బ్రేకింగ్ న్యూస్, రైతుల ఆందోళనకు మద్దతు, ఢిల్లీ సరిహద్దుల్లో తనను తాను కాల్చుకుని సిక్కు గురువు ఆత్మహత్య
ఢిల్లీ వెలుపల సింఘు బోర్డర్లో బుధవారం సాయంత్రం ఓ సిక్కు గురువు తనను తాను గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. హర్యానాలోని..
ఢిల్లీ వెలుపల సింఘు బోర్డర్లో బుధవారం సాయంత్రం ఓ సిక్కు గురువు తనను తాను గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. హర్యానాలోని కర్నాల్ కు చెందిన 65 ఏళ్ళ బాబా రామ్ సింగ్ రైతుల ఆందోళనకు మద్దతుగా నిరసనలో పాల్గొంటూ హఠాత్తుగా ఈ చర్యకు పాల్పడ్డారు. అన్నదాతల ఆందోళనకు మద్దతు ప్రకటిస్తున్నానని, ఆయన తన సూసైడ్ లెటర్లో పేర్కొన్నారు. హర్యానాలోని సిక్కు గురుద్వారా ప్రబంధక్ కమిటీతో బాటు పలు సిక్కు సంస్థలలో అయన లోగడ ఆఫీస్ బేరర్ గా వ్యవహరించారు. తన లైసెన్స్డ్ గన్ తోనే బాబా రామ్ సింగ్ సూసైడ్ కి పాల్పడినట్టు తెలుస్తోంది. అన్నదాతల దుస్థితిని, ప్రభుత్వ దమన నీతిని చూసి తానెంతో కలత చెందుతున్నానని,ప్రభుత్వ వైఖరి మహా పాపమని ఆయన పంజాబీలో రాసిన సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. ఆయన మృతదేహం వద్దే ఈ లెటర్ ను కనుగొన్నారు.
‘రైతులకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని చూసి ఇందుకు నిరసనగా నా జీవితాన్నే త్యాగం చేస్తున్నా.. అన్యాయం అన్నది మహా పాపం..అయితే దీన్ని సహించడం కూడా పాపమే ! అన్నదాతలకు మద్దతుగా కొందరు తమకు లభించిన క్రీడా అవార్డులను ప్రభుత్వానికి తిరిగి ఇచ్ఛేశారు.. కానీ నేను నా జీవితాన్నే త్యాగం చేస్తున్నా’ అని బాబా రామ్ సింగ్ పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన ఆయనను పోలీసులు పానిపట్ లోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారని సోనీపట్ పోలీసులు వెల్లడించారు. ఆయన డెడ్ బాడీని కర్నాల్ కు తరలిస్తునట్టు వారు చెప్పారు. రైతుల ఆందోళన బుధవారం నాటికి 21 వ రోజుకు చేరుకుంది. ఇప్పటివరకు 20 మంది అన్నదాతలు మరణించారు.