ఏసీబీ అధికారుల రాకతో తహశీల్దార్ మధ్యవర్తి నిర్వాకం.. కాలిబూడిదైన రూ.5 లక్షలు

అక్రమంగా సంపాదించిన సొమ్ము ఎక్కడ పట్టుబడుతుందోనని ఓ వ్యక్తి కాల్చి బూడిద చేశాడు. ఈ ఘటన తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో చోటుచేసుకుంది.

ఏసీబీ అధికారుల రాకతో తహశీల్దార్ మధ్యవర్తి నిర్వాకం.. కాలిబూడిదైన రూ.5 లక్షలు
Thahsildar Mediator Fire Five Lakhs Rupees Of Notes To Escape From Acb Raids
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 07, 2021 | 7:02 AM

Currency Notes fire: అక్రమంగా సంపాదించిన సొమ్ము ఎక్కడ పట్టుబడుతుందోనని ఓ వ్యక్తి కాల్చి బూడిద చేశాడు. ఇటీవల రాజస్థాన్‌లో ఏసీబీ అధికారులకు చిక్కకుండా ఓ తహసీల్దారు రూ.20 లక్షలు గ్యాస్‌ స్టౌపై పెట్టి కాల్చేశాడు. ఇలాంటి సంఘటనే రాష్ట్రంలోనూ చోటుచేసుకుంది. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్‌ కథనం ప్రకారం.. క్రషర్‌ ఏర్పాటుకు నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌-ఎన్‌వోసీ కోసం ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, రెవిన్యూ నుంచి సర్టిఫికేట్ ఇచ్చేందుకు రూ.5 లక్షలు డిమాండ్‌ చేసిన నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ తహసీల్దారు సైదులు.. ఆ సొమ్ము తీసుకోవాలని మధ్యవర్తి వెంకటయ్య గౌడ్‌ను పురమాయించాడు.

కాగా, తహశీల్దార్ సూచన మేరకు బాధితుడు రూ.5 లక్షలను వెంకటయ్య గౌడ్‌కు ఇచ్చాడు. అతడు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. ఏసీబీ అధికారులను చూసి.. చూడంగానే షాక్ తిన్న వెంకటయ్య గౌడ్..ఆ నోట్లను గ్యాస్‌ స్టౌపై పెట్టి దహనం చేశాడు.. వెంటనే అధికారులు మంటలను ఆర్పేసి సగం కాలిన నోట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో తహశీల్దార్ సైదులుతో పాటు మధ్యవర్తి వెంకటయ్య గౌడ్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రెవెన్యూ అరాచకాలతో ఇబ్బందిపడుతున్న పలువురు బాధితులు ఏసీబీ అధికారులను అభినందిస్తున్నారు,

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కోరెంతకుంట తండా సర్పంచి రామావత్‌ రాములు వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామంలో క్రషర్‌ ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. జనవరి 18న జిల్లా మైనింగ్‌ అధికారులకు పత్రాలు అందజేశారు. వారు జనవరి 25న రెవెన్యూ శాఖకు సమాచారం ఇచ్చారు. క్రషర్‌ ఏర్పాటుకు భూమి సర్వే చేసి ఎన్‌వోసీ ఇవ్వాలని రాములు.. వెల్దండ తహసీల్దారు సైదులును కలిసి దరఖాస్తు ఇవ్వగా, రూ.6 లక్షలు ఇస్తేనే సర్వే చేస్తానని చెప్పాడు. బాధితుడు రూ.5 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారు. ఆ డబ్బును వెల్దండ మండలం చెదురుపల్లికి చెందిన మాజీ వైస్‌ ఎంపీపీ వెంకటయ్యగౌడ్‌కు ఇవ్వాలని తహసీల్దారు సూచించాడు.

దీంతో బాధితుడు ఈ నెల 1న మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఫ్లాన్ చేసిన అధికారుల సూచనల ప్రకారం రాములు మంగళవారం డబ్బులు తీసుకుని కల్వకుర్తి పట్టణంలో నివాసముంటున్న వెంకటయ్యగౌడ్ ఇంటికి వచ్చారు. డబ్బు తీసుకున్న వెంకటయ్యగౌడ్ వెంటనే తలుపులు వేసేసుకున్నాడు. వచ్చింది ఏసీబీ అధికారులు అని అనుమానం రావడంతోనే తీసుకున్న డబ్బును వంటింట్లోకి తీసుకెళ్లి స్టౌపై పెట్టి కాల్చివేశాడు. తర్వాత తలుపు తీశాడు.

అప్పటికే నోట్లు 70 శాతం కాలిపోయాయని ఏసీబీ డీఎస్పీ క‌ృష్ణా గౌడ్ తెలిపారు. దీంతో అవినీతి తహశీల్దార్‌కు సంబంధించి ఆస్తులపై కూడా ఏకకాలంలో దాడులు చేశారు. ఇందులో భాగంగా కల్వకుర్తితోపాటు హైదరాబాద్‌లోని జిల్లెలగూడలో ఉన్న వెంకటయ్యగౌడ్ ఇంట్లో, ఎల్‌బీనగర్‌ సాయిభవాని నగర్‌లోని తహసీల్దారు సైదులు ఇంట్లో, వెల్దండ తహసీల్దారు కార్యాలయంలో సోదాలు నిర్వహించామని డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్‌ తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. తహసీల్దారుపై ఎ-1, మాజీ వైస్‌ ఎంపీపీపై ఎ-2గా కేసు నమోదు చేశామన్నారు.

వెంకటయ్యగౌడ్‌ను కల్వకుర్తి నుంచి వెల్దండ తీసుకొస్తుండగా వేరే కేసుల్లోని రెవెన్యూ బాధితులు పలువురు దాడి చేశారు. సైదులును, వెంకటయ్యగౌడ్‌ను తహసీల్దారు కార్యాలయంలో విచారించారు. ఈ సమయంలో వారి బాధితుల్లో కొందరు కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. వెల్దండ బస్సు స్టేజీ వద్ద బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

Read Also.. పోలీస్‌ డ్రెస్‌లో అతడిని చూసి జెలసీ ఫీలవుతున్నా..! సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటున్న వెటరన్‌ హీరో..