Small Business Sector: చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి మందికిపైగా ఉద్యోగాలు
కోవిడ్ తర్వాత చిన్న తరహా పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు దండిగా పెరిగాయి. కార్మికుల సగటు వేతనాలు కూడా 13 శాతం పెరిగినట్ల ఓ సర్వేలో తేలింది. అక్టోబర్ 2023 నుంచి 2024 మధ్య దాదాపు 12 కోట్ల మందికి ఉపాధి దొరకగా.. 2022-23లోనే ఏకంగా కోటి మందికి పైగా ఉద్యోగాలు లభించాయి. దీంతో చిన్న వ్యాపారాలు కూడా దేశ వృద్ధితో ఎంతో దోహదపడుతున్నట్లు సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి..
న్యూఢిల్లీ, డిసెంబర్ 25: దేశంలోని తయారీ, వాణిజ్యం, సేవలలోని చిన్న చిన్న వ్యాపారాలు.. అక్టోబర్ 2023 నుంచి 2024 సెప్టెంబర్ మధ్య దాదాపు 12 కోట్ల మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పించింది. 2022-23లోనే కోటి మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నాయి. కోవిడ్ గడ్డు పరిస్థితుల తర్వాత 2023-24లో మొత్తం యూనిట్ల సంఖ్య 6.5 కోట్ల నుంచి 7.3 కోట్లకు పెరిగినట్లు మంగళవారం అన్‌ఇన్‌కార్పొరేటెడ్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (ASUSE) వార్షిక సర్వే (2023-24) వెల్లడించింది.
సర్వే ఫ్యాక్ట్ షీట్ ప్రకారం.. వ్యవసాయేతర ఇన్‌కార్పొరేటెడ్ సెక్టార్‌లోని వివిధ ఆర్థిక, కార్యాచరణ పారామితులకు సంబంధించి తయారీ, వాణిజ్యం, సర్వీసులను మ్యాప్ చేసింది. గతేడాదితో పోల్చితే అక్టోబర్ 2023-2024 సెప్టెంబర్ మధ్య కాలంలో స్థాపనల సంఖ్య 12.8 శాతానికి పెరిగిందని అంచనా వేసింది. ఈ పిరియడ్‌లో 10.1 శాతం ఉపాధి వృద్ధిని నమోదు చేసినట్లు వెల్లడించింది. నాన్ అగ్రికల్చరర్ సెక్టార్‌లో వేతనాలు, ఉత్పాదకతతో సహా ఆర్ధిక, కార్యచరణలో కొలమానాల్లో గణనీయమైన వృద్ధిని సాధించినట్లు పేర్కొంది.
సర్వీస్ సెక్టార్‌లో అధిక వృద్ధి కనిపిస్తున్నట్లు సర్వే ఫలితాలు చూపిస్తున్నాయి. స్థాపనలు 23.6 శాతం, ఉపాధి 17.9 శాతంమేర ఉండగా సర్వీస్ రంగంలో ఏకంగా 26.2 శాతం వృద్ధి సాధించింది. ఒక కార్మికుడి సగటు వేతనం 13 శాతం పెరిగింది. 2022-23లో రూ.1,24,842 నుంచి 2023-24లో రూ. 1,41,071కి వేతనం పెరిగింది. చిన్న వ్యాపారాల్లో తయారీ, వాణిజ్యం, ఇతర సేవలతో కూడిన అసంఘటిత వ్యవసాయేతర రంగం ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందని, ఉపాధికి గణనీయంగా దోహదపడుతోందని స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వశాఖ కార్యదర్శి సౌరభ్ గార్గ్ సర్వే వివరాల వెల్లడి సందర్భంగా మీడియాకు తెలిపారు.
ఇక మహిళా యాజమాన్యంలోని యాజమాన్య సంస్థల శాతం 2022-23లో 22.9% నుంచి 2023-24లో 26.2 శాతంకి పెరిగిందని సర్వేలో తేలింది. ఇది వ్యాపార యాజమాన్యంలో మహిళల భాగస్వామ్యంలో సానుకూల మార్పును సూచిస్తుందని సర్వే గణాంకాలు తెలిపాయి. అలాగే ఇంటర్నెట్‌ని ఉపయోగించే సంస్థల శాతం కూడా 2022-23లో 21.1 శాతం నుంచి 2023-24లో 26.7 శాతానికి పెరిగిందని, ఇది చిన్న వ్యాపారాల్లో డిజిటల్ సాంకేతికత వ్యాప్తిని హైలైట్ చేస్తుందని పేర్కొంది.