NEETలో సులువుగా సీటు కోసం మరో దొడ్డిదారి.. NRIలుగా మారుతున్న భారతీయులు!
వైద్య వృత్తిలో సెటిల్ అవ్వాలనేది ఎందరికో చిరకాల వాంఛ. అందుకు అహోరాత్రులు కష్టపడి చదివి తమ కోరికను నెరవేర్చుకుంటూ ఉంటారు. ఇందుకు ఎంతో కఠినమైన నీట్ పరీక్షలో అర్హత సాధించవల్సి ఉంటుంది. అయితే కొందరు విద్యార్ధులు సులువుగా దొడ్డి మార్గంలో నీట్లో సీటు కొట్టడానికి నానాతంటాలు పడుతున్నారు..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: నీట్ సీట్ల కోసం పలువురు విద్యార్థులు అక్రమ మార్గాలను అవలంబిస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్న ఆ మధ్య ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ 20 ఏళ్ల విద్యార్థి నీట్లో సులువుగా దివ్యాంగుల కోటాలో సీటు దక్కించుకోవడానికి ఏకంగా తన చేతులతో తన పాదాన్ని నరుక్కున్నాడు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేయగా.. మొత్తం యవ్వారం బయటపడింది. దీంతో అసలు ఏ సెక్షన్ కింద కేసు పెట్టాలో కూడా తెలియక తలలు పట్టుకున్నారు. ఈ దారుణం మరువక ముందే నీట్లో సీటు కోసం మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
తాజాగా వైద్య విద్య పీజీ సీట్ల కేటాయింపును పర్యవేక్షించే మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) తాజాగా విడుదల చేసిన జాబితాలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2025-26 విద్యాసంవత్సరానికిగాను మూడో విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందేందుకు ఏకంగా 811 మంది భారతీయ విద్యార్ధులు తమ జాతీయతను భారతీయుల నుంచి NRIగా మార్చుకున్నారు. నీట్ పీజీ ప్రవేశ పరీక్షలో తక్కువ మార్కులు వచ్చివారు ఫీజు ఎంతైనా కట్టేందుకు వెనకాడటం లేదు. దీంతో పలువురు విద్యార్థులు క్లినికల్ విభాగాల్లో సీట్లు దక్కించుకునేందుకు తమ జాతీయతను సైతం లెక్కచేయకుండా ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. నిజానికి, ఎన్ఆర్ఐ కోటాలో ఫీజులు భారీగా ఉన్నప్పటికీ పోటీ తక్కువగా ఉంటుంది. దీంతో ఆర్ధికంగా బలంగా ఉన్నవారు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. పైగా NRI కోటాలో కట్-ఆఫ్ మార్కులు మేనేజ్మెంట్ కోటా కంటే తక్కువగా ఉండటం వీరికి కలిసి వస్తోంది.
ఈ విధంగా ఎన్ఆర్ఐ కోటాలో అర్హత సాధించిన 811 మంది అభ్యర్థులను MCC రెండు వర్గాలుగా విభజించింది మొదటి వర్గంలో ఎన్ఆర్ఐలు, ఎన్ఆర్ఐల పిల్లలు మొత్తం 113 వరకు ఉన్నారు. ఇక రెండో వర్గంలో ఏకంగా 698 మంది అభ్యర్థులు తమ జాతీయతను నీట్ పీజీ సీటు కోసం NRIలుగా మార్చుకున్నారు. ఈ కోటాలో రక్తసంబంధీకులు కాకపోయినా దూరపు బంధువులు స్పాన్సర్ చేస్తే సరిపోతుంది.ఈ వెసులుబాటును అందిపుచ్చుకోవడంతో ఎన్ఆర్ఐ కోటాలో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది. మొదటి కేటగిరీలో అత్యల్ప స్కోరు 800 మార్కులకుగాను కేవలం 82 అంటే 10 శాతం మాత్రమేకాగా, రెండో కేటగిరీలో దారుణంగా 28 మార్కులు అంటే 3.5 శాతం మార్కులు మాత్రమే ఉన్నాయి. మొదటి వర్గంలో 66 శాతం మంది ర్యాంకులు 1.5 లక్షల కంటే తక్కువగా ఉన్నా ఏడాదికి రూ. 45 లక్షల నుంచి రూ. 95 లక్షల వరకు ఫీజు కట్టే స్తోమత ఉండటంతో మెడికల్ సీట్లను సులువుగా దక్కించుకుంటున్నారు. ఇక రెండవ కేటగిరీలోని నాన్-రెసిడెంట్ ఇండియన్లోని 698 మంది అభ్యర్థులలో 60% (422) కంటే ఎక్కువ మంది 1.5 లక్షల కంటే తక్కువ ర్యాంక్ కలిగి ఉన్నారు.
సాధారణంగా NRI సీట్లు ఖాళీగా మిగిలిపోతుంటాయి. దీంతో ఈ సీట్లను మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేస్తుంటారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఆర్ధిక నష్టాన్ని భరించలేక కోర్టుకెక్కడంతో ఎన్ఆర్ఐ నిర్వచనాన్ని విస్తృతం చేశారు. దీంతో తల్లిదండ్రులు విదేశాల్లో లేకపోయినా సమీప ఎన్ఆర్ఐ బంధువుల ఆధారంతో వైద్య విద్యార్థులు పీజీ సీట్లను దక్కించుకోవచ్చు. ఎన్ఆర్ఐ బంధువులు వీరికి స్పాన్సర్లుగా ఉండవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




