AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీడు మామూలోడు కాదు.. స్కెచ్ వేస్తే టార్గెట్ ఫిక్స్.. పగలు రెక్కీ.. రాత్రికి చోరీ.. ‘కట్టర్’ దొంగ ఖేల్‌ఖతం!

వరుస దొంగతనాలు చేసిన ముసుగు దొంగ ఆట కట్టించారు నారాయణపేట జిల్లా పోలీసులు. గత కొన్ని రోజులుగా సుమారు 10 దొంగతనాలు చేసి ఖాకీల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. తెల్లవారుజామున తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించి పోలీసులకు చిక్కాడు. దీంతో దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వీడు మామూలోడు కాదు.. స్కెచ్ వేస్తే టార్గెట్ ఫిక్స్.. పగలు రెక్కీ.. రాత్రికి చోరీ.. ‘కట్టర్’ దొంగ ఖేల్‌ఖతం!
Masked Thief Arrested
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: May 20, 2026 | 8:42 AM

Share

వరుస దొంగతనాలు చేసిన ముసుగు దొంగ ఆట కట్టించారు నారాయణపేట జిల్లా పోలీసులు. గత కొన్ని రోజులుగా సుమారు 10 దొంగతనాలు చేసి ఖాకీల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. తెల్లవారుజామున తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించి పోలీసులకు చిక్కాడు. దీంతో దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మక్తల్, మరికల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తుడిని మక్తల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 18న తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో మక్తల్ ఎస్ఐ వై. భాగ్యలక్ష్మి రెడ్డి ఆధ్వర్యంలో నారాయణపేట క్రాస్ రోడ్డులో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ వ్యక్తి పోలీసులను చూసి అనుమానాస్పదంగా బైక్‌ను వదిలేసి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఎస్ఐ, ఇతర సిబ్బంది వెంటాడి అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా తన పేరు కర్రెం సూర్యనారాయణ @ తిమ్మప్ప @ తిప్పి @ సూర్యగా తెలిపాడు. అనంతరం పోలీసులు తమదైన శైలిలో విచారించగా మక్తల్ లో పలు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. వెంటనే నిందితుడు వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా మంకీ క్యాప్, దొంగతనాలకు ఉపయోగించిన పనిముట్లు, చోరీ చేసిన ఆస్తికి సంబంధించిన వివరాలు లభించాయి.

ఇక స్టేషన్ కు తీసుకెళ్లిన కూపీ లాగడంతో నిందితుడు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసై డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు తెలిపాడు. సోషల్ మీడియా ప్రభావంతో గత ఏడాది కాలంగా మక్తల్ ప్రాంతంలోని షాపులు, వైన్ షాపులు, తాళం వేసిన ఇండ్లను పగటి సమయంలో రెక్కీ నిర్వహించేవాడు. ఇక రాత్రి సమయంలో మంకీ క్యాప్, గ్లౌజులు ధరించి గుర్తుపట్టకుండా ముసుగు వేసుకొని జాగ్రత్తలు తీసుకునేవాడు. ఎలక్ట్రిక్ కట్టర్, భారీ సుత్తి, కట్టింగ్ ప్లేయర్స్, స్క్రూడ్రైవర్లు వంటి పనిముట్లతో షట్టర్ల తాళాలు, తలుపులు పగులగొట్టి నగదు, బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేసేవాడు.

గత సంవత్సరం మే నెల నుంచి ఇప్పటివరకు మొత్తం 10 దొంగతనాలకు పాల్పడ్డాడు. వీటిలో 9 కేసులు మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాగా, ఒక కేసు మరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది. ఇప్పటివరకు నిందితుడు సుమారు రూ. 10లక్షల నగదు, 2 తులాలు బంగారం, 3 కిలోల వెండి, మద్యం సీసాలు, సిగరెట్లు చోరీ చేశాడు. ఇక పోలీసులకు చిక్కిన ముసుగు దొంగ నుంచి రూ. 5,04,000 నగదు, 13 గ్రాములు బంగారం, 60 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు.

వ్యాపారులు తమ దుకాణాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ వినీత్ సూచించారు. ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా లేదా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే Dial-100 కు సమాచారం అందించాలని కోరారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us