నాకు ఎవరైనా ఓకే : ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాంధీ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కాకున్నా తనకు సమ్మతమేనని ఆమె అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాంధీ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కాకున్నా తనకు సమ్మతమేనని ఆమె అభిప్రాయపడ్డారు. గాంధీ కుటుంబీకులే కాకుండా ఇతరులు కూడా ఆ బాధ్యతలు చేపట్టవచ్చని ఆమె అన్నారు. కొత్తగా వచ్చే ఎఐసీసీ అధ్యక్షులు తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా చేసేందుకు తాను సుముఖంగా ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. ఒక వేళ తనను కొత్త అధ్యక్షులు.. పార్టీ ఉత్తర ప్రదేశ్ బాధ్యతలనుంచి తప్పించి అండమాన్ వెళ్లి పార్టీ కార్యక్రమాలు చేయాలని ఆదేశించినా చేసేందుకు తాను సిద్ధమని ఆమె చెప్పారు.
ప్రదీప్ చిబ్బర్, షార్ష్ షా రాసిన పుస్తకం ‘ఇండియా టుమారో’ పుస్తకంలోని అంశాలపై ఇచ్చిన ఇంటర్వూలో ప్రియాంక తన అభిప్రాయాల్నివెల్లడించారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సోనియా గాంధీనే కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరలా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు రాహుల్ సిద్ధంగా లేకపోవడంతో సాధ్యమైనంత త్వరలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఎన్నికలు నిర్వహించి శాశ్వత పార్టీ చీఫ్ ను నియమించాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు కోరుతున్నారు.