కంటైన్మెంట్ జోన్లలో నేటి నుంచి మరింత స్ట్రిక్ట్
తెలంగాణలోని కరోనా కంటైన్మెంట్ జోన్లలో గురువారం నుంచి మరింత కఠినంగా నిబంధనలను అమలు పరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ కంటైన్మెంట్ జోన్‌కు ఓ ఏసీపీ స్థాయి అధికారిని నియమించడం ద్వారా ఎవరూ ఈ జోన్ల నుంచి బయటికి రావడానికి, బయటి వాళ్ళు కంటైన్మెంట్ జోన్లకు వెళ్ళడానికి అనుమతించకుండా..

తెలంగాణలోని కరోనా కంటైన్మెంట్ జోన్లలో గురువారం నుంచి మరింత కఠినంగా నిబంధనలను అమలు పరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ కంటైన్మెంట్ జోన్‌కు ఓ ఏసీపీ స్థాయి అధికారిని నియమించడం ద్వారా ఎవరూ ఈ జోన్ల నుంచి బయటికి రావడానికి, బయటి వాళ్ళు కంటైన్మెంట్ జోన్లకు వెళ్ళడానికి అనుమతించకుండా.. గట్టిగా భద్రతా ఏర్పాట్లను చేసింది పోలీసు శాఖ. అదేసమయంలో ఈ జోన్లలో వుంటున్న ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా చూసేందుకు జీహెచ్ఎంసీతోపాటు స్థానిక సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. బుధవారం జరిగిన అత్యున్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు మరింత పక్కాగా చర్యలు చేపట్టామని అధికారులు చెబుతున్నారు.
నగరంలో కంటైన్మెంట్ జోన్స్ వద్ద గురువారం నుండి అప్రమత్తత పెంచారు. కంటైన్మెంట్ జోన్స్‌లో ఏసీపీ స్థాయి అధికారితో పాటు నోడల్ అధికారి పరిస్థితులను పర్యవేక్షిస్తారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేసిన పోలీస్ యంత్రాంగం.. కింది స్థాయి సిబ్బందికి మరింత కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలిచ్చింది. కేంద్రం బుధవారం ప్రకటించిన రెడ్ జోన్ల జాబితాలో హైదరాబాద్ నగరంతోపాటు నిజామాబాద్ వంటి కీలక ప్రాంతాలున్నాయి. దాంతో రెండు నగరాల్లో భద్రతా చర్యలు మరింతగా ముమ్మరం చేశారు.
నగరంలో ఉన్న అన్ని కంటైన్మెంట్ జోన్స్ వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. కంటైన్మెంట్ జోన్లలోకి రాకపోకలను పూర్తిగా నిషేధించారు. బయటికి వస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు. అటు నిజామాబాద్ కూడా రెడ్ జోన్ జాబితాలోకి చేరింది. కామారెడ్డి జిల్లా మాత్రం ఆరెంజ్ జోన్‌లో వుంది. నిజామాబాద్‌లో ఇప్పటి వరకు 55 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో రెండు జిల్లాల్లో కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దాంతో రెండు జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఇదిలా వుండగా.. మొదటి దశ లాక్ డౌన్ పీరియడ్‌లో గ్రేటర్ హైద్రాబాద్‌లో మొత్తం 7 లక్షల 74 వేల లాక్ డౌన్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. మొత్తం 40 వేల వాహనాలను సీజ్ చేశారు. హైద్రాబాద్ కమిషనరేట్‌లో 3 లక్షల 24 వేల మూడు కేసులు నమోదు కాగా… సైబరాబాద్‌లో 3 లక్షల 90 వేల 51 కేసులు, రాచకొండలో 60 వేల 7 వందల 75 కేసులు నమోదు అయ్యాయి. ఏప్రిల్ 20వ తేదీలోగా కరోనాను కట్టడి చేయాలన్న సంకల్పంతో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం.