AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. కానీ పట్టుబడ్డారంటే రూ. 10 వేలు కట్టాల్సిందే

తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మద్యం విక్రయాలను డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి వరకు పొడిగించింది ప్రభుత్వం. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.. ఓ సారి ఈ స్టోరీపై లుక్కేయండి మరి. వివరాలు ఇవిగో

Telangana: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. కానీ పట్టుబడ్డారంటే రూ. 10 వేలు కట్టాల్సిందే
Liquor Sales
Vijay Saatha
| Edited By: |

Updated on: Dec 24, 2025 | 9:44 AM

Share

నూతన సంవత్సర వేడుకల పేరుతో రోడ్లపై హంగామా సృష్టిస్తూ, హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్‌ కమిషనర్ సజ్జనార్‌ హెచ్చరించారు. తాగి వాహనాలు నడిపేవారిపై బుధవారం నుంచి న్యూ ఇయ‌ర్ రోజు వ‌ర‌కు నగరవ్యాప్తంగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డ్రైవ్స్‌ నిర్వహిస్తున్నట్లు ఆయ‌న తెలిపారు. క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. హాట్ స్పాట్లు, గతంలో నేరాలు జరిగిన ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించాలని, పాత నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు.

డిసెంబరు 31 రాత్రి నగరవ్యాప్తంగా 100 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని సీపీ తెలిపారు. ఇందుకోసం అదనపు బలగాలను రంగంలోకి దించుతున్నామన్నారు. కొత్త సంవత్సరం జోష్‌లో మోతాదు మించి తాగి వాహనాలు నడిపితే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే వాహన సీజ్‌తో పాటు రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసే అవకాశం కూడా ఉందన్నారు. పార్టీలకు వెళ్లేవారు ముందుగానే ‘డెసిగ్నేటెడ్ డ్రైవర్’ను ఏర్పాటు చేసుకోవాలని లేదా క్యాబ్‌లను ఆశ్రయించాలని సూచించారు. యువత రోడ్లపై రేసింగ్‌లు, వీలింగ్‌లు, ర్యాష్‌ డ్రైవింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

2026 స్వాగత వేడుకలు ప్రజల జీవితాల్లో తీపి జ్ఞాపకాలుగా మిగలాలే తప్ప, చేదు అనుభవాలుగా మారకూడదని సీపీ హితవు పలికారు. డిసెంబరు 31 రాత్రి పబ్‌లు, త్రీస్టార్‌, ఆపై స్థాయి హోటళ్లలో జరిగే వేడుకలకు అర్ధరాత్రి 1 గంట వరకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. శబ్ద కాలుష్య నిబంధనలు కచ్చితంగా పాటించాలని, డెసిబెల్స్‌ పరిమితి దాటితే సౌండ్‌ సిస్టమ్‌లను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ఈవెంట్లలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం జరిగినా, అశ్లీల నృత్యాలకు తావిచ్చినా యాజమాన్యాలదే పూర్తి బాధ్యత అని, అలాంటి వారి లైసెన్సులు రద్దు చేసి క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. వేడుకల్లో మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సీపీ వివరించారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, పార్టీ వెన్యూలు, జంక్షన్‌లలో మ‌ఫ్టీలో 15 షీ టీమ్స్‌ నిఘా ఉంచుతాయని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే తక్షణమే అరెస్టు చేస్తామని వెల్లడించారు.