AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG20: తొలి మ్యాచ్‌లో దుమ్ములేపిన ఖమ్మం! టోర్నీకి అద్భుతమైన ఆరంభం..

హైదరాబాద్‌లో హెచ్‌సీఏ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ఘనంగా ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, విజయ్ దేవరకొండ వంటి ప్రముఖులు హాజరయ్యారు. గ్రామీణ క్రికెటర్లకు ఇది గొప్ప వేదిక అని ఆయన అన్నారు. సంగీత దర్శకుడు తమన్ కాన్సర్ట్‌తో అలరించారు.

TG20: తొలి మ్యాచ్‌లో దుమ్ములేపిన ఖమ్మం! టోర్నీకి అద్భుతమైన ఆరంభం..
Khammam Aces Batter
SN Pasha
|

Updated on: Jun 22, 2026 | 9:21 AM

Share

హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, హెచ్‌సీఏ అధ్యక్షుడు ఏ. చాముండేశ్వర్‌నాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలికితీసి స్టార్ ఆటగాళ్లుగా తీర్చిదిద్దేందుకు హెచ్‌సీఏ చేపట్టిన ఈ లీగ్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో లీగ్ ప్రచారకర్త, హీరో విజయ్ దేవరకొండ, హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి, తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ అంబటి రాయుడు, భారత క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ పాల్గొన్నారు. అనంతరం సంగీత దర్శకుడు ఎస్. తమన్ తన మ్యూజికల్ కాన్సర్ట్‌తో ప్రేక్షకులను అలరించాడు. ఇక టోర్నీ తొలి మ్యాచ్‌లో ‘అన్విత ఖమ్మం ఏసెస్’ జట్టు అద్భుత ప్రదర్శనతో సత్తా చాటింది. పాలమూరు స్ట్రైకర్స్‌తో జరిగిన పోరులో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించిన ఖమ్మం ఏసెస్ 20 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

ముందుగా బ్యాటింగ్ చేసిన ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. వాఫి కచ్చి 60 పరుగులతో దూకుడుగా ఆడగా, సాయికృష్ణ 52 పరుగులతో ఆకట్టుకున్నాడు. చివరి వరకు క్రీజులో నిలిచిన హిమతేజ 59 పరుగులతో అజేయ అర్ధశతకం సాధించి జట్టు స్కోరును భారీ స్థాయికి చేర్చాడు. ఈ ముగ్గురు బ్యాటర్ల అద్భుత ప్రదర్శనతో ఖమ్మం ఏసెస్ ప్రత్యర్థి ముందు 238 పరుగుల కఠిన లక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాలమూరు స్ట్రైకర్స్ పోరాడినా విజయానికి చేరువ కాలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులకే పరిమితమైంది. దీంతో టీజీ20 లీగ్ తొలి మ్యాచ్‌లోనే ఖమ్మం ఏసెస్ విజయంతో శుభారంభం చేసింది. అలాగే టోర్నీకి మంచి స్టార్ట్ ఇచ్చింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us