రైతులతో ముగ్గురు సభ్యుల మంత్రివర్గం భేటీ, తోమర్ తో బాటు పీయూష్ గోయెల్ కూడా !
రైతు చట్టాలకు నిరసనగా ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్రం మంగళవారం చర్చలు ప్రారంభించింది. మొదట ఈ చర్చలకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వం వహిస్తారని వార్తలు వచ్చినప్పటికీ ఆ తరువాత మధ్యాహ్నానికి పరిస్థితి..
రైతు చట్టాలకు నిరసనగా ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్రం మంగళవారం చర్చలు ప్రారంభించింది. మొదట ఈ చర్చలకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వం వహిస్తారని వార్తలు వచ్చినప్పటికీ ఆ తరువాత మధ్యాహ్నానికి పరిస్థితి మారింది. ముగ్గురు మంత్రులతో కూడిన బృందం 35 రైతు సంఘాలతో సంప్రదింపులు మొదలుపెట్టింది. వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్..వారితో చర్చలు ప్రారంభించారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో ఇవి మధ్యాహ్నం 3 గంటలకు మొదలయ్యాయి. గత కొన్ని నెలల్లో రెండు పక్షాల మధ్య చర్చలు జరగడం ఇది మూడోసారి. మొదట వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్, ఆ తరువాత నవంబరు 23 న నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయెల్ వీరితో సుమారు ఏడు గంటలపాటు చర్చించారు. కానీ ఎలాంటి ఫలితం తేలలేదు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే అని అన్నదాతలు పట్టుబడుతున్నారు.
మరోవైపు ప్రధాని మోదీ ఈ చట్టాలు రైతులకు మేలే చేస్తాయని,వీటివల్ల ముందుముందు వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు. పార్లమెంటులో ఎంతోసేపు చర్చించాకే తెచ్చామని ఆయన స్పష్టం చేస్తున్నారు. అయితే వీటిని రద్దు చేసేంతవరకు తాము వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని రైతులు అంటున్నారు. దీంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తోంది.