గిరిజనుల జీవించే హక్కును మోదీ ప్రభుత్వం కాలరాస్తోంది

గిరిజనుల హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని మాజీ గిరిజన మంత్రిత్వ శాఖ లీగల్ న్యాయవాది షోమోనా ఖన్నా విమర్శించారు. అటవీ హక్కు చట్టం-2006 కింద భూ యాజమాన్య హక్కు దరఖాస్తులు తిరస్కరణకు గురైన ఆదివాసీలు, ఓటీఎఫ్‌డీలను అటవీ ప్రాంతం నుంచి తొలగించాలని సుప్రీం కోర్టు ఇటీవల 21 రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం గిరిజనుల తరపున పోరాడకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 2013 జూలై నుంచి 2017 […]

గిరిజనుల జీవించే హక్కును మోదీ ప్రభుత్వం కాలరాస్తోంది
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:48 PM

గిరిజనుల హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని మాజీ గిరిజన మంత్రిత్వ శాఖ లీగల్ న్యాయవాది షోమోనా ఖన్నా విమర్శించారు. అటవీ హక్కు చట్టం-2006 కింద భూ యాజమాన్య హక్కు దరఖాస్తులు తిరస్కరణకు గురైన ఆదివాసీలు, ఓటీఎఫ్‌డీలను అటవీ ప్రాంతం నుంచి తొలగించాలని సుప్రీం కోర్టు ఇటీవల 21 రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మోదీ ప్రభుత్వం గిరిజనుల తరపున పోరాడకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

2013 జూలై నుంచి 2017 జూలై వరకు గిరిజన మంత్రిత్వ శాఖకు లీగల్ న్యాయవాదిగా పనిచేసిన షోమోనా ఖన్నా.. గిరిజనుల తరపున తాము ఎన్నో నివేదికలను ప్రభుత్వానికి ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు ఆ శాఖలో ఉన్న న్యాయవాదులను ప్రభుత్వం ఎలా ప్రభావితం చేసిందో తెలీదని.. కానీ వారు గిరిజనుల కోసం సుప్రీంలో పోరాడకపోవడం అన్యాయమని ఆమె అన్నారు. మోదీ ప్రభుత్వం గిరిజనులకు నివసించే హక్కును లేకుండా చేస్తుందని, ఈ కేసులో కనీసం ప్రభుత్వం తరపున లాయర్లు గట్టిగా విచారించలేకపోవడం బాధకరమైన విషయమని షోమోనా అన్నారు.

మరోవైపు ఈ విషయంలో సుప్రీం కోర్టును కూడా ఆమె తప్పుబట్టారు. ఈ తీర్పు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, ఎంతో మంది గిరిజనుల నివసించే స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని షోమోనా స్పష్టం చేశారు. రెండు వైపులా వాదనలు వినకుండా సుప్రీం తీర్పును ఇచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా సుప్రీం కోర్టు ఆదేశం ప్రకారం జూలై 27 నాటికి దాదాపు 11లక్షల కుటుంబాలు అడవుల్ని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇలా జరగకపోతే తీవ్ర పరిణామాలుంటాయని సుప్రీం కోర్టు హెచ్చరించింది. దీనిపై పలు ఎన్జీవోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ చట్టం రాజ్యంగ విరుద్ధంగా ఉందని, దీని వలన అడవులు, అక్కడి జంతువులు, సహజ సంపద నాశనమయ్యే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.