ఇథనాల్ రూ .2 లక్షల కోట్ల ఎకానమీ సాధిస్తే.. లక్ష కోట్లు రైతుల జేబుల్లోకి వెళ్తాయి: నితిన్ గడ్కరీ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో రైతులు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే.

Nitin Gadkari Comments: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో రైతులు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. మెట్టు దిగకుండా, పట్టు విడవకుండా హస్తిన సరిహద్దుల్లో వరుసగా 20వ రోజు అన్నదాతలు తమ ఆందోళనను సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రైతుల ఆందోళనపై స్పందించారు. ప్రభుత్వం రైతులకు వ్యతిరేకం కాదని.. కొత్త చట్టాలను అర్ధం చేసుకోవాలని అన్నారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని.. వారిచ్చే విలువైన సూచనలను తప్పకుండా స్వీకరిస్తుందని నితిన్ గడ్కరీ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నదాతలకు అన్యాయం జరగదన్న ఆయన.. కొన్ని శక్తులు ఆందోళనలను తప్పుదారి పట్టిస్తున్నాయని చెప్పుకొచ్చారు. తమ ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్, ట్రేడర్ సహా ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ రైతులకు ఉందన్నారు. ప్రభుత్వం, రైతుల మధ్య చర్చలు జరగకపోతే సమాచార లోపం ఏర్పడి వివాదాలకు దారి తీస్తుందని… చర్చలతో ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.
అలాగే ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గించి ఇథనాల్ వాడకాన్ని పెంచాలని మంత్రి అన్నారు. దేశంలో ఇథనాల్ రూ .2 లక్షల కోట్ల ఎకానమీని సాధిస్తే.. అందులో రూ. లక్ష కోట్లు రైతుల జేబుల్లోకి వెళ్తాయని” ఆయన అన్నారు. ఇథనాల్ వాడకం వల్ల గాలి కాలుష్యం కూడా తగ్గించవచ్చునని తెలిపారు. అలాగే వ్యవసాయ మొండి నుంచి కూడా ఇథనాల్ ఉత్పత్తి చేయబడుతుందన్నారు.
“ప్రస్తుతం దేశంలో రూ .8 లక్షల కోట్ల ముడి చమురు దిగుమతి అవుతోంది. ప్రభుత్వం ఇందులో కనీసం రూ. 2 లక్షల కోట్ల విలువైన ఇథనాల్ వినియోగించాలని చూస్తోంది. ప్రస్తుతం ఇథనాల్ వినియోగం రూ. 20 వేల కోట్లు మాత్రమే ఉంది. రూ. 2 లక్షల కోట్ల ఇథనాల్ ఎకానమీ సాధిస్తే, రూ. 1 లక్ష కోట్లు రైతుల జేబుల్లోకే వెళ్తాయి. రానున్న రోజుల్లో విమానాలు ఇథనాల్‌తో తయారు చేసిన ఇంధనాన్ని వినియోగించి ఎగురుతాయి. ఆ డబ్బంతా కూడా రైతులకే వెళ్తుంది. ఇదే మా విజన్, డ్రీమ్ ” అని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
Also Read:




