బీడు భూములను సాగులోకి తెచ్చిన ఘనత కేసీఆర్ దే: కేటీఆర్
బీడు భూములకు గోదావరి, కృష్ణా జలాలను పారిస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. రాష్ట్రంలో అందరికీ 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని గుర్తు చేశారు. ఇరిగేషన్ శాఖను జలవనరు శాఖగా మార్చామని స్పష్టం చేశారు.

బీడు భూములకు గోదావరి, కృష్ణా జలాలను పారిస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. రాష్ట్రంలో అందరికీ 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని గుర్తు చేశారు. ఇరిగేషన్ శాఖను జలవనరు శాఖగా మార్చామని స్పష్టం చేశారు. సాగు, తాగు నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
మంగళవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేటీఆర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కరీంనగర్ పట్టణ ప్రజలకు ఇక నుంచి ప్రతి రోజు మంచి నీరు అందనుంది. కరీంనగర్ కార్పొరేషన్‌లో రోజూ శుద్ధమైన నీటి సరఫరా కోసం శాతవాహన వర్సిటీలో రూ. 110 కోట్లతో ఏర్పాటు చేసిన మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ తెలంగాణలోనే ఉందన్న మంత్రి.. ఇక విద్యా, వైద్యమే తమ ప్రాధాన్యం అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఏ పని ప్రారంభించినా కరీంనగర్‌లో నాంది పలకడం సంప్రదాయంగా మారిందన్నారు. ఇక్కడి నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధి పనుల విస్తరణ జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. 30 ఏళ్ల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రమంత ఈ పథకం ఆదర్శం కావాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో దీర్ఘకాలిక ప్రణాళికలతో కీలక రంగాలపై దృష్టి పెట్టామని మంత్రి తెలిపారు. కరీంనగర్ జనసాంద్రత ప్రకారం.. అర్బన్ లంగ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్‌కు పరిమితమైన ఐటీ ఇప్పుడు కరీంనగర్ జిల్లాకు విస్తరించిందన్న మంత్రి కేటీఆర్. త్వరలోనే నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. టీ హబ్ ప్రాంతీయ కేంద్రం కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు కాబోతోందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఇతర దేశాల్లో స్థిరపడ్డ కరీంనగర్ వాసులు ముందుకు వచ్చి పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్.




