Challenge: సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి.. దమ్ముంటే ఆ ప్రాంతాల నుండి పోటీ చేయాలంటూ చంద్రబాబుకు సవాల్..
ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ఎక్కడ పోటీ చేసినా గెలవలేరు. ఆయన మళ్లీ గెలిస్తే తాను రిటైర్మెంట్...

ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘చిత్తూరు జిల్లాలో చంద్రబాబు ఎక్కడ పోటీ చేసినా గెలవలేరు. ఆయన మళ్లీ గెలిస్తే నేను రిటైర్మెంట్ తీసుకుంటానేమో.. నాకే తెలియదు..’ అని వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు శ్రీకాళహస్తిలో జరిగిన నవరత్నాల విజయోత్సవ సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుకు దమ్ముంటే ఈసారి పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి స్థానాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయాలని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. ఆయన కుప్పంలో పోటీ చేసినా ఓడిపోతారంటూ జోస్యం చెప్పారు.
ఇదే సమయంలో తంబళ్లపల్లిలో టీడీపీ నేతలపై దాడి ఘటనపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఆ ఘటనతో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పర్సంటేజీలు తీసుకుని పనులు చేయని మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అంటే గిట్టని వారు టీడీపీలోనే ఎంతో మంది ఉన్నారని అన్నారు. వారే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి వాహనాలపై దాడులు చేశారని పేర్కొన్నారు. కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి టీడీపీలో చంద్రబాబు జాతీయ స్థాయి పదవి ఇచ్చారని విమర్శించారు. ఇక జడ్జి రామకష్ణ వివాదంపైనా ఆయన తనదైన శైలిలో స్పందించారు. జడ్జి రామకృష్ణ ఎవరో కూడా తనకు తెలియని పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు. ఆయనపై తాను దాడులు చేయిస్తున్నానని రాద్దాంతం చేయడం అర్థంలేని ఆరోపణలని కొట్టిపారేశారు. చనిపోయిన పిన్నమ్మ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫించను సొమ్ము స్వాహా చేశారనే కారణంతో బ్యాంకు అధికారులు జడ్జి రామకృష్ణను అరెస్ట్ చేయించారని పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు.
