తత్కాల్‌లో టికెట్ దొరకలేదా? డోంట్ వర్రీ.. లాస్ట్ మినిట్‌లో కూడా బెర్త్ దొరుకుతుంది.. ఈ సింపుల్ ట్రిక్‌తో..
తత్కాల్ టిక్కెట్లు దొరకక ఇబ్బంది పడుతున్నారా? భారతీయ రైల్వేలు, ఐఆర్‌సీటీసీ అందిస్తున్న 'Charts/Vacancy' ఫీచర్ ద్వారా చివరి నిమిషంలోనూ ఖాళీ సీట్లు పొందవచ్చు. రైలు చార్ట్ సిద్ధమైన తర్వాత రద్దు చేయబడిన లేదా ఖాళీగా ఉన్న బెర్త్‌లను గుర్తించి, కరెంట్ బుకింగ్ ద్వారా కన్ఫర్మ్ సీటు బుక్ చేసుకోవచ్చు.

భారతీయ రైల్వేల్లో తత్కాల్ టిక్కెట్లు క్షణాల్లో అమ్ముడైపోవడం వల్ల చివరి నిమిషంలో ప్రయాణం చేయాల్సిన వారికి సీటు దొరకడం కష్టంగా మారుతుంది. అయితే చాలా మందికి తెలియని ఒక హిడెన్ ఫీచర్‌తో తత్కాల్ లేకుండానే ఖాళీ బెర్త్‌లను గుర్తించి ప్రయాణించే అవకాశం ఉంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. భారతీయ రైల్వేలు, ఐఆర్‌సీటీసీ అందిస్తున్న “Charts/Vacancy” ఫీచర్ ద్వారా రిజర్వేషన్ చార్ట్ సిద్ధమైన తర్వాత అందుబాటులో ఉన్న ఖాళీ సీట్ల వివరాలను తెలుసుకోవచ్చు. రైలు బయలుదేరే సమయానికి సుమారు నాలుగు గంటల ముందు మొదటి చార్ట్, బయలుదేరే ముందు మరో తుది చార్ట్ విడుదల చేస్తారు.
ఈ ప్రక్రియలో రద్దైన టిక్కెట్లు, ప్రయాణికులు వినియోగించని కోటా సీట్లు లేదా కొంత దూరం మాత్రమే బుక్ అయిన బెర్త్‌లు ఖాళీగా కనిపించే అవకాశం ఉంటుంది. ఈ సదుపాయాన్ని ఉపయోగించాలంటే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్‌లోకి వెళ్లి “Charts/Vacancy” విభాగాన్ని తెరవాలి. అనంతరం రైలు నంబర్, ప్రయాణ తేదీ, బోర్డింగ్ స్టేషన్, క్లాస్‌ను ఎంచుకుంటే కోచ్ వారీగా ఖాళీ బెర్త్‌ల సమాచారం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగుతో చూపించే సీట్లు ఖాళీగా ఉన్నట్లు లెక్క.
అయితే ఈ ఖాళీ సీట్లు కనిపించాయంటే వెంటనే టిక్కెట్ దొరుకుతుందనే గ్యారంటీ లేదు. అందుబాటులో ఉన్న సీట్లను కరెంట్ బుకింగ్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో యాప్‌లో సీట్లు కనిపించినా వెంటనే బుక్ కాకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో స్టేషన్‌లోని కరెంట్ బుకింగ్ కౌంటర్ లేదా రైలులోని ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE)ను సంప్రదించాల్సి ఉంటుంది. అయితే చార్ట్ విడుదలైన వెంటనే ఖాళీలను గుర్తిస్తే సీటు దొరికే అవకాశాలు ఎక్కువ, లేదంటే అవి కూడా బుక్ అయిపోతుంటాయి. ముఖ్యంగా పండుగలు, సెలవులు, అత్యవసర ప్రయాణాల సమయంలో ఈ ఫీచర్ ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుంది. తత్కాల్ టిక్కెట్ దొరకకపోయినా, చార్ట్ వేకెన్సీ ద్వారా చివరి నిమిషంలో కన్ఫర్మ్ సీటు పొందే అవకాశం ఉండటంతో ఇది ప్రయాణికులకు ఒక ప్రత్యామ్నాయ మార్గంగా మారుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
