AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: తొలిసారి ఆ క్రీడలకు భారత జట్టు.. ఓపెనర్లుగా కోహ్లీ, వైభవ్.. గోల్డ్ మెడల్ మనదే ఇక..?

Olympics 2028: లాస్ ఏంజెల్స్ వేదికగా జరగనున్న 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం చేస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో టీమిండియా తరపున విరాట్ కోహ్లీ, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాలని మాజీ పేసర్ ఎస్. శ్రీశాంత్ బీసీసీఐకి ఒక ఆసక్తికరమైన సూచన చేశారు.

Team India: తొలిసారి ఆ క్రీడలకు భారత జట్టు.. ఓపెనర్లుగా కోహ్లీ, వైభవ్.. గోల్డ్ మెడల్ మనదే ఇక..?
Cricket In Olympics
Venkata Chari
|

Updated on: Jun 11, 2026 | 11:44 AM

Share

Cricket in Olympics: దాదాపు 128 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఒలింపిక్స్ వేదికపై క్రికెట్ మళ్లీ సందడి చేయబోతోంది. చివరిగా 1900 సంవత్సరంలో ఒలింపిక్స్‌లో భాగమైన ఈ క్రీడ, ఇప్పుడు మళ్లీ 2028 లాస్ ఏంజెల్స్ గేమ్స్‌లో టీ20 ఫార్మాట్‌లో అలరించడానికి సిద్ధమైంది. ఈ చారిత్రాత్మక లీగ్‌లో అటు పురుషుల, ఇటు మహిళల జట్లకు బంగారు పతకాలు గెలిచే సువర్ణావకాశం దక్కనుంది. అయితే, అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రన్ మెషిన్ విరాట్ కోహ్లీని ఈ మెగా ఈవెంట్ కోసం మళ్లీ జట్టులోకి తీసుకురావాలని భారత మాజీ క్రికెటర్ ఎస్. శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

కోహ్లీ, వైభవ్ జోడీని చూడాలని ఉంది..!

ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీశాంత్ తన మనసులోని మాటను పంచుకున్నారు. అనుభవజ్ఞుడైన విరాట్ కోహ్లీ, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఒలింపిక్స్‌లో భారత్ తరపున ఓపెనర్లుగా బరిలోకి దిగితే చూడాలని ఉందని ఆయన ఆకాంక్షించారు. అనుభవం, యువ రక్తం కలగలిసిన ఈ జోడీ మైదానంలో ప్రత్యర్థులకు చుక్కలు చూపించడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకోసం సెలెక్టర్లు ప్రత్యేకంగా చొరవ తీసుకుని, కోహ్లీని ఒలింపిక్స్ ఆడేలా ఒప్పించాలని శ్రీశాంత్ కోరారు.

“విరాట్ కోహ్లీ 2008 నుంచి అద్భుతమైన క్రికెట్ ఆడుతున్నారు. ఆయన ఫిట్‌నెస్ చూస్తే ముచ్చటేస్తుంది. మనం ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటే, కోహ్లీ ఖచ్చితంగా జట్టులో ఉండాలి. ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు లభిస్తున్న క్రేజ్ కేవలం కోహ్లీ, ఆయన అభిమానుల వల్లేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సెలెక్టర్లు కోహ్లీని టీ20 జట్టులోకి తిరిగి తీసుకురావాలి” అని శ్రీశాంత్ పేర్కొన్నారు.

ఐపీఎల్‌లో సంచలనం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ..

బీహార్‌కు చెందిన 15 ఏళ్ల ఎడమచేతి వాటం ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల వరద పారించారు. ఏకంగా 237.30 స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు సాధించి, అత్యంత పిన్న వయస్సులోనే ‘ఆరెంజ్ క్యాప్’ అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అతని మెరుపు ఇన్నింగ్స్‌ల ధాటికి ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడలకు కూడా వైభవ్ ఎంపికయ్యాడు. ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే 2028 ఒలింపిక్స్ జట్టులో అతను చోటు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

వైభవ్ ప్రతిభను కొనియాడిన శ్రీశాంత్, ఆ కుర్రాడు ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనే భారత జట్టులో ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. భారతదేశానికి ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని అందించే సత్తా వైభవ్‌కు ఉందని తాను ముందే ఊహించానని శ్రీశాంత్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం విరాట్ కోహ్లీ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఐపీఎల్‌లో 675 పరుగులతో ఆయన అదరగొడుతూనే ఉన్నారు. శ్రీశాంత్ చేసిన ఈ వినూత్న ప్రతిపాదనపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒకవేళ కోహ్లీ ఒలింపిక్ బరిలో నిలిస్తే, అది భారత క్రీడా రంగానికే ఒక చారిత్రాత్మక క్షణంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us