Pariksha Pe Charcha: ప్రధాని మోదీ ‘పరీక్షా పే చర్చ’కు పోటెత్తిన రిజిస్ట్రేషన్లు.. ఎంపిక ఎలాగంటే?
ప్రధాని మోదీతో నేరుగా ముచ్చటించేందుకు యేటా ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమం జరగనుంది. అందుకు విద్యార్ధులు, తల్లిదండ్రులు, టీచర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ అయింది. మంగళవారం నాటికి దేశ వ్యాప్తంగా 9.72 లక్షల మంది విద్యార్థులు, 1.01లక్షల మంది టీచర్లు, 24,289 మంది తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. చివరి గడువు ఎప్పుడంటే..
న్యూఢిల్లీ, డిసెంబర్ 25: విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏటా నిర్వహిస్తున్న ‘పరీక్షా పే చర్చ’ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి కూడా Pariksha Pe Charcha రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది జనవరిలో నిర్వహించే 8వ ఎడిషన్ కార్యక్రమానికి ఆసక్తి కలిగిన విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు జనవరి 14, 2025 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.
పరీక్షా పే చర్చ అనేది ఒక ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు పరీక్షల ఒత్తిడి, కెరీర్ విజయానికి సమర్థవంతమైన వ్యూహాల చుట్టూ కేంద్రీకృతమై చర్చ కొనసాగుతుంది. ఇందులో పాల్గొనేవారు నేరుగా ప్రధానమంత్రితో మాట్లాడి, ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పరీక్షా పే చర్చా 2025కి సంబంధించిన ఆన్‌లైన్ బహుళ-ఎంపిక ప్రశ్నల పోటీలో పాల్గొనడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తు గడువు జనవరి 14తో ముగుస్తుంది. ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్‌సైట్ లో వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
డిసెంబర్ 14న రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా ఇప్పటి వరకు వరకు దేశ వ్యాప్తంగా 9.72 లక్షల మంది విద్యార్థులు, 1.01లక్షల మంది టీచర్లు, 24,289 మంది తల్లిదండ్రులు రిజిస్టర్ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఎంపికైన 2500 మంది విద్యార్థులకు కేంద్ర విద్యాశాఖ నుంచి పీపీసీ కిట్‌లు అందిస్తారు. పరీక్షా పే చర్చలో పాల్గొనేవారిని ఎంపిక చేసేందుకు ఆన్‌లైన్‌లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్న(MCQ)లతో ఓ పోటీ నిర్వహిస్తారు. ఈ పోటీలో నెగ్గిన వారిని ఎంపిక చేసి, కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తారు. జనవరిలో ఢిల్లీలోని భారత్ మండపం టౌన్ హాల్‌లో పరీక్షపే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ కార్యక్రమం తేదీని ఇంకా ప్రకటించలేదు.