AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pollution Crisis : ఓర్నీ బడవా..ఇదేందిరయ్యా ఇది..మాస్కులు వేస్కొని క్రికెట్ ఆడడం ఏందిరా బాబు

Pollution Crisis : సాధారణంగా కాలుష్యం అంటే అందరికీ ఢిల్లీ గుర్తుకు వస్తుంది. కానీ తాజాగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చోటుచేసుకున్న దృశ్యాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. రంజీ ట్రోఫీ మ్యాచ్ జరుగుతుండగా మైదానంలో ఆటగాళ్లు మాస్కులు ధరించి ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది.

Pollution Crisis : ఓర్నీ బడవా..ఇదేందిరయ్యా ఇది..మాస్కులు వేస్కొని క్రికెట్ ఆడడం ఏందిరా బాబు
Ranji Trophy 2026
Rakesh
|

Updated on: Jan 30, 2026 | 7:23 AM

Share

Pollution Crisis : సాధారణంగా కాలుష్యం అంటే అందరికీ ఢిల్లీ గుర్తుకు వస్తుంది. కానీ తాజాగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చోటుచేసుకున్న దృశ్యాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. రంజీ ట్రోఫీ మ్యాచ్ జరుగుతుండగా మైదానంలో ఆటగాళ్లు మాస్కులు ధరించి ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ వేదికగా ముంబై, ఢిల్లీ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఈ వింత పరిస్థితి తలెత్తింది. ముంబై క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కావడంతో క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

రంజీ ట్రోఫీలో భాగంగా గురువారం (జనవరి 29) ముంబై, ఢిల్లీ జట్ల మధ్య పోరు మొదలైంది. అయితే, తొలి రోజే ఆటగాళ్లకు ఊహించని ఇబ్బంది ఎదురైంది. స్టేడియం సమీపంలో జరుగుతున్న భారీ నిర్మాణ పనుల కారణంగా విపరీతమైన దుమ్ము, ధూళి మైదానాన్ని కమ్మేశాయి. దీంతో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో సర్ఫరాజ్ ఖాన్ వంటి స్టార్ ఆటగాళ్లతో పాటు ముంబై ఫీల్డర్లంతా మాస్కులు ధరించి మైదానంలోకి దిగారు. దాదాపు 30 నిమిషాల పాటు ఆటగాళ్లు మాస్కులు ధరించే మ్యాచ్ ఆడటం గమనార్హం.

ఈ సమస్య కేవలం మైదానానికే పరిమితం కాలేదు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న సపోర్ట్ స్టాఫ్ కూడా దుమ్ము ధాటికి ఆగలేక మాస్కులు ధరించాల్సి వచ్చింది. క్రికెట్ వంటి శారీరక శ్రమతో కూడిన క్రీడలో మాస్కులు ధరించి ఆడటం వల్ల ఆటగాళ్లు త్వరగా అలసిపోవడమే కాకుండా, ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ కావడంతో ముంబైలో పెరుగుతున్న కాలుష్య స్థాయిలపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

పరిస్థితి తీవ్రతను గమనించిన ముంబై క్రికెట్ జట్టు, వెంటనే ముంబై క్రికెట్ అసోసియేషన్‎కు లేఖ రాసింది. స్టేడియం పరిసరాల్లో జరుగుతున్న నిర్మాణ పనులను నియంత్రించేలా మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలితో మాట్లాడాలని కోరింది. ప్లేయర్ల ఆరోగ్యం దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ముంబై లాంటి సముద్ర తీర నగరంలో ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా ఆశ్చర్యకరమే.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే..తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఢిల్లీ జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో 221 పరుగులకు ఆలౌట్ అయింది. ఢిల్లీ ఓపెనర్ సనత్ సంగ్వాన్ (118) అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ముంబై బౌలర్లలో మోహిత్ అవస్తీ 5 వికెట్లతో చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై, మొదటి రోజు ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది. ప్రస్తుతం ముంబై జట్టు ఢిల్లీ కంటే 208 పరుగులు వెనుకబడి ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..