AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagganna Thota Prabhala Theertham: 11 రుద్రులు కొలువైన ప్రాంతం జగ్గన్న తోట.. 400 ఏళ్ల చరిత్ర గల ప్రభల తీర్ధం విశిష్టత ఏమిటంటే..?

ప్రాచీన కాలంలో మొట్టమొదటి గా ఈ తోటలోనే ఈ పదకొండు గ్రామాల రుద్రులు సమావేశమయ్యారని ప్రతీతి. ఈ తోటలో ఏ విధమైన గుడి గానీ, గోపురంగానీ వుండవు. ఇది పూర్తిగా కొబ్బరి తోట. ఈ ఏకాదశ రుద్రులు సంవత్సరానికి ఒకసారి

Jagganna Thota Prabhala Theertham: 11 రుద్రులు కొలువైన ప్రాంతం జగ్గన్న తోట.. 400 ఏళ్ల చరిత్ర గల ప్రభల తీర్ధం విశిష్టత ఏమిటంటే..?
Surya Kala
|

Updated on: Jan 08, 2021 | 5:13 PM

Share

Jagganna Thota Prabhala Theertham: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాతి పండువ ఓ ఎత్తైతే.. అందాల సీమ కోనసీమ లో సంక్రాతి సంబరాలు మరో ఎత్తు. సంక్రాంతి అంటే కొత్త ధ్యాన్యం, కొత్త అల్లులు, కోడిపందాలు, కొత్త సినిమాలు.. అయితే కనుమ రోజున కోనసీమలో జరుపుకునే ప్రభల తీర్ధం ఎంతో ప్రాశస్యం సంతరించుకుంది. కోనసిమ అంటేనే వేదసీమ అని పెద్దల ఉవాచ. అటువంటి వేదసీమలో తరతరాల నుంచి జరుగుతున్న “జగ్గన్నతోట” ప్రభల తీర్థం వైభవాన్ని ఇంతింతా అని చెప్పరానిది. మకర సంక్రమణ ఉత్తరాయణ మహా పుణ్య కాలం లో కనుమనాడు జగ్గన్నతోట” లో జరిగే ఏకాదశ రుద్రుల సమాగమము అత్యంత చీనమైన, చారిత్రాత్మకమైన, అతిపురాతనమైన, పవిత్రమైన సమాగమము. ప్రాచీన కాలంలో మొట్టమొదటి గా ఈ తోటలోనే ఈ పదకొండు గ్రామాల రుద్రులు సమావేశమయ్యారని ప్రతీతి. ఈ తోటలో ఏ విధమైన గుడి గానీ, గోపురంగానీ వుండవు. ఇది పూర్తిగా కొబ్బరి తోట. ఈ ఏకాదశ రుద్రులు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ సమావేశం అవ్వడంతో ఈ తోట విశేష ప్రాధాన్యత సంతరించుకుంది.

జగ్గన్నతోట ఇది ఏకాదశ రుద్రుల కొలువు. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారము ఏకాదశ రుద్రులు ఒక్కచోట కొలువు తీరేది ప్రపంచం మొత్తం మీదా.. అసలు ఈ భూమండలం మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క చోటు ఈ జగ్గన్న తోట అని స్థానికులు చెబుతారు. అంతేకాదు.. ఆలయమే లేని ఈ స్థలానికి ఒక కథ ఉందంటూ స్థలం పురాణం కూడా వివరిస్తారు. కనుమ రోజున లోక కల్యాణార్ధం పదకొండు గ్రామాల శివుళ్ళు సమావేశం అయ్యి లోక విషయాలు చర్చిస్తారని ప్రతీతి. సుమారు 400 సంవత్సరాల క్రితం నుండీ ఈ సంప్రదాయం వుందనీ తీవ్రమైన పరిస్థితులు వచ్చిన 17 వ శతాబ్ధములో ఈ 11 గ్రామాల రుద్రులు ఈ తోటలోనే సమావేశం అయ్యి లోక రక్షణ గావించారనీ ప్రతీతి. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతీ ఏడాది కనుమ రోజున ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఈ 11మంది రుద్రులను ఒక్కచోట చేరుతారని గ్రామస్తులు నమ్మకంగా చెబుతారు. ఈ తోట అప్పట్లో సంస్థానదీశులైన శ్రీ రాజా వత్సవాయి జగన్నాధ మహారాజు కు చెందినదని.. కాలక్రమంలో ఈ తోట జగ్గన్న తోట అనే పేరుతో స్థిరపడింది.

ఈ తోటలో వ్యాఘ్రేశ్వరం నుంచి శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామి బాలాత్రిపురసుందరీ సమేతంగా .. పుల్లేటికుర్రు-అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి కూడా బాలా త్రిపుర సుందరి తో విచ్చేస్తారు. ఇక మధుమానంత భోగేశ్వర స్వామి మొసళ్ళపల్లి నుంచి , గంగలకుర్రు నుంచి చెన్నమల్లేశ్వరుడు, అగ్రహారం నుంచి వీరేశ్వరుడు, పెదపూడి నుంచి మేనకేశ్వరుడు, ఇరుసుమండ నుంచి ఆనంద రామేశ్వరుడు, వక్కలంక విశ్వేశ్వరుడు, నేదునూరు చెన్న మల్లేశ్వరుడు, ముక్కామల రాఘవేశ్వరుడు, పాలగుమ్మి-చెన్న మల్లేశ్వరుడుగా ప్రభలపై ఊరేగుతూ వీధులు.. చేలు.. తోటలను పుణీతం చేస్తూ తోటలో కొలువుదీరాయి. ఈ ఏకాదశ రుద్రులను చూడడానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ గ్రామం తిరునాళ్లు చూసినా ఇసుక వేస్తే రాలని జనంతో కిటకిటలాడతాయి. సముద్ర ఘోషను తలపించేలా వేలాది మంది భక్తుల ఓంకార నాదాలు..వందల మంది భక్తులు తమ భుజస్కాందాలపై ప్రభులను మోస్తూ ముందుకు సాగుతారు.

ఈ తోట మొసలపల్లి గ్రామములో వుంది కనుక దీనికి ఆతిధ్యము మొసలపల్లికి చెందిన మధుమానంత భొగేశ్వరుడు మిగతా గ్రామ రుద్రులకు ఆతిధ్యము ఇస్తారు. ఈ రుద్రుడు అన్ని ప్రభల కన్నా ముందే తోటకు చేరుకుని అందరు రుద్రులూ తిరిగి వెళ్లిన తరువాత వెళ్లడం ఆనవాయితీ. ఈ ఏకాదశ రుద్రులకు అద్యక్షత వహించేది వ్యాఘ్రేశ్వారానికి చెందిన రుద్రుడు.”శ్రీ వ్యాఘ్రేశ్వరుడు”. అందుకనే ఈ వ్యాఘ్రేశ్వరుడు కి చెందిన ప్రభ తోటలోకి రాగానే మిగతా రుద్ర ప్రభలన్నింటినీ మర్యాదా పూర్వకంగా ఒక్కసారి లేపి మళ్ళి కిందకు దించుతారు. ఈ 11 శివుళ్ళకు వ్యాఘ్రేశ్వరుడు అధిష్టానము. ఇక్కడ మరో విశిష్టత ఏమిటీ అంటే గంగలకుర్రు మరియూ గంగలకుర్రు(అగ్రహారం) రుద్ర ప్రభలు ఈ తోట కి రావాలంటే మధ్యలో పెద్ద కాలువ దాటాలి. ఆ ప్రభలు ఆ కాలువలోంచి ఏ మాత్రం తొట్రూ లేకుండా “హరా హరా” అంటూ తీసుకువచ్చే ఆ గ్రామస్తుల ధైర్యం చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఎందుకంటే కాలువలో మామూలుగానే నడువలేము. అలాంటిది ఒక 30 మంది మోస్తే కానీ లేవని ప్రభ ఆ కాలువలోంచి తోటలోకి తీసుకువచ్చే సన్నివేశం చూసేవారికి ఒల్లు గగుర్పొడుస్తుంది.ఇక ఆ కాలువలోకి వచ్చే ముందు ఒక వరి చేనుని ఆ ప్రభలు దాటవలిసి వస్తుంది. ఆ చేను ని తొక్కుతూ పంటను తొక్కుతూ వచ్చినా రైతులు భాదపడక సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు తమ చేల గుండా వెళ్ళడం పూర్వజన్మ సుకృతం గా భావిస్తారు. అలా ఏక కాలం లో ఏకాదశ రుద్రుల దర్శనం చేసుకుంటూ భక్తులు పులకించిపోతారు.

చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్న ఈ జగ్గన్న తోట ప్రభల తీర్ధం ఆకాశమే హద్దుగా జరుగుతుంది. ఈ తీర్ధానికి స్థానికులు, జిల్లాలనుంచి కాదు దేశ విదేశాలనుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. సంప్రదాయ వస్త్రధారణలతో యువతులు ప్రభల అందాలతో పోటీ పడతారు. వృద్ధులు, యువకులు, మహిళలు అనే తేడా లేకుండా తీర్థానికి వచ్చి సందడి చేస్తారు.