సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న హుస్సేన్ సాగర తీరం.. అలనాటి కళకు ఆధునిక రూపం ఇస్తున్న హెచ్‌ఎండీఏ

హుస్సేన్ సాగర్ పరిసరాలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి హెచ్ఎండీఏ సుందరకీరణ పనులను చేపడుతోంది.

  • Balaraju Goud
  • Publish Date - 4:00 pm, Sun, 24 January 21
సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న హుస్సేన్ సాగర తీరం.. అలనాటి కళకు ఆధునిక రూపం ఇస్తున్న హెచ్‌ఎండీఏ

Beautifications Hussain sagar : హైదరాబాద్‌ అనగానే ఠక్కున గుర్తుకొచ్చేది ట్యాంక్‌బండ్‌. నగరం నడిబొడ్డున, జంటనగరాలకు ఒకప్పుడు తాగునీరందించే హుస్సేన్ సాగర్ జలాశయం. ఇప్పుడది కాలుష్యం బారిన పడి మురికి కూపంగా మారింది. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి హెచ్ఎండీఏ సుందరకీరణ పనులను చేపడుతోంది. హుస్సేన్ సాగర్ క్యాచ్‌మెంట్ ఏరియా ఇంప్రూవ్ మెంట్ ప్రోగ్రాం చేపట్టింది.

హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలను కలుపుతూ.. అత్యాధునిక హంగులతో కొత్తరూపు సంతరించుకుంటుంది. దాదాపు రూ.27 కోట్ల వ్యయంతో పర్యాటకులను మరింత ఆహ్లాదపరిచేందుకు చేపడుతున్న సుందరీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ చిత్రాలను మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో షేర్ చేశారు. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న భాగ్యనగరం రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తుందని నెటిషన్లు ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం చివరి దశలో ఉన్న సుందరీకరణ పనులను పరిశీలిస్తున్న నగరవాసులు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారంటూ కితాబునిస్తున్నారు.

హైదరాబాద్‌ నగరానికి ట్యాంక్‌బండ్‌ ఒక మణిహారం. మరిన్ని అదనపు హంగులతో, ఆధునిక, వారసత్వ శోభను సంతరించుకొని అటు నగరవాసులను, పర్యాటకులను ఆహ్లాదపరిచేందుకు సిద్ధమవుతున్నది. ఇందుకోసం హెచ్ఎండీఏ ప్రతిష్టాత్మకంగా తీసుకుని తీర్చిదిద్దుతోంది. నగరవాసులు మైమరిచిపోయేలా హెరిటేజ్‌ ఆర్నమెంటల్‌ డెకొరేటివ్‌ పోల్స్‌ క్యాస్ట్‌ ఐరన్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రాంతం చూడగానే పురాతన శైలిలో సరికొత్తగా ఆకట్టుకోనుంది.

ట్యాంక్‌బండ్‌ సుందరీకరణ పనుల్లో భాగంగా ఇప్పటికే ఫుట్‌పాత్‌లను పూర్తిగా తొలగించి, గ్రానైట్‌ రాళ్లతో తీర్చిదిద్దుతున్నారు. పీవీసీ పైపులను, వరద నీటి పైపులైను వ్యవస్థను భూగర్భంలోంచి వేస్తున్నారు. ట్యాంక్‌బండ్‌ ప్రాంతం పటిష్ఠంగా ఉండేందుకు క్రషర్‌ సాండ్‌తో పీసీసీ, స్లాబ్‌ రీఇన్‌ఫోర్స్‌మెంట్‌ చేస్తున్నారు. బోర్డ్ వాక్, పాదచారుల వంతెనతో పాటు లోయర్ ట్యాంక్ బండ్ ను ట్యాంక్ బండ్ పైకి వచ్చేందుకు వీలుగా ఆర్ట్ బాక్స్, బస్టాప్ లు, ఆర్ట్ గ్యాలరీలు, శిల్పాలు, పీపుల్ ప్లాజా, ఔట్ డోర్ జిమ్ లు, గ్రీన్ సైడ్‌లను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కాగా యేటా గణేశ్‌ ఉత్సవాల సమయంలో విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాటు చేసే క్రేన్‌లకు ప్రత్యేకంగా స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు.

అలాగే, ట్యాంక్‌బండ్‌పై అలనాటి వారస్వత్వాన్ని కండ్లముందుంచుతూ సరికొత్త తరహాలో విద్యుద్దీపాలంకరణను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు.క్యాస్ట్‌ ఐరన్‌ రెయిలింగ్‌, హెరిటేజ్‌ ఆర్నమెంటల్‌ డెకొరేటివ్‌ పోల్స్‌, ఆధునిక శైలిలో బస్టాప్‌లు, రెయిన్‌ షెల్టర్లు, కూర్చునేందుకు సీట్లను ఏర్పాటు చేస్తున్నారు. అలంకరణతో కూడిన వీధి దీపాల స్తంభాలను ప్రతి 15 మీటర్లకు ఒకటి ఎడమ వైపు, ప్రతి 30 మీటర్లకు ఒకటి చొప్పున కుడివైపున నిర్మిస్తున్నారు.

ట్యాంక్‌బండ్‌ పునర్నిర్మాణంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి ట్వీట్‌ చేశారు. ట్యాండ్‌బండ్‌ను మీరు ఎలా ఇష్టపడతారు? మీ కామెంట్స్‌, సలహాలు తెలపండి అంటూ ట్యాంక్‌బండ్‌కు సంబంధించిన నాలుగు ఫొటోలను షేర్‌ చేశారు. పనులు ఇంకా పురోగతిలో ఉన్నాయని, త్వరలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. స్పందించిన పలువురు నెటిజన్లు చాలా అద్భుతంగా పని చేశారని… గణేశ్‌ నిమజ్జన సమయంలో ఈ ప్రాంతం కళావిహీనంగా మారుతున్నదని, ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనం కోసం శాశ్వత ఏర్పాట్లు చేయాలని సూచించారు. వెంటనే ట్యాంక్‌బండ్‌కు వెళ్లి చూడాలనిపిస్తోందని మరొకరు ట్వీట్‌ చేశారు.

Read Also… ఏపీ స్థానిక ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠ.. సుప్రీంకోర్టుకు చేరిన “పంచాయతీ”.. బిగ్ మండేలో ఏం తేలనుంది..?