కొత్త రకం కరోనా వైరస్ పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు
కొత్త రకం కరోనా వైరస్ పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన ప్రయాణికులను వెంటనే...

కొత్త రకం కరోనా వైరస్ పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన ప్రయాణికులను వెంటనే ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అలాగే నెగిటివ్ వచ్చిన వారికి వారం రోజుల పాటు ఐసోలేషన్ లో ఉంచనున్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు లండన్ నుంచి 2,291 మంది వచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. లండన్ నుంచి వచ్చిన వారి ట్రాకింగ్ కు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
కాగా, యూకేలో కొత్తరకం కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ కొత్తరకం కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులువుగా వ్యాపిస్తోందని యూకే ప్రధాన వైద్యాధికారులు ప్రకటించారు. గత నాలుగైదు రోజులుగా నమోదైన కేసుల్లో 60 శాతంకు పైబడి కొత్తరకం వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ఈ వైరస్ 70 శాతం, ఎక్కువగా వేగంగా వ్యాపిస్తోందని పేర్కొన్నారు. దీంతో ప్రజలందరు ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఉండాలని సూచించారు. అప్రమత్తంగా లేకపోతే కొత్త వైరస్‌కు గురికావల్సి వస్తోందని హెచ్చిరించారు.
కొత్తరకం వైరస్‌కు ఇప్పుడున్న వ్యాక్సిన్ పనిచేస్తోందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పారు. ఈ కొత్త రకం వైరస్ నేపథ్యంలో ఇప్పటికే భారత్ చర్యలు చేపట్టింది. యూకే నుంచి వచ్చిపోయే విమానాలను సైతం నిషేధించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే కరోనాతో ఎన్నో ఇబ్బందులు పడుతుంటే.. ఈ కొత్త రకం వైరస్ తో మరింత భయాందోళన వ్యక్తం అవుతోంది.