ఉగ్రవాద సమర్థకులను ఏకాకులుగా నిలబెట్టాలన్న వెంకయ్యనాయుడు, పార్లమెంటుపై జరిగిన దాడిలో అమరులైన వీరులకు ఘన నివాళి
సమస్త మానవాళికి, ప్రజాస్వామ్యానికి ఉగ్రవాదం ఓ పెను సవాల్‌గా మారిందని.. వ్యక్తిగత స్వాతంత్ర్యం, ఆర్థిక ప్రగతి వంటి విలువలతో ముందుకెళ్తున్న..
సమస్త మానవాళికి, ప్రజాస్వామ్యానికి ఉగ్రవాదం ఓ పెను సవాల్‌గా మారిందని.. వ్యక్తిగత స్వాతంత్ర్యం, ఆర్థిక ప్రగతి వంటి విలువలతో ముందుకెళ్తున్న ప్రస్తుత ప్రపంచానికి, నాగరికతకు ఉగ్రవాదం అడుగడుగునా విఘాతం కల్గిస్తోందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై జరిగిన ఉగ్రదాడిలో అమరులైన వీరులను గుర్తు చేసుకుంటూ, పార్లమెంటు ఆవరణలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా, కేంద్ర మంత్రులతో కలిసి అమరవీరుల స్మృతికి ఉపరాష్ట్రపతి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సామాజిక మాధ్యమం ద్వారా ఈ ఘటనకు సంబంధించిన తన మనోగతాన్ని ఆయన వెల్లడించారు.
దేశ ప్రజల ప్రాణాలకు కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగాపెట్టిన వారందరి త్యాగాలను దేశం ఎన్నటికీ విస్మరించదన్నారు. పార్లమెంటులోకి ఉగ్రవాదులు చొరబడిన విషయాన్ని గుర్తించి పార్లమెంటు భవనంలో వారి కదలికలను ఎప్పటికప్పుడు సీనియర్ అధికారులకు తెలియజేసిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కమలేశ్ కుమారి ధైర్యసాహసాలను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఆమె చూపిన సాహసం కారణంగానే నాటి ఘటనలో ఉగ్రవాదుల కుట్రలను పసిగట్టి వెంటనే అణచివేయడం సాధ్యమైందన్నారు. ‘దేశాన్ని రక్షించే ప్రయత్నంలో శరీరమంతా బుల్లెట్ గాయాలతోనే వారిని అడ్డుకునేందుకు ఆమె చూపిన తెగువ స్ఫూర్తిదాయకం’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.