కొత్త జిల్లాలపై జగన్ సర్కార్ కసరత్తు.. జనవరికల్లా ఏర్పాటుకు సిద్ధం.. ఏపీలో కొత్త జిల్లాలు ఇవేనట..!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ సర్కార్ కసరత్తు కొనసాగుతోంది. వీటి కోసం ఏర్పాటైన రాష్ట్ర స్థాయి కమిటీ, ఉప సంఘాలు, జిల్లా కమిటీల చర్యలు క్రమేణా వేగం పుంజుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ సర్కార్ కసరత్తు కొనసాగుతోంది. వీటి కోసం ఏర్పాటైన రాష్ట్ర స్థాయి కమిటీ, ఉప సంఘాలు, జిల్లా కమిటీల చర్యలు క్రమేణా వేగం పుంజుకుంటున్నాయి. వచ్చే ఏడాది జనవరి కల్లా దీనిపై ఓ క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సబంధించి జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన కమిటీకి ప్రత్యేక సబ్ కమిటీలు ఏర్పాటు చేశారు. జిల్లాల భౌగోళిక సరిహద్దులు, నియంత్రణ, న్యాయపరమైన వ్యవహారాల అధ్యయనానికి కమిటీ, జిల్లా నిర్మాణాత్మక, సిబ్బంది పునర్విభజన అధ్యయనానికి కమిటీ, ఆస్తులు, మౌలిక సదుపాయాల అధ్యయనానికి కమిటీ, ఐటీ సంబంధిత పనుల అధ్యయనానికి సబ్ కమిటీ వంటి నాలుగు కమిటీలను ఏర్పాటు చేసింది జగన్ ప్రభుత్వం.
కరోనా వైరస్ వ్యాప్తితో ఇటీవలి వరకూ మందకొడిగా సాగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఇప్పుడు వేగం పుంజుకుంది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రకటిస్తామని.. ఇవి 25 లేదా 26గా ఉండవచ్చని సూచనప్రాయంగా ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో తెలిపింది. అయితే కొందరు 25 జిల్లాలని.. మరికొందరు 26, 27 వరకు ఉంటాయని చెబుతున్నారు. ఇలా ఎవరికి తోచిన లెక్కలు వాళ్లు చెబుతున్నారు. అంతేకాదు ఒకటి రెండు చోట్ల కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. అయితే, తాజాగా సోషల్ మీడియాలో మరో ప్రచారం జరుగుతోంది. 25 కాదు ఏకంగా 32 జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయని.. ఓ లిస్ట్‌తో సహా చక్కర్లు కొడుతోంది.
జనవరి నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు కావచ్చన్న సూచనలతో.. వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులు చర్చిస్తున్నారు. జిల్లాల్లో ఉద్యోగులు ఎందరు? ఏయే హోదాల్లో పని చేస్తున్నారు? సొంత భవనాలు ఎన్ని? అద్దె భవనాల్లో ఎన్ని.. తదితర లెక్కలు తీస్తున్నారు. పోలీసుశాఖా కొత్త జిల్లాల్లో తమ కార్యాలయాల ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది. ఇందుకు అవసరమైన భవనాల కోసం వీలుగా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, ఇతర భవనాలు, ప్రధాన రహదారుల వివరాలను సేకరిస్తున్నారు. ప్రభుత్వ భవనాలు లేకపోతే తాత్కాలికంగా ప్రైవేటు భవనాల్లో ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నారు. తాత్కాలిక, మధ్యకాలిక, శాశ్వత ప్రణాళికలతో నివేదికలు రూపొందిస్తున్నారు.
మరోవైపు జిల్లాల పునర్విభజన కసరత్తులో భాగంగా రాష్ట్రంలో పోలీసుశాఖను 29 యూనిట్లుగా విభజించాలని ఉన్నతాధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఇందులో 7 కమిషనరేట్లు ఉండనున్నాయి. శాఖాపరంగా చేపట్టాల్సిన ఇతరత్రా మార్పులపై రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలో నివేదిక అందిచనున్నారు. కొన్నిచోట్ల జిల్లాల మౌలిక స్వరూపాన్ని బట్టి కొత్తగా యూనిట్లు నెలకొల్పాలని ప్రతిపాదించగా.. మరికొన్ని చోట్ల నియోజకవర్గాల పరిధిలో మార్పులు, చేర్పులు చేయాలని భావిస్తున్నారు. పోర్టులు, సెజ్‌లు, పారిశ్రామికీకరణ నేపథ్యంలో కాకినాడ, నెల్లూరుల్లో కొత్తగా కమిషనరేట్లను ప్రతిపాదిస్తున్నారు. అర్బన్ జిల్లాలుగా ఉన్న రాజమహేంద్రవరం, గుంటూరుల్లోనూ కమిషనరేట్ల ఏర్పాటు సమర్థనీయమేనని అంటున్నారు.
సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న జాబితాను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్ (ప్రతిపాదిత) 32 కొత్త జిల్లాలు:
వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు అంటూ మరో జాబితా కూడా వైరల్ అవుతోంది.
1. పలాస ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం
2. శ్రీకాకుళం శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజాం
3. పార్వతీపురం :పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ
4. విజయనగరం విజయనగరం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, బొబ్బిలి
5. విశాఖపట్నం భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి
6. అరకు అరకు, పాడేరు, జి.మాడుగుల
7. అనకాపల్లి అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని
8. కాకినాడ ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, రామచంద్రపురం
9. రాజమండ్రి అనపర్తి, రాజానగరం, రంపచోడవరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు
10. అమలాపురం: రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, గన్నవరం, మండపేట, కొత్తపేట
11. నరసాపురం: తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం
12. ఏలూరు గోపాలపురం, పోలవరం, చింతలపూడి, దెందులూరు, ఉంగుటూరు, ఏలూరు
13. మచిలీపట్నం కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు
14. విజయవాడ తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం
15. అమరావతి పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ
16. గుంటూరు తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, పొన్నూరు
17. బాపట్ల రేపల్లె, వేమూరు, బాపట్ల, చీరాల, పర్చూరు
18. నరసరావుపేట చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ
19. మార్కాపురం ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి
20. ఒంగోలు అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, కందుకూరు
21. నెల్లూరు కావలి, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, ఉదయగిరి
22. గూడూరు సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట
23. తిరుపతి శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, తిరుపతి, చంద్రగిరి
24. చిత్తూరు పూతలపట్టు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం
25. మదనపల్లి పీలేరు, పుంగనూరు, మదనపల్లి, తంబళ్లపల్లి
26. హిందూపురం కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర, హిందూపురం
27. అనంతపురం రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, అనంతపురం, రాప్తాడు, శింగనమల, తాడిపత్రి
28. ఆదోని పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం
29. కర్నూలు నందికొట్కూరు, కర్నూలు, డోన్, కోడుమూరు
30. నంద్యాల శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం
31. కడప జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, కడప
32. రాజంపేట బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి