నకిలీ చెక్కుల కుంభకోణంలో తీగలాగుతున్న ఏసీబీ
సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల కుంభకోణంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఓవైపు తుళ్లూరులో పోలీసులు...మరోవైపు కృష్ణా జిల్లాలోని బ్యాంకుల్లో ఏసీబీ అధికారులు విచారిస్తుండగానే ...ఇటు కడప జిల్లాలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని ఫోర్జరీ చేసి...
సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల కుంభకోణంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఓవైపు తుళ్లూరులో పోలీసులు…మరోవైపు కృష్ణా జిల్లాలోని బ్యాంకుల్లో ఏసీబీ అధికారులు విచారిస్తుండగానే …ఇటు కడప జిల్లాలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని ఫోర్జరీ చేసి భారీగా క్యాష్ విత్ డ్రా చేసుకున్నట్లు గుర్తించారు అధికారులు. వాళ్లని గుర్తించి…పట్టుకునే పనిలో పడ్డారు.
సంచలనం సృష్టించిన ఏపీ సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల కుంభకోణంలో కొత్త లింకులు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు ఢిల్లీ, కర్నాటక, వెస్ట్ బెంగాల్‌కి చెందిన వాళ్లే ఈ కుంభకోణానికి పాల్పడ్డారని భావించినప్పటికి ఏపీలో కూడా అక్రమాలు బయటపడ్డాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఫోర్జరీ చేసి 9 లక్షల 95 వేల రూపాయల నగదును గుర్తు తెలియని వ్యక్తులు విత్ డ్రా చేసుకున్నారు. ఇది గుర్తించిన స్టేట్ బ్యాంక్ అధికారులు ప్రొద్దుటూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పొందిన బాధితుల నుండి ముందుగానే డబ్బులు ఇచ్చి వారి నుండి చెక్కులను తీసుకొని ఫోర్జరీ చేసి అధిక మొత్తంలో డబ్బును బ్యాంకు నుండి తీసుకున్నారు. ఇది గమనించిన బ్యాంకు అధికారులు ప్రొద్దుటూరు రూరల్, త్రీ టౌన్, టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లలో కేసులు పెట్టారు. అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ప్రొద్దుటూరు డిఎస్పీ సుధాకర్ తెలిపారు.