కరోనా బాధిత ఆర్టీసీ ఉద్యోగులకు ఉచితంగా కిట్లు..

కరోనా బాధిత ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ అండగా నిలుస్తోంది. కరోనా సోకిన సిబ్బందికి కరోనా కిట్లను అందజేయాలని నిర్ణయించింది. రూ.1300 విలువ చేసే ఒక్కో కిట్‌ను అందించనుంది.

కరోనా బాధిత ఆర్టీసీ ఉద్యోగులకు ఉచితంగా కిట్లు..
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 26, 2020 | 9:25 AM

కరోనా బాధిత ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ అండగా నిలుస్తోంది. కరోనా సోకిన సిబ్బందికి కరోనా కిట్లను అందజేయాలని నిర్ణయించింది. రూ.1300 విలువ చేసే ఒక్కో కిట్‌ను అందించనుంది. ఈ మేరకు ఆర్టీసీ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే చాలా మంది ఆర్టీసీ ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. కరోనా కాటుకు 37 మంది సిబ్బంది ప్రాణాలను సైతం కోల్పోయారు. మరో 300 మందికి పాజిటివ్‌ అని తేలింది. ఇందులో కొంత మంది చికిత్స అనంతరం కోలుకుని ఇళ్లకు వెళ్లిపోగా.. మిగిలిన వాళ్లు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కరోనా పాజిటివ్‌ అని తేలిన ఆర్టీసీ సిబ్బంది అందరికీ ఈ కిట్లను అందజేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు రీజనల్‌ మేనేజర్లు, డివిజనల్‌ మేనేజర్లు, డిపో మేనేజర్లకు ఆదేశాలిచ్చింది. ఈ కిట్లు ప్రస్తుతం తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రి, రాష్ట్రంలోని మిగతా 9 డిస్పెన్సరీల్లో అందుబాటులో ఉంచుతున్నట్లు స్పష్టం చేసింది. కరోనా పాజిటివ్‌ గా నిర్థారణ అయిన సిబ్బంది ఆస్పత్రులు, అధికారులను సంప్రదించి కిట్లను తీసుకెళ్లాలని సూచించింది. ఒక్కో కిట్‌లో 14 రోజులకు సరిపడా మందులు, గ్లౌజులు, మాస్కులను ఉంచింది. పేషంట్‌ బ్లడ్‌లో ఆక్సిజన్‌ స్థాయులను గుర్తించే పల్స్‌ ఆక్సీమీటర్లను కూడా పెట్టింది. ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకునేందుకు వీలుగా వీటిని అందజేస్తోంది. ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం పట్ల ఆర్టీసీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.