ప్రతిపక్ష నేతల సెక్యూరిటీపై మహా సర్కార్ కీలక నిర్ణయం.. మాజీ సీఎం ఫడణవీస్‌కు భద్రత కుదింపు
ప్రతిపక్ష నేతల భద్రతపై మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఫడణవీస్ సహా, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన నాయకుడు రాజ్‌ఠాక్రే, కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలేకు..

Reduced The Security : ప్రతిపక్ష నేతల భద్రతపై మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఫడణవీస్ సహా, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన నాయకుడు రాజ్‌ఠాక్రే, కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలేకు భద్రతను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. మహా ప్రభుత్వం సమీక్షా సమావేశం నిర్వహించిన రెండు రోజుల తర్వాత ఈ నిర్ణయం భయటకు వెల్లడయ్యాయి.
వీఐపీలకు భద్రత కల్పించే అంశమై సమీక్ష నిర్వహించడం నిరంతర ప్రక్రియ అంటూ ఓ సీనియర్ అధికారి తెలిపారు. 2019లో చివరిసారి సమీక్ష జరిగిందని అన్నారు. ఆ తర్వాత కరోనా కారణంగా 2020లో నిర్వహించలేదని అన్నారు. కొందరు వీఐపీలకు తాము చేపట్టిన పదవుల కారణంగా ముప్పు పొంచి ఉంటుందని… ఒకవేళ వారు ఆ పదవుల నుంచి వైదొలిగితే ముప్పు పరిస్థితి కూడా మారుతుందని సమీక్షలో పాల్గొన్న ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.
ఇదిలావుంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ తీవ్ర మండిపడింది. మాజీ ముఖ్యమంత్రి ఫడణవీస్ ఇదే అంశంపై స్పందించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తన పర్యటనలు, ప్రణాళికలపై ఎలాంటి ప్రభావం చూపదని అన్నారు. ఉద్ధవ్‌ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని బీజేపీ నేత రామ్ కదమ్ ఆరోపించారు.
మహారాష్ట్ర మాజీ సీఎం ఫడణవీస్‌కు ఇప్పటి వరకూ బుల్లెట్‌ప్రూఫ్ వాహనంతో కూడిన ‘Z ప్లస్’ భద్రత ఉండేది. ఇప్పుడు ‘Y ప్లస్’ కేటగిరీ భద్రతకు కుదించారు. దీంతో ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోనుంది. ఫడణవీస్ సతీమణి అమృతతో పాటు, ఆయన కుమార్తె దివిజల భద్రతను ‘Y ప్లస్’ నుంచి ‘X’ కేటగిరీకి కుదించారు.
అదేవిధంగా ఎంఎన్‌ఎస్ నేత రాజ్‌ఠాక్రే భద్రతను ‘Z’ కేటగిరి నుంచి ‘Y ప్లస్’కు కుదించారు. కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలేకు ‘Y ప్లస్’ భద్రత ఇవ్వనుంది. గతంలో ఆయనకు ‘Y ప్లస్’ భద్రతతో పాటు ఎస్కార్ట్ కూడా ఉండేది. ఇంకా పలువురు ప్రతిపక్ష నేతలకు ప్రభుత్వం భద్రతను కుదిస్తూ నిర్ణయం తీసుకుంది.
