Pune Restaurant: భోజనం చేయండి… బుల్లెట్ బైక్ సొంతం చేసుకోండి.. స్పెషల్ ఆఫర్ ప్రకటించిన రెస్టారెంట్..
Pune Resturent Special Offer: సాధారణంగా హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగదారులను ఆకర్షించేందుకు రకరకాల ఆఫర్లు పెడుతుంటారు. 10 శాతం డిస్కౌంట్, బిర్యానీ కొంటే కూల్ డ్రింక్ ఉచితం... ఇలా రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుంటారు. అయితే..
Pune Restaurant Special Offer: సాధారణంగా హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగదారులను ఆకర్షించేందుకు రకరకాల ఆఫర్లు పెడుతుంటారు. 10 శాతం డిస్కౌంట్, బిర్యానీ కొంటే కూల్ డ్రింక్ ఉచితం… ఇలా రకరకాల ఆఫర్లు ప్రకటిస్తుంటారు. అయితే ఓ రెస్టారెంట్ నిర్వాహకులు మాత్రం ఓ అడుగు ముందుకేసి ఏకంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను ఉచితంగా ఇస్తామంటూ ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని పుణె పట్టణానికి శివారులో ఉన్న శివరాజ్ అనే రెస్టారెంట్ కస్టమర్లను ఆకర్షించే క్రమంలో వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది. తమ రెస్టారెంట్‌లో భోజనం చేసిన వారికి బుల్లెట్ బండిని ఉచితంగా అందిస్తామని ప్రకటన ఇచ్చింది. హోటల్‌కు వెళ్లేదే భోజనం చేయడానికి కదా.. ఇంకా భోజనం చేస్తే బహుమతి ఏంటని ఆలోచిస్తున్నారు కదూ.. అయితే సదరు రెస్టారెంట్ యాజమాన్యం చెప్పిన ప్రత్యేక వంటకాన్ని తినాలి. ఇందుకోసం సదరు రెస్టారెంట్ వారు 4 కిలోల ఒక ప్రత్యేక థాలీని రూపొందించారు. ఈ ప్రత్యేక థాలీని 60 నిమిషాల్లో తినడం పూర్తి చేసిన వారికి రూ. 1.65 లక్ష విలువైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను అందిస్తారు.
ఈ థాలీలో ఏయే ఏయే వంటకాలు ఉంటాయంటే.. ఫ్రైడ్ సూర్మాయి, పోమ్రెట్ ఫ్రైడ్ ఫిష్, చికెన్ తందూరీ, డ్రై మటన్, గ్రే మటన్, చికెన్ మసాలా, కొలుంబి బిర్యానీ. ఇక ఈ స్పెషల్ థాలీని ఏకంగా 55 మందితో కూడిన బృందం తయారుచేయడం విశేషం. ఇంకో విషయం ఏంటంటే.. ఈ థాలీ ఖరీదు రూ. 2,500. గంటలో 4 కిలోల బరువున్న థాలీని తినడం అసాధ్యమని అనుకుంటున్నారా.? అయితే ఇప్పటికే సోలాపూర్ జిల్లాకు చెందిన సోమ్‌నాథ్ పవార్ అనే వ్యక్తి స్పెషల్ థాలీని నిర్ణీత టైమ్‌లో ఫినిష్ చేసి బుల్లెట్ బైక్‌ను గెలుచుకున్నాడు కూడా. మరి మీరు కూడా ఎప్పుడైనా పుణె వెళితే ఈ స్పెషల్ థాలీని ఓసారి ట్రై చేయండి… బుల్లెట్ బైక్‌ను సొంతం చేసుకోండి.
Also Read: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారా.. మందుబాబులూ తస్మాత్ జాగ్రత్త.! అప్పటివరకు నో ఆల్కహాల్..