Dhanteras 2021: ధంతేరాస్ సందర్భంగా యూకే రాయల్ మింట్ ప్రత్యేక మహాలక్ష్మి గోల్డ్ బార్.. దీని ధర ఎంతంటే..
దీపావళి పండుగ వస్తోందంటేనే నెల రోజుల ముందు నుంచే హడావుడి మొదలైపోతుంది. పేరుకు దీపాల పండుగలా చెప్పుకున్నా.. దీపావళి పండగ సందర్భంగా వచ్చే వేడుకలకు అంతే ఉండదు.

Dhanteras 2021: దీపావళి పండుగ వస్తోందంటేనే నెల రోజుల ముందు నుంచే హడావుడి మొదలైపోతుంది. పేరుకు దీపాల పండుగలా చెప్పుకున్నా.. దీపావళి పండగ సందర్భంగా వచ్చే వేడుకలకు అంతే ఉండదు. ఒకపక్క దీపాల వరుసల కళ కళలు.. మరోవైపు బాణాసంచా మెరుపులా సందడి ప్రముఖంగా కనిపించినా దీపావళి పండుగ అంటే పసిడి పండుగ అని చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే, దీపావళి పండగను పురస్కరించుకుని కచ్చితంగా కొద్దిగా అయినా బంగారం కొనడం మనవారి ఆనవాయితీ. మన దేశంలో ఉన్నా.. వృత్తి వ్యాపారాల రీత్యా విదేశాల్లో ఉన్నా.. దీపావళి పండగకు తమ శక్తిని అనుసరించి బంగారం కొనుక్కోవడం జరుగుతుంది. సాధారణంగా దీపావళి పూజకోసం కొనే బంగారం రూపులుగా అంటే గుండ్రటి రేకు బిళ్ళగా ఉంటుంది. దీనిపై లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది. అటువంటి వాటినే ఎక్కువగా దీపావళి సందర్భంగా కొనుగోలు చేసి పూజలు చేస్తారు ప్రజలు. అందుకే.. బంగారం వ్యాపారం చేసేవారు.. దీపావళి సందర్భంగా లక్ష్మీదేవి ఉన్న బంగారం రూపులు సిద్ధం చేసి అమ్మకానికి ఉంచుతారు. ఇలాంటి రూపులే కాకుండా.. లక్ష్మీదేవితో ఉన్న బంగారు వస్తువులు దీపావళి పండగ కోసం ధంతేరాస్ రోజున ప్రజలు కొనుగోలు చేస్తూ ఉంటారు. అందుకోసం కూడా ప్రత్యేకంగా లక్ష్మీదేవి ఉన్న బంగారు ఆభరణాలు సిద్ధం చేస్తారు. ఇక పండుగ సంప్రదాయం దృష్ట్యా కొన్ని బంగారు ఆభరణాల కంపెనీలు లక్ష్మీదేవి చిత్రం ఉన్న గోల్డ్ బార్ లు కూడా తాయారు చేసి ధంతేరాస్ రోజున అమ్మకానికి ఉంచుతారు.
ఇప్పుడు విదేశాలలోనూ ఈ సంప్రదాయం మొదలైపోయింది. విదేశాల్లో ఉన్న భారతీయుల వద్ద నుంచి ఉన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకుని దీపావళి సందర్భంగా యూకే రాయల్ మింట్ ప్రత్యెక గోల్డ్ బార్ లు మార్కెట్లోకి విడుదల చేసింది. ముఖ్యంగా ధంతేరాస్ రోజున జరిగే కొనుగోళ్ళ కోసం ఈ గోల్డ్ బార్ సిద్ధం చేసింది. ఈ గోల్డ్ బార్ బరువు 20 గ్రాములు. అలాగే.. ఇది 999.9 ప్యూర్ గోల్డ్ తో తాయారు చేశారు. ఇది ప్రత్యేకంగా రూపొందించిన హెన్నా నమూనా స్లీవ్‌లో వినియోగదారులకు అందించేస్తారు.
ఈ గోల్డ్ బార్‌ను ఎమ్మా నోబుల్ డిజైన్ చేశారు. దీని మందం 2.1 మిమీ. ప్రతి గోల్డ్ బార్ కి ఒక ప్రత్యేక క్రమ సంఖ్య వస్తుంది. ఈ గోల్డ్ బార్ అధికారిక రాయల్ మింట్ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ప్రతి బార్ ధర 1080 పౌండ్లు. (అంటే మన కరెన్సీలో చూస్తే..సుమారు లక్షా పదివేల రూపాయలవరకూ).
ఇక ఇలా బంగారాన్ని కడ్డీల రూపంలో కొనుగోలు చేయడం పూజ కోసమనే కాకుండా.. బంగారాన్ని దాచి ఉంచుకోవడం కోసం కూడా చేస్తారు. అందుకే ఇటువంటి కడ్డీల మీద లక్ష్మీదేవి రూపం ఉండటం కొనుగోలు దారులను ఆకట్టుకుంటుంది. సంపదను, శ్రేయస్సును అందించే దేవత లక్ష్మి ప్రతిరూపం ఉన్న బంగారు కడ్డీలకు యూకేలోని భారతీయులు ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: IPL 2021 SRH vs RR: ఒకరిది పోరాటం.. మరొకరిది ఆరాటం.. రసవత్తరమైన పోరును ఇలా చూడండి..
Pubji Love: ఇక్కడ అబ్బాయి.. అక్కడ అమ్మాయిని పబ్జీ గేమ్ కలిపింది.. రహస్య వివాహం.. ఆ తర్వాత..
Skin Care: మీ శరీరం మీది అవాంఛిత రోమాలను ఒక్క రోజులో తొలగించుకొండి ఇలా..