AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేసీఆర్ బాటలో పొంగులేటి… అదృష్టం కలిసొస్తుందా!

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. సీఎం కేసీఆర్ బాటలో నడుస్తున్నారు. ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం నారాయణపురంలో ఆయన సహస్ర చండీయాగం చేస్తున్నారు. పొంగులేటికి చెందిన మామిడి తోటలో యాగశాలను నిర్మించి.. రుత్వికుల సమక్షంలో.. యాగం చేస్తున్నారు. లోక కల్యాణం కోసం ఈ యాగం నిర్వహిస్తున్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అక్టోబర్ 13న ప్రారంభమైన ఈ యాగం అక్టోబర్ 17న ముగియనుంది. ఆదివారం మొదలైన ఈ సహస్ర చండీ యాగం నిర్విఘ్నంగా ఐదు రోజుల పాటు […]

కేసీఆర్ బాటలో పొంగులేటి... అదృష్టం కలిసొస్తుందా!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 14, 2019 | 12:03 PM

Share

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. సీఎం కేసీఆర్ బాటలో నడుస్తున్నారు. ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం నారాయణపురంలో ఆయన సహస్ర చండీయాగం చేస్తున్నారు. పొంగులేటికి చెందిన మామిడి తోటలో యాగశాలను నిర్మించి.. రుత్వికుల సమక్షంలో.. యాగం చేస్తున్నారు. లోక కల్యాణం కోసం ఈ యాగం నిర్వహిస్తున్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అక్టోబర్ 13న ప్రారంభమైన ఈ యాగం అక్టోబర్ 17న ముగియనుంది. ఆదివారం మొదలైన ఈ సహస్ర చండీ యాగం నిర్విఘ్నంగా ఐదు రోజుల పాటు కొనసాగనుంది. ఈ యాగానికి రావాలంటూ సీఎం కేసీఆర్ ను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. 9 మంది పీఠాధిపతుల పర్యవేక్షణలో 200 మంది రుత్వికులు పాల్గొంటున్న ఈ యాగానికి చినజీయర్ స్వామి, విశాఖ శ్రీశారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, ధర్మపురి సచ్చిదానంద ఆశ్రమ పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతీ స్వామి తదితరులు హాజరై ప్రవచనాలు వినిపిస్తారు.

సహస్ర చండీయాగంలో మహిళలకు సామూహిక కుంకుమార్చనలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చండీయాగానికి హాజరయ్యే భక్తుల కోసం అన్నదానం చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడం, గతంలో పొంగులేటి వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా గెలుపొందడంతో.. తెలంగాణతోపాటు ఆంధ్రాకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా ఈ యాగంలో పాల్గొనే అవకాశం ఉంది.

పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2014 ఎన్నికల్లో ఖమ్మం నుంచి వైఎస్ఆర్సీపీ ఎంపీగా గెలుపొందారు. వైఎస్ ఫ్యామిలీకి వీరాభిమాని అయిన పొంగులేటి రాజశేఖరరెడ్డి బతికుండగానే రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ అకాల మరణం తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంతంగా వైసీపీ పేరిట పార్టీ పెట్టడంతో… పొంగులేటి కూడా వైసీపీలో చేరిపోయారు. అనంతరం ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. 2018 చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కొందరు అభ్యర్థులకు టీఆర్ఎస్ టికెట్ దక్కడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది సెప్టెంబర్లో ఆయన ఇళ్లు, కార్యాయాలపై ఐటీ దాడులు జరిగాయి. తదనంతర పరిణామాలతో లోక్ సభ ఎన్నికల్లో ఆయనకు పార్టీ టికెట్ దక్కలేదు. టీడీపీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ తరఫున ఖమ్మం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.

టీఆర్ఎస్ లో చేరిన తొలినాళ్లలో హెుషారుగా కనిపించిన పొంగులేటి ఆ తర్వాత క్రమంగా తెర వెనుకకు వెళ్లిపోయారు. మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆయనకు టికెట్ కూడా ఇవ్వలేదు. మొత్తంగా చూస్తే… కాంట్రాక్టర్ గా వ్యాపారవేత్తగా తనదైన శైలి విజయాలను నమోదు చేసిన పొంగులేటికి రాజకీయాలు మాత్రం కలిసి రాలేదనే చెప్పాలి. ఇన్నాళ్లపాటు సైలెంట్‌గా ఉండిపోయిన పొంగులేటి.. ఇప్పుడు కేసీఆర్ తరహాలో చండీ యాగానికి శ్రీకారం చుట్టడం గమనార్హం. 2014లో వైఎస్ఆర్సీపీ తరఫున పినపాక ఎమ్మెల్యేగా గెలుపొంది, అనంతరం టీఆర్ఎస్‌లో చేరిన పాయం వెంకటేశ్వర్లు కూడా ఆ యాగానికి హాజరయ్యారు. 2018 ఎన్నికల్లో పినపాక నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన పాయం.. కాంగ్రెస్ అభ్యర్థి రేగా కాంతారావు చేతిలో ఓడారు. రేగా టీఆర్ఎస్‌లో చేరడం, ఆయనకు విప్ ఇవ్వడంతో పార్టీలో పాయం వెంకటేశ్వర్లు ప్రాధాన్యం తగ్గింది. కాగా  ఈ యాగం హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో ఆయనకు రాజకీయంగా ఎంతవరకు ప్రయోజనం కల్పిస్తుందో చూడాలి మరి.