరి డెడ్‌బాడీలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఊహించని ఉపద్రవం.. కొన్ని కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపితే.. మరికొందరిని కోలుకోలేని విధంగా చేసింది. ప్రధానంగా పాతబస్తీలోని అలీనగర్‌కు చెందిన అబ్దుల్‌ తహేర్‌ ఖురేషీకి కన్నీరే మిగిలింది. 8 మంది కుటుంబసభ్యులు గల్లంతు కాగా.. అందులో నలుగురి మృతదేహాలను కొనుగొన్నారు. మరో నలుగురి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.

బతికి బయట పడ్డానన్న ఆనందం కూడా అబ్దుల్‌కు లేకుండా పోయింది. తాను పోయినా కనీసం తన కుటుంబసభ్యులను అయినా కాపాడాలని వేడుకున్న తన విన్నపాన్ని ఆ దేవుడు కూడా వినలేదని వాపోతున్నాడు. ఓ చెట్టును పట్టుకుని బయటపడ్డా.. తన కుటుంబసభ్యులు కళ్లలోనే మెదులుతున్నట్టు కన్నీటిపర్యంతమవుతున్నాడు.

ఇక ఇంజాపూర్‌ వాగులో మరో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. తొర్రూరుకు చెందిన ప్రణయ్‌, ప్రదీప్‌లుగా వారిని గుర్తించారు. మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు. ఇలా ఒక్కరని కాదు… చాలా మంది వరదలకు గల్లంతయ్యారు. వారి కోసం మొన్నటి నుంచి రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతూనే ఉంది. మిస్సైన వారంతా ఎక్కడికి కొట్టుకుపోయి ఉంటారన్నది తెలియకుండా పోయింది. రిస్కీ ఆపరేషన్‌ కావడంతో పోలీసులు… నిపుణులతో పాటు స్థానికుల సహకారాన్ని తీసుకుని వెతుకుతున్నారు. ఇక ఇబ్రహీంపట్నం వద్ద కారులో కొట్టుకుపోయిన వెంకటేశ్‌గౌడ్‌, రాఘవేంద్రల మృతదేహాలు లభించాయి. వెంకటేష్‌ మృతదేహం నిన్న దొరకగా.. రాఘవేందర్‌ డెడ్‌బాడీని ఇవాళ కనుగొన్నారు.

కందుకూరుకు చెందిన వీరిద్దద్దరు చెర్వుగట్టు రామలింగేశ్వరస్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ప్రమాదానికి గురైనట్టు తెలిసింది. వరదకు కొత్తగూడెం దగ్గర నేషనల్‌ హైవే బ్లాక్‌ కావడంతో.. వారంతా ఇబ్రహీంపట్నం మీదుగా కందుకూరుకు వెళ్లే యత్నం చేశారు. లష్కర్‌గూడ దగ్గరకు రాగానే వాగు పొంగి వారు కొట్టుకుపోయారు. ప్రమాద సమయంలో తమను కాపాడాలంటూ వేడుకున్నారు. తెలిసిన వారికి ఫోన్‌ చేశారు. వాగు ఉధృతి ఎక్కువగా ఉండడంతో కొందరు వారి దగ్గరికి పోలేకపోవడంతో.. అలా ఫోన్లో మాట్లాడుతుండగానే కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు.

నాగోల్‌లో కొట్టుకుపోయిన పోస్ట్‌మ్యాన్‌ సుందర్‌రాజు మృతదేహం లభ్యమైంది. బండ్లగూడలో మంగళవారం గల్లంతైన అతని డెడ్‌బాడీ ఇవాళ బయటపడింది. సుందర్‌రాజు మృతితో అతని కుటుంబం తీరని విషాదంలో మునిగిపోయింది. ఇలా ఏ కుటుంబాన్ని తీసుకున్నా కన్నీటి సుడిగుండాలే, కోలుకోలేని దెబ్బలే తగిలాయి.