AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krack Movie Review: ‘క్రాక్’ మూవీ రివ్యూ.. ష్యూర్ షాట్.. నో డౌట్.. బాక్స్‌ ఆఫీస్ బద్దలే..

తెలుగునాట సంక్రాంతికి సినిమాల ఫైట్ కామన్. ఈసారి కరోనా కూడా బాక్స్‌ ఆఫీస్ పొంగల్ ఫైట్‌ను ఆపలేకపోయింది. ఎప్పటిలానే ఈ సంక్రాంతికి కూడా..

Krack Movie Review: 'క్రాక్' మూవీ రివ్యూ.. ష్యూర్ షాట్.. నో డౌట్.. బాక్స్‌ ఆఫీస్ బద్దలే..
Ravi Kiran
|

Updated on: Jan 10, 2021 | 4:37 PM

Share

Krack Movie Review:

టైటిల్ : ‘క్రాక్’

తారాగణం : రవితేజ, శృతి హసన్, సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్, మౌర్యని తదితరులు

సంగీతం : ఎస్. ఎస్. తమన్

నిర్మాత : బి. మధు

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : గోపీచంద్ మలినేని

విడుదల తేదీ: 09-01-2021

తెలుగునాట సంక్రాంతికి సినిమాల ఫైట్ కామన్. ఈసారి కరోనా కూడా బాక్స్‌ ఆఫీస్ పొంగల్ ఫైట్‌ను ఆపలేకపోయింది. ఎప్పటిలానే ఈ సంక్రాంతికి కూడా నాలుగు సినిమాలు రిలీజ్‌కు క్యూ కట్టాయి. అందులో భాగంగా నిన్న విడుదలైన సినిమా ‘క్రాక్’. మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన మూడో చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రచార చిత్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక శనివారం ఉదయమే విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాలు వల్ల రాత్రి విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.? లేదా.? అనేది ఈ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

కథ‌ :

పోతరాజు వీరశంకర్(రవితేజ) ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. నేరస్థుల పాలిట సింహస్వప్నం. బ్యాగ్రౌండ్ మాటెత్తితే మాత్రం అసలు ఏమాత్రం ఊరుకోడు. భార్య కళ్యాణి(శృతి హసన్), పిల్లాడితో కలిసి ఆనందంగా జీవిస్తుంటాడు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే సీఐగా ఒంగోలు వెళ్తాడో… అక్కడ ముఠా నాయకుడు కఠారి కృష్ణ(సముద్రఖని)తో వైరం ఏర్పడుతుంది. ఇంతలోనే వీరశంకర్ స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్ హత్యకు గురవుతాడు. ఇంతకీ ఆ హత్య చేసింది ఎవరు.? ఈ హత్యతో కఠారి కృష్ణకి సంబంధం ఉందా.? ఆ హత్యను వీరశంకర్ ఎలా చేధించాడు.? అనే ప్రశ్నలకు సమాధానం వెండి తెరపై చూడాల్సిందే

న‌టీన‌టుల అభినయం:

వీరశంకర్ పాత్రలో హీరో రవితేజ పూర్తిగా ఒదిగిపోయి నటించాడు. తనదైన మార్క్ ఎనర్జీ, టైమింగ్‌తో అలరించాడు. ఇక హీరోయిన్ శృతి హసన్ విషయానికి వస్తే.. సెకండాఫ్‌లో ఆమెలో ఓ కొత్త కోణాన్ని దర్శకుడు ఆవిష్కరించాడు. సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రలు సినిమాకు ప్రాణం పోశాయి. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

విశ్లేష‌ణ‌ :

ఓ పోలీస్.. ముగ్గురు నేరస్థులు.. వీరి మధ్య ఎత్తులు, పైఎత్తులు.. చివరికి ఏం జరిగింది.. అనేది కథ. గతంలో ఇదే తరహ సినిమాలు ఎన్నో వచ్చాయి. కానీ ఈ చిత్రంలో కథనాన్ని దర్శకుడు కొంచెం కొత్తగా తీర్చిదిద్దాడు. కథలో కమర్షియల్ అంశాలను మేళవించి.. కథనాన్ని ఆసక్తికరంగా రూపొందించడంలో దర్శకుడు గోపీచంద్ మలినేని విజయవంతమయ్యాడు. ప్రధమార్ధంలో వీరశంకర్ వ్యక్తిత్వం, అతడి కుటుంబం గురించి ఆవిష్కరించగా.. అసలు కథ కానిస్టేబుల్ హత్య తర్వాత మొదలవుతుంది. ఆ కేసును చేధించే క్రమంలో వీరశంకర్ పరిశోధన, నేరస్థుల్లో ప్రధముడైన కఠారి కృష్ణ వేసే స్కెచ్‌లతో సినిమా అద్భుతంగా ముందుకు సాగుతుంది. సెకండాఫ్ సినిమాకు ప్రధాన బలం. అనేక మలుపులతో క్లైమాక్స్‌కు చేరుకుంటుంది.

సాంకేతిక విభాగాల పనితీరు:

ఓవరాల్‌గా సినిమా పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్. సాంకేతికంగా ప్రతీ విభాగం సినిమాపై తనదైన ముద్ర వేసింది. జికె కృష్ణ కెమెరా పనితనం.. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్.. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు మాస్ అభిమానుల పల్స్‌కు చేరువయ్యేలా ఉంటాయి. మాస్ మహారాజా రవితేజ నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో.. అది పక్కాగా, పర్ఫెక్ట్‌గా దర్శకుడు గోపీచంద్ మలినేని వెండితెరపై చూపించాడు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

చివరి మాట: ‘క్రాక్’.. ష్యూర్ షాట్.. నో డౌట్.. రవితేజ అభిమానులకు ఫుల్ మీల్స్..