AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET పరీక్ష రాయాలని ఒత్తిడి.. తండ్రిని చంపి, ముక్కలుగా నరికిన సొంత కొడుకు!

నీట్ పోటీ పరీక్షకు సిద్ధం కావాలని పదే పదే ఒత్తిడి చేయడంతో తండ్రిని దారుణంగా చంపాడు ఓ కొడుకు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికేశాడు. అనంతరం వాటిల్లో కొన్ని భాగాలను నిర్మానుష్య ప్రదేశాల్లో విసిరేశాడు. మరికొన్ని ముక్కలను ఇంట్లోనే ఓ డ్రమ్‌లో దాచి పెట్టాడు. అయితే ఇంతచేసి చివరకు తండ్రి కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తులో అసలు విషయం తెలుసుకుని షాకయ్యారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

NEET పరీక్ష రాయాలని ఒత్తిడి.. తండ్రిని చంపి, ముక్కలుగా నరికిన సొంత కొడుకు!
son kills father over NEET exam in Lucknow
Srilakshmi C
|

Updated on: Feb 24, 2026 | 8:00 AM

Share

లక్నో, ఫిబ్రవరి 24: లక్నోకు చెందిన 19 ఏళ్ల యువకుడు అక్షత్ ప్రతాప్ సింగ్‌ ఫిబ్రవరి 20 నుంచి తండ్రి మన్వేంద్ర ప్రతాప్ సింగ్ కనిపించకుండా పోయాడంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మన్వేంద్ర ప్రతాప్ సింగ్ మిస్సింగ్‌ కేసును నమోదు చేశారు. ఫిర్యాదు మేరకు వర్ధమాన్ పాథాలజీ యజమాని అయిన మన్వేంద్ర ప్రతాప్ సింగ్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అయితే ఊహించని విధంగా అతడి మృతదేహం అతని సొంత ఇంట్లోని ఓ డ్రమ్ లోపల కనిపించింది. దీంతో వెంటనే పోలీసులు మృతుడి కొడుకు అక్షత్ ప్రతాప్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దర్యాప్తు సమయంలో పోలీసులు అక్షత్ ప్రతాప్ సింగ్‌ను పలు రకాలుగా ప్రశ్నించారు. అప్పటికే విపరీతంగా కృంగిపోయిన నిందితుడు పోలీసుల ఎదుట నేరం అంగీకరించాడు. తండ్రిని చంపినట్లు ఒప్పుకున్నాడు.

నీట్ కి ప్రిపేర్ కావడంపై తన తండ్రి తరచూ ఒత్తిడి చేసి తిట్టేవాడని, దీని వల్ల ఇంట్లో పదే పదే గొడవలు జరిగేవని నిందితుడు పోలీసులకు చెప్పాడు. అక్షత్ బీకాం విద్యార్థి. గతంలో బయాలజీలో 12వ తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. నిందితుడి తల్లి 2018లో మరణించింది. తండ్రి, సోదరితో నివసించేవాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 20న మరోమారు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడంపై తండ్రీ కొడుకుల మధ్య వివాదం చెలరేగింది. దీంతో కోపోద్రిక్తుడైన కొడుకు తన తండ్రిని తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం నిందితుడు మృతదేహాన్ని మూడవ అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఖాళీ గదికి తీసుకువచ్చి ఆధారాలను నాశనం చేయడానికి ప్రయత్నించాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికి, కొన్ని శరీర భాగాలను సదరోనా గ్రామం సమీపంలో విసిరివేసి, మిగిలిన భాగాలను ఇంట్లో ఉంచిన డ్రమ్‌లో దాచిపెట్టాడని పోలీసులు తెలిపారు. శరీరంలోని కొన్ని భాగాలను గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కూడా స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ విక్రాంత్ వీర్ తెలిపారు.

మృతదేహం దొరికిన తర్వాత సీనియర్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ చేపడుతున్నారు. సేకరించిన ఆధారాల ఆధారంగా సంబంధిత విభాగాల కింద కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us