అల్లం రైతులను అభినందించిన సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకి తమ పొలంలో పండించిన అల్లంను అందించారు సంగారెడ్డి జిల్లా రంజోల్ రైతులు.

ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకి తమ పొలంలో పండించిన అల్లంను అందించారు సంగారెడ్డి జిల్లా రంజోల్ రైతులు. రంజోల్ గ్రామానికి చెందిన నాగేశ్వరరెడ్డి, వెంకట్రామ్‌రెడ్డి అనే రైతులు తాము పండించిన తొలి పంటను సీఎంకు ఇవ్వాలని భావించారు. దీంతో జిల్లా హార్టికల్చర్ అధికారి సునీతతో కలిసి ఎర్రవెల్లి వ్యవసాయక్షేత్రానికి వెళ్లి తాము పండిస్తున్న అల్లంను ముఖ్యమంత్రికి అందజేశారు. అల్లం సాగులో ఎలాంటి మెలుకువలు పాటిస్తున్నారో రైతులను అడిగి తెలుసుకున్నారు సీఎం. తాము అల్లంతో పాటు ఆలుగడ్డ సాగు కూడా చేస్తున్నట్లు రైతులు వివరించారు. పొద్దుపోయే వరకు పంటల సాగుపైనే రంజోల్ రైతులతో సీఎం కేసీఆర్ చర్చిస్తూ గడిపారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న వాణిజ్య పంటలు పండించడం ద్వారా రైతులకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని సీఎం తెలిపారు. అల్లంకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని, అల్లం, ఆలుగడ్డ పండించినందుకు రైతులను సీఎం అభినందించారు. సాధారణంగా రైతులు వరి, మొక్కజోన్న, పత్తి సాగు చేస్తుండగా.. మీరు మాత్రం వాణిజ్య పంటలు సాగు చేయడం సంతోషమన్నారు సీఎం. అల్లం, ఆలుగడ్డ సాగు విస్తీర్ణం పెంచాలని, సాగులో ఆదర్శంగా నిలవాలని సూచించారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ ప్రాంతంలోనే ఎక్కువగా అల్లం, ఆలుగడ్డ, పసుపు సాగవుతున్నదని, దాదాపు 5,500 ఎకరాల్లో అల్లం, 4 వేల ఎకరాల్లో ఆలుగడ్డ సాగవుతుందని జిల్లా హార్టికల్చర్ అధికారి సునీత.. ముఖ్యమంత్రికి వివరించారు. జహీరాబాద్ ప్రాంతానికి కూడా కాళేశ్వరం జలాలు అందిస్తామని ఈ సందర్భంగా రైతులకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.




