ఇంట్లో గాజు పగిలితే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
మన ఇళ్లలో రోజువారీ ఉపయోగించే వస్తువులలో గాజు పరికరాలు లేదా అద్దాలు కూడా అతి ముఖ్యమైన వస్తువులు. అయితే, ఎప్పుడైనా గాజు వస్తువు చెయ్యి జారి పగిలిపోయినప్పుడు మన మనస్సులో ఏదో తెలియని భయం, శంక మొదలవుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం గాజు పగలడం అనేది కేవలం ఒక ప్రమాదం మాత్రమే కాదు, దాని వెనుక కొన్ని ఆధ్యాత్మిక, వాస్తు సంకేతాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఇంట్లో హఠాత్తుగా గాజు గ్లాసు, అద్దం లేదా ఇతర గాజు వస్తువులు పగిలిపోవడం మనం తరచుగా చూస్తూ ఉంటాం. సనాతన ధర్మం, వాస్తు శాస్త్రం ప్రకారం, గాజు పగలడం వెనుక కొన్ని ప్రత్యేక సంకేతాలు దాగి ఉన్నాయని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.. సాధారణంగా గాజు వస్తువు పగిలితే ఏదో అశుభం జరుగుతుందని భావిస్తారు.. కానీ, వాస్తు ప్రకారం ఇది ఎల్లప్పుడూ అశుభం కాదు. ఇంట్లో రాబోయే పెద్ద ప్రమాదాన్ని లేదా ప్రతికూల శక్తిని గాజు వస్తువు తనపైకి తీసుకుని పగిలిపోతుందని నమ్ముతారు. అయినప్పటికీ, పగిలిన గాజును ఇంట్లో ఉంచడం వాస్తు దోషానికి దారితీస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
గాజు పగలడం శుభ సంకేతమా?:
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి ఎక్కువైనప్పుడు లేదా కుటుంబ సభ్యులపైకి ఏదైనా పెద్ద ముప్పు లేదా రాబోయే ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు, ఆ నెగటివ్ ఎనర్జీని గాజు వస్తువు పీల్చుకుని పగిలిపోతుందని నమ్ముతారు.
ఆపదలు తొలగిపోవడం: ఇంట్లోని పెద్ద ప్రమాదాన్ని గాజు తనపైకి తీసుకుని పగిలిపోయిందని, దీనివల్ల రాబోయే సంక్షోభం తొలిగిపోయిందని భావిస్తారు.
ఆర్థిక లాభం: కొన్ని సందర్భాల్లో గాజు పగలడం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోయి, త్వరితగతిన నిలిచిపోయిన ధనం తిరిగి వస్తుందని కూడా విశ్వసిస్తారు.
పగిలిన గాజు ఇంట్లో ఉంటే ఏమవుతుంది?:
గాజు పగలడం వల్ల ప్రతికూల శక్తి నశించినప్పటికీ, పగిలిన గాజు ముక్కలను ఇంట్లోనే ఉంచుకోవడం తీవ్రమైన వాస్తు దోషానికి దారితీస్తుంది.
కుటుంబంలో కలహాలు: ఇంట్లో పగిలిన అద్దాలు లేదా గాజు పాత్రలు ఉంటే కుటుంబ సభ్యుల మధ్య మానసిక ప్రశాంతత తగ్గి, చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతాయి.
ఆర్థిక నష్టం: పగిలిన గాజు నెగటివ్ వైబ్రేషన్లను వేగంగా ఆకర్షిస్తుంది. దీనివల్ల అనవసరమైన ఖర్చులు పెరిగి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.
వాస్తు ప్రకారం పాటించాల్సిన జాగ్రత్తలు:
వెంటనే తొలగించండి: గాజు పగిలిన వెంటనే ఆ ముక్కలను శుభ్రం చేసి ఇంటికి దూరంగా పడేయాలి.
శబ్దాలు రాకుండా చూడాలి: రాత్రి వేళల్లో గాజు పగలకుండా జాగ్రత్త పడటం శ్రేయస్కరం.
పూజ గదికి దూరంగా: పగిలిన ఎలాంటి వస్తువునూ పూజ గదిలో లేదా ప్రవేశ ద్వారం వద్ద ఉంచకూడదు.
ఈ విధంగా వాస్తు నియమాలను పాటించడం ద్వారా ఇంట్లోని ప్రతికూలతలను తొలగించి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని, ప్రశాంతతను పొందే అవకాశం ఉంటుంది.
(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న ఆచారాలు సంప్రదాయాలు, విశ్వాసాల ఆధారంగా ఉన్నాయి. కుటుంబం, ప్రాంతాన్ని బట్టి ఆచారాలు మారవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)




