AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవరాత్రులు… నవదుర్గలు!

హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతీ దేవి అవతారాల్లో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివుడి అంశలతో మహా సరస్వతి, మహా లక్ష్మీ, మహాకాళీగా అవతరించిందని చెబుతారు. ఈ మూడు అవతారాల నుంచి మరో రెండు రూపాలు వెలువడ్డాయి. ఇలా తొమ్మిది స్వరూపిణులుగా అంటే నవదుర్గలుగా దుర్గను పూజిస్తారు. గోవా, మహారాష్ట్రలతో పాటు తెలంగాణ, ఉత్తర కన్నడలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నవదుర్గల ఆలయాలు ఉన్నాయి. నవదుర్గలు సప్తశతీ మహా మంత్రానికి […]

నవరాత్రులు... నవదుర్గలు!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 02, 2019 | 1:33 AM

Share

హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతీ దేవి అవతారాల్లో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివుడి అంశలతో మహా సరస్వతి, మహా లక్ష్మీ, మహాకాళీగా అవతరించిందని చెబుతారు. ఈ మూడు అవతారాల నుంచి మరో రెండు రూపాలు వెలువడ్డాయి. ఇలా తొమ్మిది స్వరూపిణులుగా అంటే నవదుర్గలుగా దుర్గను పూజిస్తారు. గోవా, మహారాష్ట్రలతో పాటు తెలంగాణ, ఉత్తర కన్నడలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నవదుర్గల ఆలయాలు ఉన్నాయి.

నవదుర్గలు

సప్తశతీ మహా మంత్రానికి అంగభూతమైన దేవీ కవచంలో నవదుర్గలు అనే పదం స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రథమం శైల పుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్ర ఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం/ పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాలరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం/ నవమం సిద్దిదా ప్రోక్తా, నవదుర్గా ప్రకీర్తితా ఇక్తానే్యతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా

ఈ 9 నామాలను సాక్షాత్తు బ్రహ్మ దేవుడే చెప్పాడని ఉంది. అయితే, సప్తశతీ గ్రంథంలో మాత్రం వీరి చరిత్రలను ప్రస్తావించలేదు. సప్తశతిలో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, నంద, శాకంబరీ (శతాక్షి), భీమ, రక్తదంతిక, దుర్గా, భ్రామరీ గురించి చెప్పారు. కానీ, వీరిని నవదుర్గలని ప్రత్యేకంగా వ్యవహరించలేదు.

అన్నట్టు, సప్తసతీ దేవతలని మరో సంప్రదాయం ఉంది. దీనిలో నందా, శతాక్షీ, శాకంబరీ, భీమా, రక్తదంతికా, దుర్గా, భ్రామరీ అనే ఏడుగురు సప్తసతుల గురించి సప్తశతీ గ్రంథంలో ఉంది. దీనివల్లే ఈ గ్రంథానికి సప్తసతి అని మరో పేరు వచ్చిందంటారు.

శైలపుత్రి

శైలపుత్రి దేవతను నవరాత్రి సందర్భంగా మొదటిరోజు పూజిస్తారు. వృషభవాహనారూఢయైన ఈ అమ్మవారు కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో కమలతో విరాజిల్లుతూ ఉంటుంది. అమ్మవారి దేవాలయం వారణాసిలోని మర్హియ ఘాట్ వద్ద ఉంది. మరో దేవాలయం హేదవతి గ్రామంలో ఉంది.

బ్రహ్మచారిణి 

నవరాత్రి సందర్భంగా రెండో రోజున ఈ దేవాలయంలోని అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారు స్వేత వర్ణ దుస్తులను ధరించి భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మచర్య దీక్షలో అమ్మవారు ఉంటారు. వారణాసిలో మాత్రమే నవదుర్గలకు వేర్వేరుగా దేవాలయాలు ఉంటాయి. వారణాసిలోనే ఈ అమ్మవారి దేవాలయం కూడా ఉంది.

చంద్రఘంట 

ఈ అమ్మవారి శిరస్సులో ఉన్న చంద్రుడు ఘంటాకారంలో ఉండటం వల్ల ఈమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈమె శరీరము బంగారు కాంతితో ఉంటుంది. ఈ తన పది చేతులతో పది విభిన్న ఆయుధాలను కలిగి ఉంటుంది. ఈమె వాహనం సింహం. ఈమె గంట నుంచి వెలువడే బయంకర ధ్వనులు విన్నంతనే రాక్షసులు చనిపోతారు. ఈమెను విజయానికి ప్రతీకగా భావిస్తారు.

కూష్మాండ దుర్గా

కూష్మాండ మాతను నవరాత్రి దినోత్సవంలో భాగంగా నాలుగో రోజు పూజిస్తారు. ఈమె తేజస్సు నిరుపమానము. ఈమెను అష్టభుజి దేవి అని కూడా పిలుస్తారు. ఈమెకు ఎనిమిది భుజాలు ఉండటం వల్ల ఈమెకు అష్టభుజి అని పేరు. ఈమె వాహనం సింహము. ఈ దేవిని పూజించటం వల్ల రోగములు, శోకములు దరి చేరవని భక్తులు నమ్ముతారు. వారణిసితో పాటు కాన్పూర్ లో కూడా ఈ అమ్మవారి దేవాలయం ఉంది.

స్కందమాత

కుమారస్వామి, కార్తికేయుడు, శక్తిధరుడు అని పిలిచే మురుగన్ మాత కాబట్టే ఈమెను స్కందమాత అని పిలుస్తారు. స్కందమాతను నవరాత్రుల్లో ఐదో రోజున కొలుస్తారు. ఈమె చతుర్భుజి. ఈమె ఒడిలో కుమారస్వామి ఉంటారు. స్కందమాతను పూజించడం వల్ల కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయని చెబుతారు. వారణాసిలోని అన్నపూర్ణదేవి దేవాలయం పక్కనే ఈ దేవాలయం ఉంటుంది.

కాత్యాయని

ఆశ్వయుజ క`ష్ణ చతుర్దశి నాడు కాత్యాయని మహర్షి ఇంట కాత్యాయని మాత జన్మించిందని మన పురాణాలు చెబుతున్నాయి. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల్లో కాత్యాయన మహర్షి పూజలను అందుకొని విజయదశమిరోజు మహిషాసురుడిని వధించిందని చెబుతారు. కాత్యాయని శరీర వర్ణము బంగారు వర్ణములో ఉంటుంది. ఈమెను సేవించినచో జన్మజన్మాంతర పాపములు నశించిపోతాయని చెబుతారు. వారణాసితో పాటు కొల్హాపూర్ లో అమ్మవారి దేవాలయం ఉంది.

కాళరాత్రి

కాళరాత్రి దుర్గ గాఢాందకారము వలె ఉంటుంది. తల పై కేశములు చెల్లాచెదురుగా ఉండి చూడటానికి భయంకరముగా ఉంటుంది. ఈమెకు మూడు నేత్రాలు ఉంటాయి. ఈమె వాహనము గార్థభము. ఈమె చూడటానికి భయంకరముగా ఉన్నా ఎల్లప్పుడూ శుభాలనే ప్రసాదించును అందువల్లే ఈమెను శుభంకరి అని పిలుస్తారు. ఈమె అనుగ్రహం వల్ల గ్రహ బాధలు తొలిగిపోతాయని చెబుతారు.

మహాగౌరి

ఈమె చతుర్భుజ వాహిని, వృషభవాహనం. ఒక చేతిలో అభయముద్రను, మరొక చేతిలో త్రిశూలము కలిగి ఉంటుంది. ఒక చేతిలో డమరుకము, మరొక చేతిలో వరముద్రను కలిగి ఉంటుంది. పరమశివుడిని భర్తగా పొందడం కోసం తపస్సు చేయగా ఆమె శరీరం పూర్తిగా నల్లరంగు వలే మారుతుంది. అయితే శివుడు ఈమె భక్తికి మెచ్చి ప్రత్యక్షమైన తర్వాత స్వయంగా గంగా నదినీళ్లతో ఆమె శరీరాన్ని తడుపుతాడు. అప్పుడు ఆమె దవళ వర్ణ కాంతిలో మెరిసిపోతుంది. వారణాసితో పాటు లుథియానాలో అమ్మవారి దేవాలయం ఉంది.

సిద్ధిధాత్రి

సర్వవిధ సిద్ధులను ప్రసాధించు తల్లి కాబట్టి ఈమెను సిద్ధి దాత్రి అని అంటారు. ఈమె శివుడి పై దయతలచి ఆయన శరీరంలో అర్థభాగంలో నిలచింది. ఈమె చతుర్భుజ, సింహవాహని. ఈమె కమలం పై ఆసీనురాలై ఉంటుంది. నిష్టతో ఈమెను ఆరాధించిన వారికి సకల సిద్ధులు కలుగుతాయని చెబుతారు. అందువల్లే నవరాత్రుల్లో చివరి రోజు ఈమ్మవారిని ఈ రూపంలో పూజిస్తారు. వారణాసితోపాటు దేవ్ పహరీ చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ లోని సాత్నాతోపాటు సాగర్ లో కూడా ఈ దేవి దేవాలయం ఉంది.