రక్తచరిత్ర చుట్టూ తిరుగుతున్న అనంత రాజకీయం..కాక పుట్టిస్తున్న కొత్త రిజర్వాయర్లకు శంకుస్థాపన
అనంతపురం జిల్లా రాజకీయం మళ్లీ రక్తచరిత్ర చుట్టూ తిరుగుతోంది. పాత ఘటనలపై కొత్తగా కాక రేగుతోంది. ఇటీవల జిల్లాలో కొత్త రిజర్వాయర్లకు శంకుస్థాపన సందర్భంగా... రక్తచరిత్రను ప్రస్తావించారు ఎంపీ గోరంట్ల మాధవ్.

అనంతపురం జిల్లా రాజకీయం మళ్లీ రక్తచరిత్ర చుట్టూ తిరుగుతోంది. పాత ఘటనలపై కొత్తగా కాక రేగుతోంది. ఇటీవల జిల్లాలో కొత్త రిజర్వాయర్లకు శంకుస్థాపన సందర్భంగా… రక్తచరిత్రను ప్రస్తావించారు ఎంపీ గోరంట్ల మాధవ్. పరిటాల హయాంలో రక్తం ఏరులై పారిందని, ఇప్పుడు నీళ్లు పారుతున్నాయని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలే… గతంలో ఫ్యాక్షన్ చరిత్రను మళ్లీ తెరపైకి తెచ్చాయి.
ఎంపీకి పరిటాల శ్రీరామ్ కౌంటర్ ఇవ్వడం… మళ్లీ మాధవ్ రియాక్ట్ అవడం రాజకీయాన్ని వేడెక్కించింది. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆనాటి వంద ఘటనలను చెబుతానన్నారు ఎంపీ. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తూ… రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడటం మరింత కాక రేపుతోంది. రెండు రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి పది రక్తచరిత్రలను చెబుతానన్నారు తోపుదుర్తి.
అనంతపురంలో ఇటీవల సీఎం జగన్ రిజర్వాయర్లకు భూమి పూజ చేశారో లేదో.. రాజకీయం మరింత వేడెక్కేలా విమర్శనాస్త్రాలను విసురుచుకుంటున్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్, పరిటాల తనయుడు శ్రీరాం మధ్య ఓ రేంజ్‌లో సవాళ్లు నడుస్తున్నాయి. ఇలా నేతల మధ్య.. ఫ్యాక్షన్ సినిమా తలపించేలా మాటలతూటాలు పేలుతుండడం అనంత రాజకీయాన్ని మరోసారి హీటెక్కిస్తోంది. రక్తచరిత్ర రెండు పార్ట్‌లతో… ఫ్యాక్షన్ ఏం రేంజ్‌లో ఉంటుందో చూపించే ప్రయత్నం చేశారు రాంగోపాల్ వర్మ. మరి ఇప్పుడు ఎంపీ, ఎమ్మెల్యే చెబుతామంటున్న ఘటనలు ఇంకెన్ని పరిణామాలకు దారితీస్తాయోనన్న టెన్షన్ నెలకొంది.
