ఏజన్సీ ప్రాంత అడవిబిడ్డల పురిటి కష్టాలు

కొండా కోనల్లో జీవనం.. నిండైన అమాయకత్వం.. మరువం ఎరుగని మనస్తత్వం.. ఇదీ మన్యంలో గిరిపుత్రుల జీవన విధానం. ప్రకృతి ఒడిలో ఊయలలూగుతూ... అడవితో పెనవేసుకుని సాగుతున్న వారి బతుకుల్లో వెలుగులు మాత్రం కరువయ్యాయి. కనీసం విద్యా, వైద్యం అందక ఆ గిరిజన బతుకులు తెల్లారుతున్నాయి. ఏడు దశాబ్దాలు గడిచినా ఇంకా ఏజెన్సీలో పురిటి కష్టాలు వీడటం లేదు.

  • Balaraju Goud
  • Publish Date - 5:10 pm, Sun, 19 July 20
ఏజన్సీ ప్రాంత అడవిబిడ్డల పురిటి కష్టాలు

కొండా కోనల్లో జీవనం.. నిండైన అమాయకత్వం.. మరువం ఎరుగని మనస్తత్వం.. ఇదీ మన్యంలో గిరిపుత్రుల జీవన విధానం. ప్రకృతి ఒడిలో ఊయలలూగుతూ… అడవితో పెనవేసుకుని సాగుతున్న వారి బతుకుల్లో వెలుగులు మాత్రం కరువయ్యాయి. కనీసం విద్యా, వైద్యం అందక ఆ గిరిజన బతుకులు తెల్లారుతున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీలో అడవినే నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు గిరిపుత్రులు. ఇప్పటికీ లోయ ప్రాంతాలేవీ అభివృద్ధికి నోచుకోక… 50 ఏళ్ల క్రితం పరిస్థితులను కళ్లకు కడుతున్నాయి. గర్భిణీల అవస్థలైతే వర్ణనాతీతం. డోలీనే వారికి అంబులెన్స్… ఇప్పటికీ పురిటి నొప్పులు పడుతున్న సమయంలో డోలీ కట్టి ఆస్పత్రికి తరలించే పరిస్థితులు నెలకొన్నాయి. చర్ల మండలంలోని ఎర్రంపాడు గ్రామం చత్తీస్‍గఢ్‍కు సరిహద్దులో ఉంది. ఆ గ్రామంలోని కొవ్వాసి ఐత అనే మహిళకు శుక్రవారం పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఊరి నుంచి బయటకు రావాలంటే రహదారి లేదు. దీంతో భర్త మూస స్థానిక ఆశా కార్యకర్త సోమమ్మ, ఆమె భర్త సోమయ్య సహకారంతో జెట్టీ కట్టి పక్కనే ఉన్న చెన్నాపురానికి మూడు కిలో మీటర్లు నడుచుకుంటూ బయలుదేరారు. దారిలోనే ఐత మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఊరికి బత్తినపల్లి మీదుగా రహదారి నిర్మాణానికి నిధులు మంజూరైనా ఇప్పటికీ పనులు మొదలుకాలేదు. దీంతో ఎంతకష్టం వచ్చినా గ్రామస్థులకు కాలినడకే దిక్కవుతోంది.

ఇక, గుండాల మండలం రోళ్లగడ్డ గ్రామానికి చెందిన సంధ్య పరిస్థితి మరీ దారుణం. పురిటి నొప్పులతో బాధపడుతున్న సంధ్యని డోలి కట్టుకుని కొండ గుట్టలు, అటవీ మార్గం దాటుకుంటూ 10 కిలోమీటర్లు నడిచి అంబులెన్స్‌లో చేర్చారు. వాగు అవతల నుంచి 108లో ఆస్పత్రికి తరలించారు. అక్కడ సంధ్యారాణి మగబిడ్డను ప్రసవించింది. ఇలాంటి ఘటనలెన్నో ఈ మన్యంలో వెలుగు చూస్తూనే ఉన్నాయి.

ఏడు దశాబ్దాలు గడిచినా ఇంకా ఏజెన్సీలో పురిటి కష్టాలు వీడటం లేదు. వర్షాకాలం వచ్చిందంటే ఏజెన్సీ ప్రాంతంలోని గర్భిణుల కష్టాలు వర్ణనాతీతం. ప్రస్తుత వర్షాకాలంలో జిల్లాలో డెలివరీ తేదీ ఉన్న గర్భిణులు సుమారు 1,521 మంది ఉన్నారు. ఇవి వైద్య, ఆరోగ్యశాఖ లెక్కలు. భద్రాచలం మన్యంలోనే సుమారు 75 మంది ఉన్నారు. ఇక ఇల్లెందు ఏజెన్సీలో మారుమూల రహదారి సౌకర్యం లేని గ్రామాల్లో మరో 50 మంది ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 9 నెలలు నిండిన వారిని, రహదారి, వంతెనలు లేని గ్రామాల నుంచి సురక్షిత ప్రాంతాలకు క్షేత్రస్థాయిలోని సిబ్బంది చేత తరలించాలని జిల్లా కలెక్టర్లు ఎన్నిసార్లు సూచించినా వైద్యాధికారులు పెడచెవిన పెడుతున్నారు. దీంతో మహిళలకు కష్టాలు తప్పడం లేదు.

అడవిలో ఆదివాసీలు దశాబ్దాలుగా దారిద్య్రాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. కారణాలు ఎన్నో ఉండొచ్చు. కానీ…అడవి తల్లినే నమ్ముకుని బతుకుతున్న వారిని కాపాడుకోవల్సిన బాధ్యత ఫ్రభుత్వానిది. అప్పుడప్పుడు కాస్త హడావిడి చేసి చేతులు దులుపుకుంటున్న అధికారులు.. శాశ్వత పరిష్కారం చూపటం లేదు. గిరిజన లోతట్టు, కొండల గ్రామాల గిరిజన జీవితాలు బాగుపడాలంటే ప్రత్యేక కార్యాచరణ తీసుకురావాలి. మౌలిక వసతుల్లో ప్రధానమైన రహదారి సౌకర్యం కల్పిస్తే అన్ని సమస్యలు పరిస్కారం అవుతారని గిరిపుత్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వీడి కనీస వసతులు కల్పించాలని ఆడవి బిడ్డలు కోరుకుంటున్నారు.