Telangana: హైదరాబాద్ ప్రజలకు ప్రభుత్వం దసరా గిఫ్ట్.. మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
హైదరాబాద్ ప్రజలకు త్వరలో తెలంగాణ ప్రభుత్వం పండుగ శుభవార్త అందించే అవకాశముంది. ఆర్టీసీ-మెట్రో సేవలను సులువుగా ఉపయోగించుకునేందుకు కామన్ మొబిలిటీ పాస్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పాస్ ధరలను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ధర ఎక్కువగా ఉండటంతో ఎవరూ ఆసక్తి చూపించడం లేదు.

హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపర్చేందుకు ఇటీవల మెట్రో-ఆర్టీసీ సేవలకు కామన్ మొబిలిటీ పాస్‌ను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి రోజున ఈ పాస్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేశారు. ఈ పాస్ ద్వారా హైదరాబాద్ పరిధిలో తిరిగే ఆర్టీసీ బస్సులతో పాటు మెట్రోలలో ఎక్కడినుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఈ పాస్ ఉంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో ఎన్నిసార్లు అయినా ప్రయాణించవచ్చు. మెట్రో, ఆర్టీసీ కలిపి ఈ కామన్ పాస్‌ను రూపొందించాయి. దీని వల్ల ప్రతీసారి మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు టికెట్ తీసుకోవాల్సిన అవసరముండదు. ఈ కామన్ పాస్ ఉపయోగించడం వల్ల జస్ట్ ఒక్క స్కాన్‌తో ప్రయాణం చేయవచ్చు. దీని వల్ల సమయం ఆదా అవ్వడంతో పాటు ప్రయాణం వేగవంతమవుతుంది.
టికెట్ల కోసం నో వెయిటింగ్..
టికెట్ల తీసుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ కోసం వెయిట్ చేయాల్సిన పని ఉండదు. అలాగే మెట్రో స్టేషన్లలో కౌంటర్ల దగ్గర క్యూలైన్లలో నిల్చోవాల్సిన అసవరం ఉండదు. ఈ కామన్ పాస్ ఉంటే నేరుగా ఎంట్రీ గేట్ల దగ్గర స్కాన్ చేసి మెట్రోలలో ప్రయాణించవచ్చు. ఇక బస్సుల్లో ప్రతీసారి టికెట్ తీసుకోవాల్సిన పని ఉండదు. కామన్ పాస్ వల్ల టికెట్ కష్టాలు తొలగిపోగా. దీని ధరలు అధికంగా ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం రోజువారీ కామన్ పాస్ ధర రూ.400గా ప్రభుత్వం ఫిక్స్ చేసింది. ఇందులో మెట్రో వాటా రూ.300, ఆర్టీసీ వాటా రూ.100 ఉంది. ఇక నెలవారీ పాస్ ధర రూ.8,500గా ఉండగా.. ఇందులో మెట్రో వాటా రూ.7 వేలు, ఆర్టీసీ వాటా రూ.1500గా ఉంది. అధిక ధరలు ఉండటం వల్ల ఈ పాస్‌లకు ఆదరణ తగ్గింది. ఎక్కువమంది ప్రయాణికులు వీటివైపు కూడా చూడటం లేదు. దీంతో కామన్ పాస్ ధరలపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
పాస్ ధరలు త్వరలో తగ్గింపు..
ఈ క్రమంలో కామన్ పాస్ ధరలను తగ్గించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికులతో పాటు వివిధ వర్గాల నుంచి కూడా ఇవే అభిప్రాయాలు ప్రభుత్వానికి అందాయి. దీంతో కామన్ పాస్ ధరలను తగ్గించే విషయంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. కామన్ పాస్ ధరలను పున:పరిశీలిస్తోంది. దీంతో పాస్ ధరలు తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజల అభిప్రాయాలు, క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేసిన అనంతరం ప్రభుత్వం పున:పరిశీలన చేపట్టే ఆలోచనలో ఉందని స్పష్టం చేశారు.
