ఏసీ, ఫ్రిజ్ ఎంత వాడినా కరెంట్ బిల్లు తక్కువ రావాలా? దీనికి మంచిన బెస్ట్ ఆప్షన్ మరోటి లేదు!
రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు హైదరాబాద్ వాసులు సౌర విద్యుత్ వైపు మొగ్గు చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ సబ్సిడీతో పాటు సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉండటంతో రోజురోజుకూ ఈ పథకానికి ఆదరణ పెరుగుతోంది. మరీ దీన్ని ఎలా పొందాలి.. అర్హులు ఎవరో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

దేశ ప్రజలకు విద్యుత్ ఛార్జీలు తగ్గించి, సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం గురించి అందరికీ తెలిసిందే. అయితే రోజురోజుకూ ఈ పథకానికి ఆదరణ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పీఎం సూర్యఘర్ పథకం కింద 44,662 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 29,816 దరఖాస్తులకు ఆమోదం లభించింది. హైదరాబాద్ మెట్రో జోన్‌లో 2026 ఆగస్టు చివరి నాటికి 4,749 మంది 22.33 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ వ్యవస్థల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3,615 మంది 15.70 మెగావాట్ల సామర్థ్యానికి సంబంధించిన ఇన్‌స్టాలేషన్ వివరాలు సమర్పించారు. 3,346 మందికి చెందిన 14.43 మెగావాట్ల సామర్థ్యం గల వ్యవస్థలకు తనిఖీలు పూర్తయ్యాయి. ఇప్పటికే సోలార్ విద్యుత్ వినియోగిస్తున్న 2,995 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.23.81 కోట్ల సబ్సిడీని జమ చేశారు.
సొంత ఇంటితో పాటు పైకప్పు స్థలం తప్పనిసరి
పీఎం సూర్యఘర్ పథకం కింద ప్రయోజనం పొందాలంటే దరఖాస్తుదారుడికి సొంత ఇల్లు, యాక్టివ్ విద్యుత్ కనెక్షన్ ఉండాలి. సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు తగిన పైకప్పు స్థలం అందుబాటులో ఉండాలి. గతంలో ప్రభుత్వ సోలార్ సబ్సిడీ పొందని వారు పథకం నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా ఒక్కో కిలోవాట్ సామర్థ్యానికి 80 నుంచి 100 చదరపు అడుగుల స్థలం అవసరమవుతుంది. అర్హులు https://pmsuryaghar.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఒక కిలోవాట్‌తో చిన్న కుటుంబాలకు ప్రయోజనం
తక్కువ విద్యుత్ వినియోగం ఉన్న కుటుంబాలకు ఒక కిలోవాట్ సోలార్ వ్యవస్థ ఉపయోగకరంగా ఉంటుంది. సూర్యరశ్మి, వాతావరణ పరిస్థితులను బట్టి రోజుకు సుమారు 4 నుంచి 5 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కావచ్చు. దీంతో ఎల్‌ఈడీ బల్బులు, సీలింగ్ ఫ్యాన్లు, టీవీ, చిన్న ఫ్రిజ్ వంటి పరికరాలను వినియోగించుకోవచ్చు. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ఛార్జింగ్ అవసరాలకూ ఈ విద్యుత్ ఉపయోగపడుతుంది. అయితే ఏసీ వంటి అధిక విద్యుత్ వినియోగం ఉన్న పరికరాలను ఒక కిలోవాట్ వ్యవస్థపై నడపడం సాధారణంగా సాధ్యం కాదు.
రెండు కిలోవాట్లతో మరిన్ని పరికరాలు
మధ్యతరగతి కుటుంబాలకు రెండు కిలోవాట్ల సోలార్ వ్యవస్థ కొంత మెరుగైన ఎంపికగా ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో రోజుకు సుమారు 8 నుంచి 10 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కావచ్చు. బల్బులు, ఫ్యాన్లు, టీవీ, ఫ్రిజ్‌తో పాటు కూలర్ లేదా వాషింగ్ మెషీన్ వంటి పరికరాలను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఒక టన్ను ఇన్వర్టర్ ఏసీని కూడా పరిస్థితులకు అనుగుణంగా పగటిపూట నడపవచ్చు. అయితే ఏసీతో పాటు ఇతర పరికరాలన్నింటినీ ఒకేసారి వినియోగిస్తే ఉత్పత్తి అయ్యే విద్యుత్ సరిపోకపోవచ్చు.
మూడు కిలోవాట్లతో ఏసీ వినియోగం
ఇంట్లో ఏసీ, వాటర్ మోటార్ వంటి పరికరాలను ఎక్కువగా వినియోగించే కుటుంబాలకు మూడు కిలోవాట్ల సోలార్ వ్యవస్థ అనుకూలంగా ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో రోజుకు 12 నుంచి 15 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి కావచ్చు. బల్బులు, ఫ్యాన్లు, టీవీలు, ఫ్రిజ్‌తో పాటు సామర్థ్యానికి తగిన ఇన్వర్టర్ ఏసీని పగటిపూట ఉపయోగించుకోవచ్చు. అయితే విద్యుత్ ఉత్పత్తి, ఏసీ సామర్థ్యం, ఇతర పరికరాల వినియోగాన్ని బట్టి ఫలితాలు మారుతాయి.
సబ్సిడీతో తగ్గనున్న ఖర్చు
సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు అయ్యే ప్రారంభ ఖర్చులో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ కీలక పాత్ర పోషిస్తోంది. ఒక కిలోవాట్ వ్యవస్థకు సుమారు రూ.30 వేలు, రెండు కిలోవాట్లకు రూ.60 వేలు, మూడు కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వ్యవస్థలకు గరిష్ఠంగా రూ.78 వేల వరకు సబ్సిడీ లభించే అవకాశం ఉంది. అయితే వాస్తవ సబ్సిడీ మొత్తం పథకం నిబంధనలు, వ్యవస్థ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. సోలార్ ప్యానెళ్ల ధరలు కూడా పరికరాల నాణ్యత, విక్రేత, ఇన్‌స్టాలేషన్ ఖర్చులను బట్టి మారుతాయి.
మిగులు విద్యుత్‌తోనూ ప్రయోజనం
ఇంటి అవసరాలకు మించి సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయితే, నెట్ మీటరింగ్ నిబంధనల ప్రకారం మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపించే అవకాశం ఉంటుంది. దీనివల్ల వర్తించే నిబంధనల ప్రకారం విద్యుత్ బిల్లులో సర్దుబాటు ప్రయోజనం పొందవచ్చు. ప్రభుత్వ సబ్సిడీ, విద్యుత్ ఖర్చుల తగ్గింపు, బ్యాంకు రుణ సదుపాయాలు వంటి అంశాలు నగరవాసులను సోలార్ విద్యుత్ వైపు ఆకర్షిస్తున్నాయి. దీంతో హైదరాబాద్‌లో రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటుకు ఆసక్తి క్రమంగా పెరుగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
