బల్లవలలతో వేటకు వెళుతున్నారంటూ కఠారిపాలెం మత్స్యకారుల ఆగ్రహం, ప్రకాశంజిల్లా వాడరేవులో మళ్లీ ఉద్రిక్తత
ప్రకాశంజిల్లా వాడరేవులో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివాదాస్పద బల్లవలలతో వాడరేవు మత్స్యకారులు వేటకు వెళుతున్నారంటూ కఠారిపాలెం మత్స్యకారులు...
ప్రకాశంజిల్లా వాడరేవులో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివాదాస్పద బల్లవలలతో వాడరేవు మత్స్యకారులు వేటకు వెళుతున్నారంటూ కఠారిపాలెం మత్స్యకారులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య పదిరోజుల తర్వాత మళ్లీ ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలో పలువురు మత్స్యకారులు గాయపడ్డారు. కవరేజ్‌కు వెళ్ళిన ఇద్దరు విలేకరులకు గాయాలయ్యాయి. పోలీసులు, మత్స్యశాఖ అధికారులు ఇరువర్గాలకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించివేసేందుకు ప్రయత్నించారు. పదిరోజుల క్రితం ఇదే విధంగా నిషేధిత బల్లవలను వాడరేవు మత్స్యకారులు వాడుతున్నారంటూ కఠారిపాలెంతో పాటు మరో 77 గ్రామాల మత్స్యకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సముద్రంలో బల్లవలతో వేటకు వచ్చిన వాడరేవు మత్స్యకారులను కఠారిపాలెం మత్స్యకారులు అడ్డుకున్నారు.
అలాగే కఠారిపాలెం మత్స్యకారులను వాడరేవు మత్స్యకారులు సముద్రంలో అడ్డుకోవడంతో గొడవ పెద్దదయింది. ఈ నేపధ్యంలో కఠారిపాలెంలో పోలీసులు, మత్స్యశాఖ అధికారులు మత్స్యకారులతో సమావేశమయ్యారు. అదే సమయంలో నిషేధిత బల్లవలతో తిరిగి వాడరేవు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళారన్న సమాచారం కఠారిపాలెం మత్స్యకారులకు అందింది. దీంతో ఒక్కసారిగా కఠారిపాలెం మత్స్యకారులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఒకవైపు అధికారులతో చర్చలు జరుగుతుంటే మరోవైపు వాడరేవు మత్స్యకారులు తమను రెచ్చగొట్టేందుకు కఠారిపాలెం చుట్టుపక్కల సముద్రతీరంలో వివాదాస్పద బల్లవలతో వేటకు వచ్చారంటూ వాడరేవుకు తీరానికి చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం వాడరేవులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి.