AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నో కాస్ట్ EMI అంటే ఏంటి..? దీని వల్ల అసలు మనకు లాభమా..? నష్టమా..?

నో కాస్ట్ ఈఎంఐ ఆకర్షణీయంగా కనిపించినా, దాని వెనుక దాగున్న నిజాలు వేరు. వడ్డీ లేని ఈఎంఐ పేరుతో వచ్చే ఈ పథకంలో ప్రాసెసింగ్ ఫీజులు, జీఎస్‌టీ, ఫోర్‌క్లోజర్ ఛార్జీలు వంటి అనేక దాచిన ఖర్చులు ఉంటాయి. ఇది వినియోగదారులను అధిక కొనుగోళ్లకు ప్రేరేపించి, ఆర్థిక భారాన్ని పెంచుతుంది. ఈఎంఐని అవసరమైనప్పుడు మాత్రమే వివేకంతో ఉపయోగించాలి.

నో కాస్ట్ EMI అంటే ఏంటి..? దీని వల్ల అసలు మనకు లాభమా..? నష్టమా..?
No Cost Emi
Ram Naramaneni
|

Updated on: Jun 22, 2026 | 8:53 AM

Share

నేటి రోజుల్లో నో కాస్ట్ ఈఎంఐ అనే సౌకర్యం చాలా మందిని ఆకర్షిస్తోంది. ఫోన్‌లు, టీవీలు, ఏసీలు, ఫ్రిజ్‌లు వంటి ఖరీదైన వస్తువులను ఒకేసారి మొత్తం డబ్బు చెల్లించకుండా నెలవారీ వాయిదాల్లో కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల చాలామంది ఇది పూర్తిగా ఉచిత సౌకర్యమని అనుకుంటారు. కానీ ప్రతి సందర్భంలో అది నిజం కాదు. కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

నో కాస్ట్ ఈఎంఐ అంటే ఏమిటి?

నో కాస్ట్ ఈఎంఐ అంటే వస్తువు ధరను నెలవారీ వాయిదాల్లో చెల్లించే పద్ధతి. సాధారణ ఈఎంఐలో వడ్డీ కూడా చెల్లించాలి. కానీ నో కాస్ట్ ఈఎంఐలో వినియోగదారుడికి వడ్డీ కనిపించదు. చాలా సందర్భాల్లో ఆ వడ్డీని విక్రేత లేదా తయారీ సంస్థ భరిస్తుంది. అందుకే దీనిని నో కాస్ట్ ఈఎంఐ అంటారు.

వినియోగదారులు ఎలా నష్టపోవచ్చు?

నో కాస్ట్ ఈఎంఐ వల్ల చాలామంది తమ స్థోమత కంటే ఎక్కువ ఖర్చు చేస్తారు. ఉదాహరణకు, నెలకు రూ50,000 జీతం, రూ30,000 పొదుపు ఉన్న వ్యక్తి సాధారణంగా రూ.30,000 లేదా రూ.40,000 విలువైన ఫోన్ కొనుగోలు చేస్తాడు. కానీ నో కాస్ట్ ఈఎంఐ ఉందని చూసి రూ.1 లక్ష విలువైన ఫోన్ కొనేస్తాడు. నెలకు ఈఎంఐ మాత్రమే చెల్లించాల్సి ఉండటంతో పెద్ద మొత్తం ఖర్చు చేస్తున్న విషయం గుర్తించకపోవచ్చు. ఇది ఫోన్‌లతోనే ఆగదు. టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీలు వంటి ఖరీదైన వస్తువులను కూడా ఇలా కొనేస్తారు. ఒకవేళ ఆదాయం తగ్గినా లేదా ఉద్యోగం పోయినా ఈఎంఐలు చెల్లించడం కష్టమవుతుంది. అప్పుడు క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది.

దాగి ఉండే ఖర్చులు

నో కాస్ట్ ఈఎంఐ అంటే ప్రతి సారి పూర్తిగా ఉచితం అని అనుకోవద్దు. కొన్ని ఆఫర్లలో అదనపు ఖర్చులు ఉండవచ్చు.

ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్‌టీ: కొన్ని బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు ఇవి వసూలు చేస్తాయి.

డిస్కౌంట్ తగ్గిపోవచ్చు: నగదు చెల్లిస్తే వచ్చే డిస్కౌంట్, నో కాస్ట్ ఈఎంఐలో రాకపోవచ్చు.

ముందుగానే లోన్ ముగిస్తే ఛార్జీలు: కొన్ని బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు ముందుగానే ఈఎంఐ పూర్తి చేస్తే అదనపు ఛార్జీలు తీసుకోవచ్చు.

అందుకే కొనుగోలు చేసే ముందు అన్ని నిబంధనలు ఒకసారి చదవడం మంచిది.

కంపెనీలకు లాభం ఎలా?

నో కాస్ట్ ఈఎంఐ వల్ల కంపెనీలు, బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలు అందరికీ ప్రయోజనం ఉంటుంది. ఈ సౌకర్యం వల్ల ఎక్కువ మంది ఖరీదైన వస్తువులు కొనడానికి ముందుకు వస్తారు. దీంతో అమ్మకాలు పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో వడ్డీ మొత్తాన్ని విక్రేత లేదా తయారీ సంస్థే భరిస్తుంది. అందువల్ల వినియోగదారుడికి వడ్డీ చెల్లిస్తున్నట్లు కనిపించదు.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు:

నిజంగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే నో కాస్ట్ ఈఎంఐ తీసుకోండి.

ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్‌టీ, ఇతర ఛార్జీలు ఉన్నాయా లేదా చూసుకోండి.

ఈఎంఐ ఉందని అవసరానికి మించి ఖరీదైన వస్తువులు కొనొద్దు.

నెలవారీ ఈఎంఐలు మీ ఆదాయంలో 30% నుంచి 40% లోపే ఉండేలా చూసుకుంటే ఆర్థిక భారం తగ్గుతుంది.

భావోద్వేగంతో కాకుండా, అవసరాన్ని బట్టి కొనుగోలు చేయండి.

నో కాస్ట్ ఈఎంఐ స్కామ్ కాదు. కానీ సరైన అవగాహన లేకుండా ఉపయోగిస్తే అది ఆర్థిక భారంగా మారుతుంది. కాబట్టి వస్తువు కొనుగోలు చేసే ముందు అన్ని నిబంధనలు, ఛార్జీలు చూసి, మీ స్థోమతకు తగ్గట్టే నిర్ణయం తీసుకోవడం మంచిది.

Follow Us