కస్తూర్బా స్కూల్ వైరల్ వీడియో: దేవతలు, దయ్యాలు అంటూ విద్యార్థినితో టీచర్ సంభాషణ
Jagityal Teacher-Student Viral Video: జగిత్యాల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థినితో దేవతలు, దయ్యాల ప్రస్తావనతో మాట్లాడిన వీడియో వైరల్గా మారింది. విద్యార్థిని మానసిక ఆందోళనలో ఉన్నప్పుడు ఉపాధ్యాయురాలు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ, సమస్యలను సున్నితంగా పరిష్కరించాల్సిన బాధ్యతపై చర్చకు దారితీసిన ఈ ఘటన విద్యాశాఖ చర్యల కోసం ఎదురుచూస్తోంది.

Jagityal Teacher-Student Viral Video: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలోనీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థినితో మాట్లాడిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విద్యార్థినితో దేవతలు, దయ్యాల ప్రస్తావన చేస్తూ ప్రశ్నలు అడుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలలో ఓ విద్యార్థిని ఒంటరిగా ఏడుస్తుండటాన్ని గమనించిన ఉపాధ్యాయురాలు ఆమెను పిలిచి మాట్లాడినట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే, ఆ సంభాషణలో మైసమ్మ పూజ, దేవతలు, దయ్యాల ప్రస్తావన రావడం చర్చకు దారితీసింది. మరోవైపు, విద్యార్థినితో మాట్లాడుతున్న సమయంలోనే ఉపాధ్యాయురాలు మరో బాలికతో తనకు జడ వేయించుకున్నట్లు కూడా వీడియోలో కనిపిస్తోంది.
విద్యార్థినులు మానసిక ఆందోళనకు గురైనప్పుడు వారికి ధైర్యం చెప్పి, సమస్యకు గల కారణాలను సున్నితంగా తెలుసుకోవాల్సిన బాధ్యత పాఠశాల సిబ్బందిపై ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయురాలి వ్యవహారంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, విద్యార్థిని ఆందోళనకు అసలు కారణం ఏమిటన్నది అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.
నాలుగు రోజుల క్రితం జరిగినట్లు చెబుతున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి రావడంతో విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయులు వ్యవహరించాల్సిన తీరుపై చర్చ మొదలైంది. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందించి, వాస్తవాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారా? అనేది వేచి చూడాలి.
వీడియో చూడండి..
